అంద‌రూ.. అంద‌రే.. హీరోలెవ‌రు?

ఎన్‌డీఏ అధికారంలోకి వ‌చ్చి నాలుగేళ్లు పూర్త‌యింది. మ‌రో ఏడాది భ‌రిస్తే.. తాడోపేడో తేల్చుకోవచ్చ‌ని సైలెంట్‌గా వున్న పార్టీల‌న్నీ ఒళ్లు విరుసుకుంట‌న్నాయి. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు బీజేపీ సిద్ధ‌మైంద‌నే స‌మాచార‌మే దీనికి అస‌లు కార‌ణం. అంతేగాని ఇన్నాళ్ల కు కేంద్రం చేస్తున్న త‌ప్పిదాల‌పై ప్ర‌జ‌ల‌కేదో చేయాలే యావ మాత్రం కాద‌నేది అర్ధ‌మ‌వుతూనే ఉంది. అందాకా ఎందుకు.. పాపం కాంగ్రెస్ యువ‌రాజ‌.. ఇప్ప‌టి మహారాజు.. రాహుల్‌గాంధీ మొద‌టి నుంచి చెబుతూనే ఉన్నా ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ ఒక్క గొంతుక స్పందించ‌లేదు. మొన్న యూపీ.. నిన్న ఈశాన్య‌రాష్ట్రప్ర‌జ‌లు కాషాయానికే స‌లామ్ కొట్టారు. ఒక‌వేళ రేపు క‌ర్ణాట‌క‌లో కూడా.. బీజేపీ జెండా ఎగిరితే.. 2019లో కూడా ఎన్‌డీఏ హ‌వానే న‌డుస్తుంది. ఇప్ప‌టికే మోదీ విధానాల‌తో బొప్పిక‌ట్టిన ప్రాంతీయ‌పార్టీలు ఇక‌జీవం లేని స్థితికి చేర‌తాయనే భ‌య‌మే.. వారిని కేంద్రంపై పురిగొల్పేలా చేస్తుంది. పిల్లి మెడ‌లో గంట క‌ట్టేదెవ‌ర‌నే ప్ర‌శ్న‌కు.. తొలుత‌.. వ్య‌తిరేక స్వ‌రంతో తెలంగాణ సీఎం కేసీఆర్ మార్గం వేస్తే.. దాన్ని అందిపుచ్చుకుని  ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మోదీ నీ అంతుచూస్తానంటూ మైత్రీ బంధానికి టాటా చెప్పారు. వెంట‌నే.. అటు శిబూసోర‌న్‌, ఇటు మ‌మ‌తాబెన‌ర్జీ.. మ‌రోవైపు అఖిలేష్‌యాదవ్‌, ల‌ల్లూ ఫ్యామిలీ.. ఇలా.. రాజ‌కీయ కురు వృద్ధులంతా..ఏక‌తాటిపైకి వ‌చ్చే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. దీంతో.. యూపీఏ కూట‌మికి పోటీగా మ‌రో కూట‌మి ఏర్ప‌డితే.. ఎలా అనే వేద‌న‌తో కావ‌చ్చు.. కాంగ్రెస్‌కూడా.. మై హూనా.. మీ వెనుక హ‌స్తంగా మేమున్నాం అంటూ.. అంద‌రినీ కూడ‌గ‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. మాంచి విందుభోజ‌నంతో రాజ‌కీయ విందు ముగించారు. అయితే.. ఎన్‌డీఏ, యూపీఏ కూట‌మిలు వున్నా.. చంద్రులిద్ద‌రూ.. త‌మ త‌మ కూట‌మిల ఏర్పాటులో నిమ‌గ్న‌మ‌య్యారు. పోనీ.. మ‌న తెలుగోళ్లు.. జాతీయ‌రాజ‌కీయాల‌కు వెళ్తున్నార‌ని ఆనందిద్దామా అంటే.. అదీ లేక‌పోయే.. ఎందుకంటే.. తెలుగోడి రాజ‌కీయ‌మంటే.. ప్ర‌పంచం మొత్తానికి తెలిసిందే.. అందితే జుట్టు అంద‌క‌పోతేకాళ్లు.. ఇవేమీగాక‌పోతే.. పైర‌వీల‌తో ప‌ద‌వులు దించ‌గ‌ల‌రు.. ప్ర‌భుత్వాల‌ను కూల్చ‌గ‌ల‌ర‌నే అప‌వాదు ఉండ‌నే ఉంది. అందుకేనేమో.. చంద్రులిద్ద‌రూ కూట‌మి అంటున్నా.. మిగిలిన ప్రాంతీయ‌పార్టీలు.. ముందుకు రాలేక‌పోతున్నాయి. అదీగాకుండా.. ఉత్త‌రాధి, ద‌క్షిణాధి అంటూ బేధాలు పొడ‌చూపాయి. ఆర్యులు, ద్ర‌విడులంటూ  ఏకంగా వ‌ర్గాల‌నే తెర‌మీద‌కు తెచ్చారు. ఇవ‌న్నీ.. ప్ర‌స్తుతానికి మాట‌ల‌కే ప‌రిమిత‌మైనా.. రాబోయే రోజుల్లో త‌ప్ప‌కుండా ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూప‌తాయి. అప్పుడు కానీ.. హీరోలెవ‌రో.. జీరోలెవ‌రో తేలిపోతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.