టీడీపీ.. కాంగ్రెస్‌తో క‌ల‌సి సాగుతుందా!

ఏపీ ప్ర‌త్యేక‌హోదా ల‌క్ష్యంగా.. కేంద్రంతో తెగ‌తెంపులు చేసుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాల‌పై గురి పెడుతున్నారు. అవ‌కాశం వున్న అన్నిదారుల‌ను అన్వేషించే ప‌నిలో నిమ‌గ్న‌మైన‌ట్లు స‌మాచారం. అనుభ‌వం.. పాల‌న ద‌క్షత‌ల కార‌ణంగా చంద్ర‌బాబు జాతీయ రాజ‌కీయాల్లో ప్ర‌భావం చూపుతార‌నేది గ‌తంలో వెల్ల‌డైన విష‌య‌మే. కానీ తాజాగా బీజేపీ వంటి బ‌ల‌మైన పార్టీను ఢీకొన‌టాన్ని ఇప్పుడు మిగిలిన రాజ‌కీయ పార్టీలు చంద్ర‌బాబు సాహ‌సాన్ని క‌ళ్లారా చూస్తున్నాయి. ఎన్‌డీఏ కూట‌మిలో ఎన్ని పార్టీలున్నా కేవ‌లం తోక‌పార్టీలుగా మ‌నుగ‌డ కొన‌సాగిస్తున్నాయి. పూర్తి మెజార్టీ ఉన్న బీజేపీతో వైరం తెచ్చుకున్న‌.. వ‌చ్చే ప్ర‌యోజ‌నం లేద‌నే భావ‌న‌లో నెట్టుకు వ‌స్తున్నాయి. అటువంటిది ప్ర‌ధాన మిత్ర‌ప‌క్ష‌మైన చంద్ర‌బాబు.. కేవ‌లం హోదా కోసం ప‌వ‌ర్ వ‌ద్ద‌నుకుని.. కేంద్రంలోని  త‌మ మంత్రుల‌తో రాజీనామా చేయించ‌టం కూడా అనుకూలంగా మారింది. అయితే.. ఇది రాజ‌కీయ ప‌రంగా రాబోయే ఎన్నిక‌ల్లో మాత్రం టీడీపీను దెబ్బ‌తీసే నిర్ణ‌యం అనేది విశ్లేష‌కుల అంచ‌నా. వైసీపీ, ప‌వ‌న్‌, బీజేపీ మూకుమ్మ‌డిగా ఏక‌మైన‌పుడు .. టీడీపీపై త‌ప్ప‌కుండా ప్ర‌భావం ఉంటుంది. హోదా విష‌యాన్ని ప‌క్క‌న‌బెడితే.. ఆ పార్టీల‌కు వున్న ఓట్లు గెలుపోట‌ములు నిర్ణ‌యిస్తాయి.

ఇటువంటి స‌మ‌యంలో టీడీపీ.. త‌మ వైపు వ‌స్తే.. రాజ‌కీయాల‌ను మార్చ‌వ‌చ్చ‌నే కోణంలో కాంగ్రెస్ నేత‌లు పావులు క‌దుపుతున్నారు.  కేవ‌లం కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా పుట్టిన పార్టీగా ముద్ర‌ప‌డిన టీడీపీ నేత‌లు.. ఇందుకు ఎంత వ‌ర‌కూ అంగీక‌రిస్తార‌న‌నే కూడా మ‌రో ఆందోళ‌న‌. ఒక‌వేళ టీడీపీ, కాంగ్రెస్ రెండు ఒకే ఒర‌లో ఇమిడితే.. ఊహించ‌ని రాజ‌కీయ మార్పుల‌కు శ్రీకారం చుట్టిన‌ట్లే. దీని ప్ర‌భావం జాతీయ రాజ‌కీయాల్లోనూ ఉంటుంద‌నేది స్ప‌ష్ట‌మైన అంశం. ఏపీలో టీడీపీ, కాంగ్రెస్‌ల‌కు గ్రామ‌స్థాయిలో బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది. రెండు పార్టీల‌కు ఓటుబ్యాంకు ఉంది. సంప్ర‌దాయ ఓట‌ర్ల బ‌లం ఉండనే ఉంది. మిగిలిన పార్టీల‌పై పై చేయి సాధించేందుకు ఇదెంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనివల్ల తెలంగాణాలో కూడా టీఆర్ఎస్‌, బీజేపీల‌పై పై చేయి సాధించే అవ‌కాశాలున్నాయి. తెలంగాణాలో చంద్ర‌బాబు కీల‌క రాజ‌కీయాలు న‌డిపేందుకు మార్గం సుగుమం అవుతుంది. జాతీయ‌స్థాయిలో ఇప్ప‌టికే సందిగ్ధంలో వున్న ప్రాంతీయ పార్టీలు చంద్ర‌బాబు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపితే.. ఆటోమేటిక్‌గా ముందుకు వ‌స్తాయి. ఈ విధంగా కూడా.. జాతీయ రాజ‌కీయాల్లో బాబు చ‌క్రం తిప్పే వీలుంది. పోనీ.. హ‌స్తంతో క‌లిసేందుకు చంద్ర‌న్న ముందుకు రాక‌పోయినా.. మూడో కూట‌మి ద్వారా మ‌ద్ద‌తు ఇచ్చినా ఎన్‌డీఏకు ఊహించ‌ని ఎదురుదెబ్బ రుచి చూపిన‌ట్ల‌వుతుంద‌నే తెలుగు త‌మ్ముళ్ల అంత‌రంగం. నాయ‌కుల చేతులు క‌లిపినా.. గ్రామ‌స్థాయిల్లో వున్న కార్య‌క‌ర్త‌లు.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఉప్పునిప్పులుగా ఉండి.. ఒక్క‌తాటిపైకి వ‌చ్చి.. అప్ప‌టి వ‌ర‌కూ తాము ప్ర‌త్య‌ర్థులుగా భావించిన పార్టీ జెండాలు మోస్తారా! ఆ నాయ‌కుల‌కు జై కొడ‌తారా! అనేది పార్టీల ముందున్న ప్ర‌శ్న‌. కార్య‌కర్త‌ల‌ను బుజ్జ‌గించి.. వారితో ఓకే అనిపించ‌గ‌లిగితే.. రాజ‌కీయంగా ఇది ఊహ‌కంద‌ని స‌రికొత్త మార్పున‌కు పునాది అనాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.