మా…. లో ముస‌లం. ఎవ‌రు కార‌ణం?

మూవీ ఆర్టిస్టుల అసోసియేష‌న్(మా) ర‌చ్చ బ‌జారుకెక్కింది. మ‌రో్సారి తెలుగు సినిమా వాళ్ల వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మొన్న డ్రగ్స్‌.. నిన్న క్యాస్టింగ్‌కౌచ్‌.. ఇప్పుడు మా అసోసియేష‌న్‌లో  కోట్లాదిరూపాయ‌ల కుంభ‌కోణం.మొత్తంమ్మీద‌.. తెలుగుతెర‌కు మ‌కిల‌ప‌ట్టిన‌ట్టుగా మారింది. సినీన‌టుల సంక్షేమంకోసం ఏర్పాటైన‌సంస్థ‌గా మా .. ప‌లు క‌ల్చ‌ర‌ల్ ఈవంట్స్ ద్వారా నిధులు స‌మీక‌రిస్తుంది. ఇదే విధంగా అమెరికాలో కార్య‌క్ర‌మానికి మా.. అధ్య‌క్షుడు శివాజీరాజా సార‌థ్యంలో మెగాస్టార్‌తో కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. దీనికి రెండుకోట్ల వ‌ర‌కూ వ‌చ్చే అవ‌కాశం ఉన్నా కేవ‌లం కోటి కే వ‌దిలేశార‌నేది న‌టుడు న‌రేష్ ఆరోప‌ణ‌. పైగా అమెరికాకు వెళ్లేందుకు బిజినెస్ క్లాస్‌లో ఫ్ల‌యిట్ టికెట్లు కొని నిధులు దుబారా చేసిన‌ట్లు ఆవేద‌న. అయితే.. శివాజీరాజా, శ్రీకాంత్‌, ప‌ర‌చూరి వెంక‌టేశ్వ‌ర‌రావు మాత్రం ఇదంతా అభూత క‌ల్ప‌న అంటూ కొట్టిపారేశారు. తాను అవినీతి చేసిన‌ట్టు నిరూపిస్తే.. ఆస్తంతా రాసిస్తానంటూ స‌వాల్ విసిరాడు. దీంతో మ‌రోసారి న‌రేష్ కూడా మీడియాముందుకు వ‌చ్చాడు. మేం అంతా అన్న‌ద‌మ్ములం.. మా మ‌ధ్య విబేధాలున్న‌మాట నిజ‌మేనంటూ అంగీక‌రించాడు. అయితే. అవినీతి జ‌ర‌గింద‌ని తాను  అన‌ట్లేదంటూనే.. త‌ల్లి విజ‌య‌నిర్మ‌ల త‌న పుట్టిన‌రోజు నాడు ఏటా రూ.75వేల మా కు ఇస్తుందంటూ  సెల‌విచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కూ మా సేక‌రించిన నిధులు..పెట్టిన ఖ‌ర్చుల‌కు లెక్క‌ల్లేవంటున్నారు. పైగా తాను ఫోన్ చేసినా స్పందించ‌ట్లేద‌ని.. దీన్ని బ‌ట్టి పెద్ద ఎత్తున నిధుల గోల్‌మాల్ జ‌రిగింద‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు.స‌వాళ్లు.. ప్ర‌తిస‌వాళ్ల మ‌ధ్య ఇద్ద‌రి వ‌ర్గాలు రచ్చ‌ను సినిమా ఇండ‌స్ట్రీ మొత్తానికి పాకించాయి. దీంతో  ఎవ‌రు  ఎటువైపు వంత‌పాడి.. దీన్ని ఎంత వ‌ర‌కూ తీసుకెళ‌తార‌నేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కూ విష‌యం జూనియ‌ర్ న‌టుల మ‌ధ్యనే ఉంది.. ఇది అగ్ర‌హీరోల వ‌ర‌కూ చేరితే ఎవ‌రెలా స్పందిస్తార‌నేది కూడా మ‌రో ఆందోళ‌న క‌లిగించే అంశం. ఇప్పుడిప్పుడే హీరోలు.. వ‌ర్గాలను దూరంగా ఉంచి ఏక‌తాటిపైకి వ‌స్తున్నారు. ఇటువంటి స‌మ‌యంలో అన‌వ‌స‌ర‌మైన విబేధాలు.. ఇంకెంత‌గా తెలుగుతెర‌ను ఇబ్బందిపెడ‌తాయ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతుంది. అయితే.. మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేసేందుకు మా వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మెగాస్టార్ చిరంజీవి రంగ‌ప్ర‌వేశంచేసిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే తాను చిరంజీవితో విష‌యం చెప్పానంటూ న‌రేష్ చెప్పారు. మ‌రి దీనిపై ఆయ‌నెలా స్పందిస్తారు.. స‌మ‌స్య‌ను  ఎలా ప‌రిష్క‌రిస్తార‌నేది వేచిచూడాలి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.