ఎవ్వ‌రు  త‌గ్గేలా లేరు…

ఏపీలో టీడీపీ, బీజేపీల మ‌ధ్య అగాదం పెరుగుతుంది. ఇరుపార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం సాగుతూనే ఉంది. ఎవరికి వారు తమ వాదనలు విన్పిస్తుండటంతో రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. బీజేపీ నేతలు మిత్రధర్మం పాటించటంలేదని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించగా…బీజేపీ నేతలు అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తున్నారు. కేంద్ర నిధులను ఏపీ ప్రభుత్వం దుర్వినియోగం చేయటంతో పాటు… సొంత డబ్బాకు వాడుకుంటోందనని ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నా.. అది టీడీపీ ప్రభుత్వం చేస్తున్నట్టు చూపించుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తున్న నిధులన్నీ కేంద్రానివేనని, రాష్ట్రంలో నిధులు సేకరణపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్‌ చేశారు. పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణకు ప్రతి జిల్లాకూ రూ. 6 నుంచి 7 కోట్లు ఇస్తున్నామని, కానీ, ఈ నిధులు దుర్వినియోగమవుతున్నాయని విమర్శించారు. సీఎం దావోస్ పర్యటనలో అనేక ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కారణం ప్రధాని మోదీనే అన్నారు. 1995 నుంచి 2014 వరకు చంద్రబాబు పాలించిన కాలంలో కరెంట్ కొరత ఉండేదని, మోదీ వచ్చాక కరెంట్ కొరత లేదని అన్నారు. టీడీపీ ప్రభుత్వం చెప్పుకుంటున్న ఎన్టీఆర్‌ జలసిరి పథకం నిజం కాదని, బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న సోలార్ పంపు సెట్లనే ఆ పథకం కింద ఇస్తున్నారని అన్నారు. చంద్రన్న భీమా తమ ఘనతగా చంద్రబాబు చెప్పుకుంటున్నారని, ఆ పథకంలో రాష్ట్ర ప్రభుత్వానిది ఒక్క రూపాయి కూడా లేదని, రూ. 170 కోట్లు వరకు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిందని, అది కేంద్రం పథకమేనని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు చేస్తే రాష్ట్రం ఇంకా ముందంజలో ఉంటుందని వ్యాఖ్యానించారు. విభేదాలు ఇలాగే కొన‌సాగితే రెండు పార్టీల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.