విశాఖ‌లో బీజేపీకి గ‌డ్డుకాల‌మేనా…..

భారతీయ జనతా పార్టీ… కేంద్రంలోనూ.. మెజారిటీ రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న పార్టీ! నరేంద్రమోదీ-అమిత్‌షా ద్వయం వ్యూహాలతో బీజేపీ పటిష్టస్థితికి చేరుకుంది.. ఇది నిన్నటి ముచ్చట! ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.. చాలా రాష్ట్రాలలో ఆ పార్టీ ఎదురీదుతోంది.. బీజేపీతో తెలుగుదేశంపార్టీ తెగతెంపులు చేసుకున్నాక ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆ పార్టీ దయనీయస్థితికి చేరుకుంది.. బీజేపీ అంటేనే మండిపడుతున్నారు ఏపీ ప్రజలు.. ఇదే కమలనాథుల్లో కలవరం కలిగిస్తోంది.. కార్పొరేషన్‌గా విశాఖ అవతరించినప్పుడు తొలి మేయర్‌ స్థానాన్ని గెల్చుకున్నది బీజేపీనే! 1981లో ఎన్‌ఎస్‌ఎన్‌ రెడ్డి సారథ్యంలోని బీజేపీ పాతికకుపైగా సీట్లను సాధించి మొదటి మేయర్‌ పదవిని చేపట్టింది. తర్వాత ఎన్‌ఎస్‌ఎన్‌ రెడ్డి ఎమ్మెల్యే కూడా అయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న మాధవ్‌ తండ్రి చలపతిరావు కూడా రెండుసార్లు ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత ఎప్పుడూ విశాఖలో బీజేపీ జెండా ఎగరలేదు. వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో తెలుగుదేశంపార్టీ ఎన్డీయేలో భాగస్వామి! ఆ కారణంగా విశాఖ నుంచి హరిబాబు ఎమ్మెల్యేగా గెలిచారు.
అప్పుడు కొన్నాళ్లు బీజేపీ కార్యకర్తల హడావుడి కనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఎక్కడా ఆ ఛాయలు కనిపించలేదు. 2014లో తెలుగుదేశంపార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు విశాఖలో కమలం వికసించింది. పొత్తులో భాగంగా బీజేపీకి మూడు ఎంపీ స్థానాలు.. 13 అసెంబ్లీ స్థానాలు కేటాయించింది తెలుగుదేశంపార్టీ! ఇందులో విశాఖపట్నం నుంచే రెండు అసెంబ్లీ స్థానాలను.. ఒక ఎంపీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చింది. ఆ తర్వాత చలపతిరావు కుమారుడు మాధవ్‌ కూడా టీడీపీ సాయంతోనే ఎమ్మెల్సీ అయ్యారు. ఇలా విశాఖలో ఒక అసెంబ్లీ.. ఓ లోక్‌సభ స్థానం.. ఓ ఎమ్మెల్సీ బీజేపీ ఖాతాలోకి వచ్చాయి.. ఇదంతా చూసి విశాఖలో బీజేపీ బలం పెరిగిందనుకున్నారు.. విభజన హామీలు అమలు చేయకపోవడం… ఇస్తామన్న ప్రత్యేకహోదాను పక్కన పెట్టేయడం.. రైల్వే జోన్‌ ఊసే ఎత్తకపోవడం… అసలు ఏపీని పెద్దగా పట్టించుకోకపోవడంతో బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ తీరని ద్రోహం చేసిందన్న అభిప్రాయం ప్రజలలో కలిగింది.. దీంతో ఏపీ బీజేపీ నేతలలో ఆందోళన మొదలయ్యింది.. టీడీపీ మద్దతు లేకుండా ఒక్కసీటు కూడా గెలిచే అవకాశం లేదనే భావనకు వచ్చారు.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీవైపు మెగ్గుచూపిన కొందరు ఇప్పుడు అటువైపు చూడటం మానేశారు.
2014లో పార్టీలో చేరిన ఆడారి కిశోర్‌కుమార్‌కు బీజేవైఎం జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించారు. అయితే టీడీపీ కటిఫ్‌ చెప్పిన తర్వాత  ఆ పదవిలో ఉంటూనే బీజేపీకి వ్యతిరేకంగా కమలం కండువా వేసుకుని మరీ ఆందోళనలు చేశారు కిశోర్‌కుమార్‌! దాంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది బీజేపీ! ఒకప్పుడు టీడీపీలో ఉన్న కిశోర్‌కుమార్‌ మళ్లీ సొంతింటికి వెళ్లేందుకే అలా చేశారని అంటోంది బీజేపీ! ఎంపీ హరిబాబు.. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు… ఎమ్మెల్సీ మాధవ్‌లు కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారంతే! తెలుగుదేశంపార్టీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నారు.. వచ్చే ఎన్నికల్లో వీరి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉంది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి హరిబాబు రాజీనామా చేసి ఇన్ని రోజులు అవుతున్నా.. కొత్త సారథిని నియమించలేదంటేనే ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అర్థమవుతోందని కమలదళ సభ్యులే అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసేది లేదని హరిబాబు తన సన్నిహితుల దగ్గర అంటున్నారట! ఆయనే అలా అంటే కొత్తగా పార్టీలోకి వచ్చిన వారి పరిస్థితి ఏమిటో మరి! ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేరిస్తే జనాల దగ్గరకు వెళ్లి ఓటు అడిగే ధైర్యం వస్తుంది తప్ప ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదంటున్నారు బీజేపీ నేతలు! అసలు మోదీ- షా మదిలో ఆంధ్రప్రదేశ్‌పై ఎలాంటి అభిప్రాయం ఉందో అంతుపట్టడం లేదని చెబుతున్నారు.. ఒకవేళ బీజేపీ అన్ని హామీలు అమలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరంటున్నారు కొందరు.. మొత్తానికి ఏపీలో బీజేపీకి ఇది గడ్డుకాలమే! 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.