చెత్త రికార్డులో య‌డ్డీకి సెకండ్ ప్లేస్!

చెత్త రికార్డులో య‌డ్డీకి సెకండ్ ప్లేస్!
సీఎం ప‌ద‌వి పోయినా.. కొత్త రికార్డు సృష్టించిన య‌డ్డీ
క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రెండు రోజుల‌కే.. అనూహ్య ప‌రిణామాల నేప‌థ్యంలో త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది బీజేపీ సీనియ‌ర్ నేత య‌డ్యూర‌ప్ప‌కు. రెండంటే రెండు రోజులు మాత్రమే సీఎం కుర్చీలో కూర్చున్న ఆయ‌న‌కు తీవ్ర అవ‌మాన‌భారం త‌ప్ప‌లేదు. 
ముచ్చ‌ట‌గా మూడోసారి క‌ర్ణాట‌కకు ముఖ్య‌మంత్రి అయ్యార‌న్న పేరుతో పాటు.. రెండు రోజుల సీఎం అన్న మ‌చ్చ‌ను య‌డ్డీ వేయించుకున్నారు. అదేం శాప‌మో కానీ.. య‌డ్డీ ఎప్పుడు సీఎంగా ప‌ద‌విని చేప‌ట్టినా పూర్తి కాలం ఎప్పుడూ ప‌ద‌విలో కూర్చున్న‌ది లేదు.
మొద‌టిసారి వారం మాత్ర‌మే సీఎంగా చేసిన య‌డ్డీ.. రెండో ద‌ఫా మాత్రం కొంత‌కాలంపాటు ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. అంత‌ర్గ‌త రాజ‌కీయాల‌తో త‌న ప‌ద‌వికి మ‌ధ్య‌లోనే రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. మూడోసారి అయితే.. మ‌రింత దారుణంగా రెండు రోజుల‌కే సీఎం కుర్చీని వ‌దిలిపెట్టాల్సి వ‌చ్చింది.
సీఎం ప‌ద‌వి పోయిన య‌డ్డీకి.. మ‌రో చెత్త రికార్డు కూడా ఆయ‌న సొంత‌మైంది. దేశంలో అతి త‌క్కువ కాలం సీఎంగా చేసిన రికార్డుల్లోకి య‌డ్డీ పేరు చేరిపోయింది. ఈ కొత్త రికార్డులో సెకండ్ ప్లేస్ అని కొంద‌రు చెప్పినా.. టెక్నిక‌ల్ గా చూస్తే.. య‌డ్డీదే ఫ‌స్ట్ ప్లేస్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.
అదెలానంటే.. ముఖ్య‌మంత్రిగా ప‌ద‌విని చేప‌ట్టిన రెండు రోజుల‌కే య‌డ్యూర‌ప్ప రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. ఇంత కంటే స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వారు ఉన్నారు. ఒక్క‌రోజు సీఎంగా వ్య‌వ‌హ‌రించిన ఉదంతం కూడా ఒక‌టి దేశ రాజ‌కీయాల్లో చోటు చేసుకుంది. 
దేశ వ్యాప్తంగా అతి త‌క్కువ రోజులు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన చెత్త రికార్డులో య‌డ్డీ కంటే ముందు ఉత్త‌ర ప్ర‌దేశ్ కు చెందిన జ‌గ‌దాంబికా పాల్ పేరిట రికార్డు ఉంది. ఆయ‌న ఒక రోజు సీఎంగా వ్య‌వ‌హ‌రించారు. అయితే.. సుప్రీంకోర్టు ఆయ‌న్ను సీఎంగా గుర్తించేందుకు నిరాక‌రించింది. ఆయ‌న్ను మాజీ ముఖ్య‌మంత్రిగా రికార్డుల్లో న‌మోదు చేయొద్ద‌న్న ఆదేశాల్ని జారీ చేసింది. 
ఎందుకంటే.. 1998లో యూపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజార్టీ రాలేదు. ఇత‌రుల‌తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాన‌ని బీజేపీకి చెందిన క‌ల్యాణ్ సింగ్ అప్ప‌టి గ‌వ‌ర్న‌ర్ రొమేశ్ భండారిని కోరారు. కానీ.. గ‌వ‌ర్న‌ర్ ఇప్ప‌టి మాదిరే వ్య‌వ‌హ‌రించి.. మెజార్టీ ఉన్న క‌ల్యాణ్ సింగ్ ను కాకుండా బ‌లానికి అవ‌స‌ర‌మై ఎమ్మెల్యేలు లేని కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించారు. దీంతో.. అదో వివాదంగా మారింది. ఇరు ప‌క్షాలు బ‌ల‌ప‌రీక్ష‌కు రెఢీ అయ్యాయి. ఇందులో క‌ల్యాణ్ సింగ్ నెగ్గారు. ఫ‌లితంగా హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. రాష్ట్రప‌తి పాల‌న‌ను విధించాల‌ని గ‌వ‌ర్న‌ర్ కేంద్రాన్ని కోరినా.. అందుకు నో చెప్పింది. 
ఈ నేప‌థ్యంలో క‌ల్యాణ్ సింగ్ సీఎంగా ఎన్నికై 93 మందితో కేబినెట్ ఏర్పాటు చేశారు. బీజేపీయేత‌ర పార్టీల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. ఇందుకు గ‌వ‌ర్న‌ర్ అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ రాత్రికి రాత్రే క‌ల్యాణ్ సింగ్ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేశారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన జ‌గ‌దాంబికా పాల్ సీఎం అయ్యారు. అయితే.. ఆయ‌న ప్ర‌భుత్వం ఒక్క రోజు కూడా నిల‌వ‌లేదు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చోటు చేసుకోవ‌టంతో ఒక్క‌రోజు వ్య‌వ‌ధిలోనే ఆయ‌న మాజీ అయ్యారు.ఈ ఉదంతం త‌ర్వాతి కాలంలో సుప్రీం బెంచ్ మీద‌కు వెళ్ల‌గా ఒక‌రోజు ముఖ్య‌మంత్రిగా జ‌గ‌దాంబికా పాల్ ను గుర్తించ‌కూడ‌ద‌ని.. రికార్డుల్లో న‌మోదు చేయ‌కూడ‌ద‌ని సుప్రీం పేర్కొంది.
ఈ లెక్క‌న చూసిన‌ప్పుడు తాజాగా య‌డ్యూర‌ప్ప‌దే రికార్డ‌గా చెప్పాలి. అతి త‌క్కువ కాలం సీఎంగా వ్య‌వ‌హ‌రించిన చెత్త రికార్డు య‌డ్డీ సొంతమైన‌ట్లు. కేవ‌లం రెండంటే రెండు రోజులు మాత్ర‌మే ఆయ‌న ప‌ద‌విలో సాగారు. ఆయన త‌ర్వాత ఈ రికార్డులో ఉన్న వారిని చూస్తే.. 
+ బిహార్ కు పిన్న వ‌య‌సులోనే సీఎంగా ఎన్నిక‌య్యారు స‌తీశ్ ప్ర‌సాద్ సింగ్‌. 1968లో సీఎంగా అయిన ఆయ‌న కేవ‌లం వారం రోజులు మాత్ర‌మే సీఎంగా ఉన్నారు. అనంత‌రం త‌న‌కు బ‌లం లేని విష‌యాన్ని గుర్తించి త‌న‌కు తానుగానే ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు.
+  1998లో మేఘాల‌య సీఎంగా ఎన్నికైన ఎస్సీ మార‌క్ 13 రోజులే సీఎం కుర్చీలో కూర్చున్నారు. 
+ అతి త‌క్కువ కాలం సీఎం రికార్డులో త‌మిళ‌నాడు రాష్ట్రం కూడా ఉంది. న‌టి.. అన్నాడీఎంకే వ్య‌వ‌స్థాప‌కుడు ఎంజీ రామ‌చంద్ర‌న్ స‌తీమ‌ణి జాన‌కీ రామ‌చంద్ర‌న్ త‌మిళ‌నాడులో అతి త‌క్కువ‌కాలం సీఎంగా చేశారు. రామ‌చంద‌ర్ మ‌ర‌ణించిన త‌ర్వాత అన్నాడీఎంకే చీలింది. ఒక వ‌ర్గం జాన‌కిని సీఎం చేయాలంటే.. మ‌రో వ‌ర్గం జ‌య‌ల‌లిత‌ను ఎంజీఆర్ రాజ‌కీయ వార‌సురాలిగా ప్ర‌క‌టించాల‌న్న డిమాండ్ తెర మీద‌కు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో నాటి గ‌వ‌ర్న‌ర్ జాన‌కిని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానించారు. అనంత‌రం బ‌ల‌ప‌రీక్ష‌ను చేప‌ట్టారు. నాటి బ‌ల‌ప‌రీక్ష‌లో అసెంబ్లీలో గొడ‌వైంది. ర‌చ్చ ర‌చ్చ‌గా మారిన నాటి స‌భ‌లో జాన‌కిని ముఖ్య‌మంత్రిగా ఎంపికైన‌ట్లుగా చెప్పిన‌ప్ప‌టికీ..నాటి రాజీవ్ గాంధీ ప్ర‌భుత్వం క‌లుగ‌జేసుకొని జాన‌కీ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసింది. దీంతో.. 23 రోజుల పాటు సీఎంగా ఉన్న జాన‌కీ రామ‌చంద్రం త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. 
+ అతి త‌క్కువ కాలం ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన వారిలో ఇండియ‌న్ యూనియ‌న్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన సీహెచ్ మ‌హ్మ‌ద్ కోయా పేరు ఉంది. కేర‌ళ ముఖ్య‌మంత్రిగా ఆయ‌న 45 రోజులు మాత్ర‌మే ప‌ని చేశారు. అనంత‌రం ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ ర‌కంగా చూసిన‌ప్పుడు ఈ లిస్ట్ లో య‌డ్డీ అగ్ర‌స్థానంలో నిలుస్తార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.