రాజీనామాల ఆమోదంతో ఎన్నికలు వస్తాయా…

తమ రాజీనామాల ఆమోదం పై వైఎస్సార్‌సీపీ ఎంపీలు వెనక్కు తగ్గుతున్నారనే విమర్శలు వచ్చాయి. కానీ అది నిజం కాదని నిరూపించేందుకు వారు చాలా ప్రయత్నాలే చేశారు. చివరకు తమ రాజీనామాలు ఆమోదించే వరకు ఆగకుండా స్పీకర్ ను కలిసి ఆమోదించాలని కోరారు. చివరకు వారి నిరీక్షణ ఫలించింది. లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తో వైఎస్సార్‌సీపీ ఎంపీలు మరోసారి భేటీ అయి రాజీనామాలను ఆమోదించాలని కోరిన నేపధ్యంలో అవి ఆమోదం పొందినట్లు ఆమె చెప్పారు. వైకాపా ఎంపీలు పట్టుబట్టి మరీ తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కోరిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్‌, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌ రెడ్డిలు లోక్‌సభ స్పీకర్‌ను కలిసి ఏపీలో ప్రస్తుత పరిస్థితిని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత భావోద్వేగంతో కాకుండా ప్రజల కోసం తాము రాజీనామాలు చేసినట్లు వివరించారు.

ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో భాగంగా తాము పదవులకు రాజీనామా చేశామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామాలు ఆమోదించాలని ఎంపీలు కోరారు. వారి రాజీనామాల ఆమోదానికి ముందు ఒకటికి రెండు సార్లు వారిని అడిగి మరీ తుది నిర్ణయం తీసుకున్నారు స్పీకర్‌. మీరు మీ రాజీనామాలకు కట్టుబడి ఉన్నారా..లేక బలవంతంగా ఎవరైనా రాజీనామా చేయించారా అని అడిగి తెలుసుకున్నారు. ఇందుకు వారంతా అవునని సమాధానం చెప్పగా రాజీనామాలు ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. త్వరలోనే ఖాళీ అయిన సీట్లసమాచారాన్ని ఎన్నికల కమిషన్ కు పంపించే వీలుంది. తమ రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని స్పీకర్‌కు వివరించినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆ తర్వాత మీడియాకు వెల్లడించారు.

రాజీనామాల ఆమోదంపై అధికారికంగా ప్రకటన రానుంది. పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎంపీలు ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, బుట్టా రేణుకలపై నిర్ణయం తీసుకోవాలనిఅదే సమయంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు వైకాపా ఎంపీలు. త్వరలోనే తమ నిర్ణయం ఉంటుందని వారికి స్పీకర్ చెప్పారంటున్నారు. హోదాకోసం వైకాపాఎంపీలు రాజీనామా చేయడమే కాదు…వాటిని ఆమోదించుకోవడం కలిసొచ్చే అంశమే. ఆ విషయంలో టీడీపీ ఎంపీలు వెనక్కు తగ్గారనే చెప్పాలి. ఇంకా పదవులను పట్టుకుని వేలాడుతున్నారనే ప్రచారం వస్తోంది. వైకాపా ఎంపీలు తమ రాజీనామాలను ఆమోదించకుండా బీజేపీతో కుమ్మక్కయ్యారనే విమర్శలుచేశారు సిఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లు. ఇప్పుడు రాజీనామాల ఆమోదం తర్వాత వారు విమర్శలు చేస్తే ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు టీడీపీనేతలు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.