చంద్రబాబుతో లగడపాటి భేటీ.. అసలేం జరిగిందంటే…

ఆంధ్ర ఆక్టోపస్, సర్వేల రారాజు.. లగడపాటి రాజగోపాల్‌ ఓ వారం కిందట ముఖ్యమంత్రి చంద్రబాబును వెలగపూడి సచివాలయంలో కలుసుకున్నారు. ఆయనతో పాటు మరో పారిశ్రామికవేత్త కూడా చంద్రబాబును కలిసినవారిలో ఉన్నారు. వీరిద్దరు ఎందుకు కలిశారో తెలియదు కానీ.. సోషల్‌ మీడియాలో మాత్రం చంద్రబాబుకు లగడపాటి ఓ సర్వే నివేదిక ఇచ్చారని వైరల్‌ అయ్యింది. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీకి 100 నుంచి 110 వరకు సీట్లు వస్తాయని.. గుంటూరు, కృష్ణా జిల్లాలో టీడీపీ హవా బాగుందన్నది ఆ సర్వే సారాంశమట! అలాగని సోషల్‌ మీడియా కోడై కూసింది.. అయితే చంద్రబాబును కలిసిన సమయంలో అక్కడే ఉన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లరావును బయటకు పంపించారని.. ఆ తర్వాతే పుల్లారావుకు చంద్రబాబు సర్వే గురించి చెప్పారని సోషల్‌ మీడియాలో కథలు కథలుగా వచ్చింది.. గుంటూరు.. కృష్ణా జిల్లాలలో పార్టీ పరిస్థితి బాగుందని.. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని పుల్లారావుతో బాబు చెప్పారట! అంతే కాదు.. అందరూ కష్టపడితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయంటూ పుల్లారావుకు స్వీట్లు కూడా తినిపించారని సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నిజానికి అవన్నీ అసత్యాలే! చంద్రబాబును లగడపాటి కలుసుకున్నదొక్కటే నిజం! మిగతావన్నీ అవాస్తవాలు..

అసలు విషయానికి వస్తే చంద్రబాబును రాజగోపాల్‌ కలిసినప్పుడు పుల్లారావు అక్కడ లేనేలేరు. ఇదే మాటను పుల్లారావును అడిగితే.. తాను ఆ రోజు సీఎం కార్యాలయానికి వెళ్లలేదని స్పష్టం చేశారు. లగడపాటి రాజగోపాల్‌.. మరో పారిశ్రామికవేత్త ప్రయివేటు పవర్‌ ప్రాజెక్టు విషయమై చంద్రబాబును కలిశారట! ఓ విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చి వెళ్లిపోయారట! చంద్రబాబును కలిసినప్పుడు రాజకీయ విషయాలు చర్చకు రాకుండా ఎలా ఉంటాయి..? ఇప్పుడు కూడా రాజకీయాలు చర్చకు వచ్చాయి.. ఇందులో భాగంగానే రాజగోపాల్‌ కొన్ని సూచనలు చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో టీడీపీకి.. చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్నది టీడీపీ క్యాడర్‌ నమ్మకమని ..ఇదే అంశం జనంలోకి కూడా వెళ్లిందని చెప్పినట్లు తెలిసింది.. పార్టీని రక్షించుకోవాలని.. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే పార్టీ క్యాడర్‌ మహానాడుకు తరలివచ్చిందని లగడపాటి విశ్లేషించారట! రాజధాని అమరావతి…పోలవరం నిర్మాణాలను పూర్తి చేయాలంటే చంద్రబాబు మరోసారి అధికారం చేపట్టాలన్న భావన ప్రజల్లో క్రమేణా వస్తున్నదని లగడపాటి ప్రైవేట్ చర్చల్లో చెబుతున్నారు.

అయితే పార్టీ ప్రజాప్రతినిధులపై కొన్ని ప్రాంతాల్లో ఉన్న వ్యతిరేకతను అధిగమించే విధంగా తెలుగుదేశం పనిచేయాల్సి ఉంటుందని, చంద్రబాబుపై ఉన్న సానుభూతి, రాష్ట్రం బాగుపడాలనే సెంటిమెంట్ ప్రజాప్రతినిధులపై ఉన్న వ్యతిరేకతను అధిగమిస్తుందని లగడపాటి విశ్లేషిస్తున్నట్లు తెలిసింది. ఈ సారి ఓట్లు, కులాల పోలరైజేషన్ ఎక్కువగా ఉంటుందని, బీజేపీపై పెరుగుతున్న వ్యతిరేకత చంద్రబాబుకు అనుకూలంగా మారుతుందని పరిశీలకులు చెబుతున్నారు. పట్టణాల్లో తెలుగదేశంపార్టీకి బాగున్నప్పటికీ, పల్లెల్లో మాత్రం కొంత డల్‌గా ఉందట! గ్రామాలలో వర్గాల మధ్య సమతుల్యత పాటిస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చన్నది ఇంకో వర్గం వాదనగా ఉంది.. లగడపాటి ఓవరాల్‌గా అభిప్రాయం చెప్పినప్పటికీ సోషల్‌ మీడియాలో మాత్రం రకరకాల కథనాలు వస్తున్నాయి.. అవన్నీ ఉత్తుత్తివేనని.. అదంతా తూచ్‌ అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.