సైకిల్ ఎక్కేదెవ‌రు… దిగేదెవ‌రు?

ప్ర‌త్య‌ర్థి బ‌ల‌హీనం.. ప్ర‌జ‌ల్లో అభిమానం.. ఇవే ఏపీలో తెలుగుదేశం పార్టీకు క‌లిసొచ్చే అంశాలు. కానీ.. అంత‌ర్గ‌త క‌ల‌హాలు. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను కొనితెచ్చుకున్న ప్ర‌జాప్ర‌తినిధులే శాపంగా మారార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా.. నేత‌లు చేసిన త‌ప్పొప్పులు జ‌నం ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోరు. కానీ అధికారంలో ఉన్న‌పుడు జ‌నం క‌ళ్లు.. త‌మ‌వైపే ఉంటాయ‌నే విష‌యాన్ని సైకిల్ నేత‌లు మ‌ర‌చిన‌ట్లున్నారు. ప‌లుమార్లు నోరుజారారు. కొన్ని సంద‌ర్భాల్లో అంత‌కుమించి దౌర్జ‌న్యానికి దిగారు. ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షాల‌కు అవే అస్త్రాలుగా మారాయి. దేశం పార్టీకు ఇబ్బందిగా ప‌రిణ‌మించాయి. ఫ‌లితంగా.. ప్ర‌జ‌ల్లో చంద్ర‌బాబునాయుడు మంచి నాయకుడు.. మ‌రోసారి ఆయ‌నే సీఎం కావాల‌నే కోరిక వున్నా.. నేత‌ల చేష్ట‌లు.. మ‌రోసారి అధికారం సాధించేందుకు ఎక్క‌డ అడ్డుగోడ‌లుగా మార‌తాయ‌నే ఆందోళ‌న కూడా సీనియ‌ర్ల‌లో నెల‌కొంది. విశాఖ నుంచి  విజ‌య‌వాడ‌.. అన‌కాల‌ప‌ల్లి నుంచి అనంత‌పురం వ‌ర‌కూ.. నేత‌లు జాబితాలో ఉండ‌టం ఇందుకు నిద‌ర్శ‌నం. విశాఖ‌లో అయ్య‌న్న‌పాత్రుడు, ఘంటా శ్రీనివాస‌రావు మ‌ధ్య స‌యోధ్య లోపం.. ఎవ‌రి పంథా వారిదే.. బీజేపీ ఎంపీ కంభ‌పాటితో స‌యోధ్య నామ‌మాత్రం. ఇదిలావుంటే.. అక్క‌డ భూ వివాదాల్లో దేశం పార్టీ నేత‌లు, ఎమ్మెల్యే, మంత్రి పేర్లు ప్ర‌ధానంగా వినిపిస్తున్నాయి. గోదావ‌రి జిల్లాల్లో మంత్రి చిన‌రాజ‌ప్ప త‌మ్ముడు దౌర్జ‌న్యాలు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఎంపీ ముర‌ళీమోహ‌న్ ఏదో చేస్తాడ‌ని భావించిన ప్ర‌జ‌ల్లోనూ తిర‌స్కార భావ‌న మొద‌లైంది. ద‌త్త‌త తీసుకున్న గ్రామాల‌నే నిర్ల‌క్ష్యం చేశారంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న బ‌దులు కోడ‌ల‌కు సీటు ఇప్పించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఇక దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని కూడ‌గ‌ట్టుకున్న త‌ప్పిదాలు.. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం మీద‌నే కాకుండా.. ఓవ‌రాల్‌గా జిల్లామీద ప్ర‌భావం చూపినా ఆశ్చ‌ర్యం లేద‌నేది అంత‌ర్గ‌త స‌మావేశాల్లో వ్య‌క్త‌మైన అభిప్రాయం. విజ‌య‌వాడ‌లో బోండా ఉమ‌, ఎంపీ కేశినేని, సీమ‌లో బొజ్జ‌ల‌, ఆనం బ్ర‌ద‌ర్స్‌, జేసీ బ్ర‌ద‌ర్స్‌, ఆదినారాయ‌ణ‌రెడ్డి. ఇలా.. ఏపీలో ప‌లువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు.. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను చ‌విచూస్తున్నారు. ఇప్ప‌టికే వీరిపై చంద్ర‌బాబు నాయుడు స‌మాచారం సేక‌రించ‌టం.. కొంద‌రికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్ల కేటాయింపుపై ఇప్ప‌టికే క్లారిటీ ఇవ్వ‌టం  అన్నీ జ‌రిగాయ‌నే ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఎవ‌రు.. సైకిల్ దిగుతారు.. ఆ ప్లేస్‌లో ఇంకెవ‌రు వ‌స్తార‌నేది పార్టీ వ‌ర్గాల్లో చర్చ‌నీయాంశంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.