విశ్వరూపం-2 మూవీ రివ్యూ

బ్యాన‌ర్‌: రాజ్ క‌మ‌ల్ ఫిలిమ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్‌
స‌మ‌ర్ప‌ణ‌: ఆస్కార్ ఫిలిమ్స్ వి. ర‌విచంద్ర‌న్‌
న‌టీన‌టులు: కమల్‌హాసన్‌, రాహుల్‌ బోస్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, శేఖర్‌ కపూర్‌, వహీదా రెహమాన్ త‌దిత‌రులు
సంగీతం: మహమ్మద్‌ గిబ్రాన్‌
పాటలు: రామజోగయ్యశాస్త్రి
సినిమాటోగ్రఫీ: శామ్‌దత్‌, షైనుదీన్‌, షను జాన్‌ వర్గీస్‌
ఎడిటింగ్‌: మహేష్‌ నారాయణన్‌, విజయ్‌ శంకర్‌,
మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి
నిర్మాతలు: ఎస్‌.చంద్రహాసన్‌, కమల్‌హాసన్‌
రచన, దర్శకత్వం: కమల్‌హాసన్‌.

విలక్షణ నటుడు కమల్‌హాసన్ సినిమాలంటే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అదీ ఆయన దర్శకత్వం వహించి, నటించిన సినిమా అంటే ఇక చెప్పనక్కర్లేదు. గతంలో స్వీయ దర్శకత్వంలో సున్నిత‌మైన ఉగ్ర‌వాదం నేప‌థ్యాన్ని ఎంచుకొని ‘విశ్వ‌రూపం’ తెర‌కెక్కించారు. ఎన్నో వివాదాల మధ్య ఆ సినిమా.. ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయినా మంచి టాక్‌ను తెచ్చుకోగలిగింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వచ్చిన సినిమానే విశ్వరూపం-2. తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ ప్రమాణాలతో రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా వారి అంచనాలను అందుకోగలిగిందా..? కమల్ తన విశ్వరూపాన్ని చూపించారా..?

కథ
భారత సైన్యం ఆదేశాల ప్రకారం అల్‌ఖైదాలో సభ్యుడిగా ఉంటాడు విసామ్ అహ్మ‌ద్ (క‌మ‌ల్ హాస‌న్‌). వాళ్లు భారతదేశంపై ప్రయోగించబోయే ప్లాన్ల గురించి భారత సైన్యానికి సమాచారం ఇస్తుంటాడు విసామ్. ఈ విషయం అల్‌ఖైదా గ్రూప్ లీడర్ ఒమ‌ర్ ఖురేషి (రాహుల్ బోస్‌)కి తెలిసిపోతుంది. ఈ క్రమంలో విసామ్‌ను అంతమొందించాలనుకున్న ఖురేషి.. అతడితో పాటు దేశంలోని 64 ప్రాంతాల్లో బాంబు దాడులకు ప్లాన్ చేస్తాడు. అందుకోసం యూకే సముద్ర గర్భంలో ఉన్న బాంబులను యాక్టివేట్ చేయాలనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న ఖురేషీ త‌న భార్య‌, న్లూక్లియ‌ర్ సైన్స్‌లో పి.హెచ్‌.డి చేసిన నిరుప‌మ‌(పూజా కుమార్‌).. అసిస్టెంట్ ఆశ్రిత‌(ఆండ్రియా) స‌హా వెళ్లి అక్క‌డ స‌ముద్ర గ‌ర్భంలోకి చేరుకుంటాడు. అక్కడకు చేరుకున్న ఖురేషి మరి ఆ బాంబులను యాక్టివేట్ చేయకుండా ఆపాడా..? అతడికి నిరుపమ, అశ్రిత సాయం చేశారా..? లేదా..? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..
విశ్వరూపం చిత్రం ఎక్కడైతే ముగిసిందో విశ్వరూపం-2 కథ అక్కడ నుంచి మొదలవుతుంది. ఓమర్ బంకులపై సంకీర్ణ దళాల దాడులను చేయడం తొలిభాగంలో ప్రధాన అంశంగా కనపడుతుంది. తొలిభాగంలో వ్యూహ రచన సాగదీయడంతో ప్రేక్షకులకు సహనాన్ని పరీక్షించినట్టు ఉంటుంది. అద్భుతమైన థ్రిల్లింగ్ ఉంటుందనే ఆశించిన ప్రేక్షకులకు తొలిభాగం నిరాశనే కలిగిస్తుంది. తొలిభాగంలో గొప్పగా చెప్పుకొనే సన్నివేశాలు కానీ, కథ గానీ లేకపోవడం పెద్ద మైనస్. ప్రధానంగా కథలో కొత్తగా మలుపు లేకపోవడంతో సెకండాఫ్‌ కూడా చాలా ఫ్లాట్‌గా సాగిపోతుంది. సెంటిమెంట్ కోసం విసామ్ తల్లి ఎపిసోడ్‌ కూడా పెద్దగా పండలేకపోయింది. క్లైమాక్స్‌కు ముందు అస్మిత మర్డర్ నుంచి కథ కాస్త ఆసక్తిని రేపుతుంది. కానీ క్లైమాక్స్ కూడా గొప్పగా అనిపించదు. ఓమర్, సలీంను అంతం చేయడంతో కథకు ముగింపు కార్డు పడుతుంది. విశ్వరూపం1ను పోల్చితే ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశ పరిచిందనే చెప్పవచ్చు.

నటీనటులు, టెక్నీషియన్ల పనితీరు
కమల్ తన సహజ సిద్దమైన నటనతో డైలాగ్ డెలివరీతో మరోసారి ఆకట్టుకున్నారు. ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు, మాటలు, సెకండాఫ్‌లో మదర్ సెంటిమెంట్‌ వచ్చే దగ్గర ఆయన నటన మెప్పిస్తుంది. హీరోయిన్స్ ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేస్తూనే.. సినిమాకు కావాల్సిన గ్లామర్‌ను అందించారు. శేఖర్ కపూర్, రాహుల్ బోస్, వహీదా రెహ్మన్ తదితర నటులు తమ పాత్రల పరిధిలో చక్కగా నటించారు. ఇక, హీరోగా డైరెక్టర్‌గా ద్విపాత్రాభినయం చేసిన కమల్ రెండో దానిలో అంతగా ఆకట్టుకోలేకపోయారనే చెప్పాలి. ఐదు సంవత్సరాల క్రితం వచ్చిన సినిమాకు సీక్వెల్ అనగానే దానికి మించిన అంచనాలు ఉంటాయనే విషయాన్ని ఆయన గ్రహించలేకపోయారనిపిస్తోంది. అప్పటికి, ఇప్పటికీ టెక్నాలజీ మరింత అడ్వాన్స్‌ అయినా దానిని సరిగా ఉపయోగించలేదనిపిస్తుంది. ఒక జిబ్రాన్ సంగీతం బాగానే ఉన్నా మొదటి భాగంతో పోల్చితే తక్కువే అనిపిస్తుంది. శ్యాంద‌త్‌, షాను జాన్ వ‌ర్గీస్ సినిమాటోగ్రఫి సినిమాను నిలబెట్టే స్థాయిలో ఉంది. డైలాగ్‌లపై మరింత శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు
* నటీ నటులు
* యాక్షన్ ఎపిసోడ్స్
* సినిమాటోగ్రఫి

బలహీనతలు
* కథ, కథనం
* సాగతీతగా అనిపిస్తుంది
* బ్యాగ్రౌండ్ స్కోర్
* కథకు కనెక్ట్‌ అయ్యే సీన్స్ ఉండవు

మొత్తంగా: కమల్‌ ‘విశ్వరూపం’.. ఈ సారి వర్కౌట్ అవలేదు.

రేటింగ్: 2/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.