వైసీపీ పోటీ చేస్తుందట.. అదీ ఈ స్థానాల్లోనే

తెలంగాణలో ఎన్నికల హడావిడి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఊహించని విధంగా రాష్ట్రంలో చాలా పార్టీలు ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి. ప్రధాన పార్టీలతో పాటు కొత్త పార్టీలు కూడా ఎన్నికల కోసం కుతూహలంతో ఎదురు చూస్తున్నాయి. ప్రధాన పార్టీల్లో టీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ఒకడుగు ముందుందనే చెప్పాలి. అసెంబ్లీని రద్దు చేసిన రోజే 105 మంది అభ్యర్ధులను ప్రకటించి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు కేసీఆర్. అందుకు తగ్గట్టే మిగతా పార్టీలు కూడా అంతే దూకుడు ప్రదర్శిస్తున్నాయి. టీఆర్ఎస్ కంటే ప్రతిపక్షాలే బాగా హడావిడి చేస్తున్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం మరో రెండు పార్టీలతో కలిసి మహాకూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభించేశాయి. ఇక, సీట్ల సర్ధుబాటు కూడా పూర్తయితే రేపో మాపో దీని గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటితో పాటు పది చిన్న పార్టీలతో బహుజన ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని చెప్పిన సీపీఎం కూడా ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. అయితే, ఆ పార్టీ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనతో పొత్తు పెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకోసం ఆ పార్టీ అధ్యక్షుడు తమ్మినేని వీరభద్రం పవన్‌కు లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే.

ఇక, ఇందులో మిగిలిన పార్టీ ఏదైనా ఉందా అంటే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆ పార్టీ తెలంగాణలో పోటీ చేయడంపై క్లారిటీ ఇచ్చేసింది. తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో వైసీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు, ఎన్నికల్లో అభ్యర్ధులను నిలపడానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర యూత్‌ ప్రధాన కార్యదర్శి బూర సుమన్‌గౌడ్‌ తెలిపారు. అయితే, పోటీ చేయడం కన్ఫార్మే అయినా ఏ స్థానాల్లో అభ్యర్ధులను నిలబెట్టాలనే దానిపై ఇంకా నిర్ణయించుకోలేదని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన మూడు స్థానాలతో పాటు, నర్సంపేట, వరంగల్ జిల్లాలోని రెండు స్థానాలు, నల్గొండ జిల్లాలోని రెండు స్థానాలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని రెండు స్థానాలతో పాటు, గ్రేటర్‌ పరిధిలోని మూడు నుంచి నాలుగు స్థానాల్లో అభ్యర్ధులను నిలబెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ పోటీ చేస్తే గెలవడమేమోగానీ, వైఎస్ అభిమానుల ఓట్లతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి టీఆర్ఎస్‌కే మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.