జగన్ నిర్ణయంపై వైసీపీ మాజీ ఎంపీల అసంతృప్తి

తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఏపీలోనే కాక, దేశ వ్యాప్తంగా కాక రేపుతోంది. దొరికిందే తడవుగా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమై పార్లమెంట్‌ వేదికగా ఆ పార్టీపై ఎదురుదాడికి దిగుతున్నాయి. దీంతో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. బీజేపీ ఏపీ ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ ఎన్డీయే నుంచి బయటికి వచ్చిన టీడీపీ అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంది. ప్రభుత్వం ఈ విషయంలో ఆలస్యంగా స్పందించిందంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శించినా.. తమ ఎంపీలతో వారి పదవులకు రాజీనామా చేయించి వైసీపీ పోరాటం చేయకుండానే నిష్క్రమించడంతో ఇప్పుడు ఏపీ తరపున పోరాటం సాగిస్తున్న ఏకైక పార్టీగా టీడీపీ నిలిచింది. దీంతో ఆ పార్టీకి ఏపీ ప్రజల నుంచి మద్దతు పెరుగుతోంది.

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ.. తమ రాష్ట్రానికి అన్యాయం చేసిందనే కారణంతో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టి అందరి చేత శెభాష్ అనిపించుకుంటుంటే.. మరో పక్క ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఉన్న వైసీపీ మాత్రం ఏపీ ప్రజల దృష్టిలో జీరోగా మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించడంలేదనే కారణంతో ఆ పార్టీకి చెందిన ఎంపీలందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. ఫలితంగా ఆ పార్టీ అవిశ్వాసంపై జరుగుతున్న చర్చకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి సందర్భంలో దేశ వ్యాప్తంగా అవిశ్వాస తీర్మానం గురించి చర్చించుకుంటోంటే.. ఆ పార్టీ నేతలు మాత్రం వేరే విషయం గురించి మాట్లాడుకుంటున్నారట. అంతేకాదు ఆ పార్టీ అధినేత తీరుపైనా పరోక్షంగా విమర్శల వర్షం కురిపిస్తున్నారని టాక్.

అవిశ్వాసాన్ని మోదీ ప్రభుత్వం గత సమావేశాల్లో చర్చకు రానివ్వకుండా అడ్డుకుని.. ఇప్పుడు అనూహ్యంగా అంగీకరించడంపై వైసీపీ మాజీ ఎంపీలు అసహనంగా ఉన్నారని తెలుస్తోంది. ‘‘అవిశ్వాస తీర్మానంపై జరిగుతున్న చర్చను దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. ఇంత కీలక సమయంలో లోక్‌సభలో మా పార్టీ గళాన్ని వినిపించలేకపోతున్నాం. మేమూ సభలో ఉంటే బాగుండేది. అటు టీడీపీ ఎంపీలు మాత్రం తమ గళాన్ని వినిపిస్తూ అందరి చేతా శెభాష్ అనిపించుకుంటుంటే.. మా అధినేత తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఏపీ ప్రజల దృష్టిలో తల దించుకోవల్సి వస్తోంది’’ అని వైసీపీ మాజీ ఎంపీలు జగన్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం. తమ ఎంపీలతో రాజీనామా చేయించి క్రెడిట్ కొట్టేద్దామనుకుంటే అది కాస్తా బెడిసి కొట్టడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.