తెలంగాణాలో రెడ్డి సామాజిక‌వ‌ర్గం ఏక‌మ‌వుతుందా!

తెలంగాణ‌లో రాజ‌కీయ వ్యూహాలు ప‌దునెక్కుతున్నాయి.  ఎన్నిక‌ల స‌మరానికి ముందే కుల స‌మీక‌ర‌ణ‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. రాష్ట్రంలో తొలినాళ్ల నుంచి రెడ్డి సామాజిక‌వ‌ర్గ ఆధిప‌త్యం కొన‌సాగుతుంది. దాదాపు అన్ని కీల‌క‌మైన విభాగాల్లోనూ అధికారం ఉంది. స‌ర్వ‌స‌త్తాక అధికారం రెడ్డి వ‌ర్గం చేతుల్లోనే ఉంద‌నే వాద‌న కూడా ఉంది. అంజ‌య్య‌, ఎన్‌టీఆర్, చంద్ర‌బాబు, నాదెండ్ల భాస్క‌ర‌రావు మిన‌హా ఉమ్మ‌డి రాష్ట్ర సీఎంలుగా రెడ్డి సామాజిక‌వ‌ర్గ‌మే అధిక‌కాలం కొన‌సాగింది. 2014లోనూ తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు తెలంగాణ ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తార‌ని భావించారు. కానీ.. ఉద్య‌మ సార‌ధిగా కేసీఆర్‌ను గుర్తించిన ప్ర‌జ‌లు కారును గ‌ట్టెక్కించి.. గ‌ద్దెనెక్కించారు. అయినా కేసీఆర్ రెడ్డి బ‌లం దూరం కాకూడ‌ద‌నే భావ‌న‌తో కేబినెట్‌లో కీల‌క ప‌ద‌వులు క‌ట్టెబెట్టారు. అయినా.. ద్వితీయ‌శ్రేణి నేత‌లుగా టీఆర్ఎస్‌లో కొన‌సాగ‌టాన్ని రెడ్డి వ‌ర్గ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఏడాదిన్న‌ర క్రితం.. హైద‌రాబాద్ శివార్ల‌లోని ఓ రిసార్ట్‌లో రెడ్డి వ‌ర్గ ఎమ్మెల్యేలంతా స‌మావేశం అయి.. ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు ప్ర‌య‌త్నాలు చేశార‌నే ఆరోప‌ణ‌లు కూడా అప్ప‌ట్లో వ‌చ్చాయి. దాని ఫ‌లిత‌మే  ఓ పోలీసు ఉన్న‌తాధికారి బ‌దిలీ అనే ప్ర‌చార‌మూ ఉంది. అయితే ఇదంతా ప్ర‌త్య‌ర్థుల కుట్ర‌గా టీఆర్ఎస్ వివ‌ర‌ణ ఇచ్చుకుంది. కానీ.. ఇటీవ‌ల ప‌రిణామాల‌తో ఆ వ‌ర్గంలో అసంతృప్తి ఉంద‌నే వాద‌న బ‌ల‌ప‌డుతోంది. ఎందుకంటే.. రాష్ట్రంలో అధికారం మొత్తం కేసీఆర్‌, కేటీఆర్‌, హ‌రీష్ చేతుల్లోనే ఉంద‌నేది ఇత‌ర నేత‌ల అభిప్రాయం. త‌ల‌సాని వంటి వ‌ల‌స‌నేత‌ల‌కు ఇచ్చినంత ప్రాధాన్య‌త‌.. ఉద్య‌మంలో పాల్గొన్న త‌మ‌కు లేదంటూ చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేశారు. ఇటీవ‌ల సాక్షాత్తూ.. హోంశాఖ మంత్రి నాయ‌ని న‌ర‌సింహారెడ్డి కూడా.. తాము ద్వితీయ శ్రేణి లెక్క‌లోనే ఉన్నామ‌ని.. పెత్త‌నం అంతా ఉద్య‌మాన్ని ద్వేషించిన వారి చేతుల్లో ఉందంటూ ఘాటుగానే విమ‌ర్శించారు. మ‌రో వైపు కోదండ‌రామ్‌రెడ్డి మాస్టారు.. క‌ట్ట‌డి చేయ‌టం వెనుక కార‌ణం అదేన‌నే విమ‌ర్శ‌లూ లేక‌పోలేదు. దీన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని రెడ్డి సామాజిక‌వ‌ర్గాన్ని ఏక‌తాటిపైకి తీసుకు వ‌చ్చేందుకు టీ కాంగ్రెస్ స‌మాయ‌త్తం అయిన‌ట్లు ఇటీవ‌ల ప‌రిణామాలు చెప్ప‌క‌నే చెబుతున్నాయి. నిన్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వున్న ఇత‌ర పార్టీల‌తో పాటు అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వ‌ల‌స‌లు ఉంటాయ‌ని టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ఏనాడో ప్ర‌క‌టించారు. దీన్ని బ‌ట్టి రెడ్డి సామాజిక‌వ‌ర్గం త‌మ ఆధిప‌త్యం చాటుకునేందుకు పావులు బ‌లంగానే క‌దుపుతుంద‌నేది రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా.

1 Comment

  1. T D P ni telangana nundi panpinanta matrana t r s ki enka poti evaru vundaru anukodam trs murghatwam. politics ante etara prathyalu lekapodam kadu. okka party cm ayi eladam kadu. kcr ki edi kuda telidu.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.