విశాఖ వైసీపీలో ఫైటింగ్‌..

2020 ఎన్నిక‌ల్లో వైసీపీని ఎలాగైన విజయ తీరాల‌కు చేర్చాల‌ని జ‌గ‌న్‌ క‌ల‌లు కంటున్నాడు. ఈ మేర‌కు పాద‌యాత్ర‌లు నిర్వ‌హిస్తున్నాడు. కాని అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు పార్టీని  దెబ్బ‌తీస్తున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. స్మార్ట్ సిటీ విశాఖలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతున్నాయి. జిల్లాలోని పలు నియోజకవర్గాలలో సమన్వయకర్తల మధ్య ఏమాత్రం సఖ్యత లేదు. ఒకరి మీద ఒకరు ఎత్తులు, పైఎత్తులు వేసుకుంటూ పార్టీ పరువు తీస్తున్నారని స్వయంగా ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సమన్వయకర్తలైన ఉషాకిరణ్, చంద్రమౌళి, సత్తి రామకృష్ణారెడ్డి మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుందని అంటున్నారు. ఈ ముగ్గురు సమన్వయకర్తలు పార్టీ సమావేశాలలో, కార్యక్రమాలలో కలిసి పనిచేస్తున్నట్లు బిల్టప్ ఇస్తున్నా.. ఒకరి మీద మరొకరు అధిపత్యం సాధించడానికి అంతర్గతంగా పావులు కదుపుతూనే ఉన్నారట. ఈ పరిణామమే పార్టీకి తలవంపులు తెస్తోందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో ఉషాకిరణ్‌ను సమన్యకర్త బాధ్యత నుంచి తప్పించాలంటూ పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌కి ఈ మధ్య కొంతమంది ఫిర్యాదు చేశారు కూడా! విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్తగా తనను తప్పించాలని మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్ కోరగా.. అధిష్టానం ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ స్థానంలో వార్డు అధ్యక్షుడు అయిన చంద్రమౌళిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. దీనిపై పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. సీనియర్లను కాదని, ఒక వార్డు అధ్యక్షుడికి సమన్వయకర్త బాధ్యతలు అప్పగిస్తే, ఆయన కింద తాము పనిచేయలేమంటూ కొందరు రుసరుసలాడారు. దీంతో పార్టీ హైకమాండ్ స్పందించి చంద్రమౌళితో పాటు ఉషాకిరణ్, సత్తి రామకృష్ణారెడ్డిలను కూడా సమన్వయకర్తలుగా నియమించింది. ఇలాగైనా తమ సమస్యకు పరిష్కారం దొరికిందని వైసీపీ క్యాడర్‌ భావిస్తున్న తరుణంలో మరో సమస్య తెరపైకి వచ్చింది. సమన్వయకర్తలు ముగ్గురూ ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నారట. ఈ పరిణామంతో పార్టీ పరువు రోడ్డున పడుతోందని పార్టీ కార్యకర్తలు బాహాటంగానే అంటున్నారు. నియోజకవర్గంలో తమకు అనుకూలంగా లేని వార్డులలో అధ్యక్షులను మార్చేసి, ఆయా చోట్ల తమకు సానుకూలంగా ఉన్నవారిని నియమించుకోవాలని ఆ ముగ్గురూ ఆలోచన చేస్తున్నారట. ఈ ధోరణే పార్టీ కొంప ముంచుతోందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ‌లో  అసంతృప్తి జ్వాలలు మళ్లీ ఎప్పుడు విజృంభిస్తాయోనని స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు కలవరపడుతున్నారు.
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.