టీఆర్ఎస్‌లోనే వినోద్.. మార్చింది కేసీఆర్ కాదు.. కాంగ్రెస్సే

తెలంగాణ ఎన్నికల హడావిడి రోజు రోజుకూ పెరిగిపోతుండగా కొందరు నేతలు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తున్నారు. అలాంటి జాబితాలోకే వస్తారు పెద్దపల్లి మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దివంగత జీ వెంకటస్వామి(కాకా) కొడుకు వినోద్. టీఆర్ఎస్ తనకు టికెట్ కేటాయించలేదనే కారణంతో చేసిన ప్రయత్నాలతో ఆయన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. అసెంబ్లీని రద్దు చేసిన రోజే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. దాదాపు 95 శాతం వరకు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వారిని తిరిగి పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. చెన్నూర్‌, చొప్పదండి, వరంగల్‌ పడమర స్థానాల్లో సిట్టింగ్‌లకు టిక్కెట్లు ప్రకటించలేదు. చెన్నూర్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు బదులు పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు టిక్కెట్‌ ఇచ్చారు. దీంతో ఇక్కడి నుంచి టిక్కె ట్‌ ఆశించిన వివేక్‌ సోదరుడు మాజీ మంత్రి వినోద్‌కు టిక్కెట్‌ రాకపోవడంతో ఆయన ఒక్క సారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో వినోద్ టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పాలని భావించారు. ఇందులో భాగంగానే కొన్ని ప్రయత్నాలు కూడా చేశారు. తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీనికి కారణం కేసీఆర్ కాదు.. కాంగ్రెస్సే అని ప్రచారం జరుగుతోంది.

చెన్నూరు నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డం వినోద్.. ఈ సారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే, కొద్దిరోజుల క్రితం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో వినోద్ పేరు లేదు. ఈ స్థానాన్ని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు కేటాయించారు గులాబీ బాస్. దీంతో వినోద్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. దీనిపై కేటీఆర్‌ను కలిసి మాట్లాడారని, అయితే ఆయన అక్కడి అభ్యర్థిని మార్చడం కుదరదని తెగేసి చెప్పినట్లు తెలిసింది. ఈ కారణంగానే టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని కాంగ్రెస్‌ పెద్దలతో సంప్రదింపులు కూడా జరిపారు. తనకు చెన్నూర్‌ లేదా బెల్లంపల్లి టిక్కెట్‌ ఇస్తే పార్టీలోకి వస్తానని ప్రతిపాదించారు. అయితే, దీనికి కాంగ్రెస్ అధిష్ఠానం ఒప్పుకోలేదని తెలిసింది. ముందు పార్టీలో చేరితే సీటు గురించి తర్వాత ఆలోచిస్తామని, లేకుంటే భవిష్యత్‌లో ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవిస్తామని చెప్పినట్లు సమాచారం. దీంతో వినోద్ అసంతృప్తికి లోనయ్యారట. ఆ క్రమంలోనే కేసీఆర్ కూడా వినోద్‌కు ఫోన్ చేశారు. ఆ వెంటనే కేటీఆర్‌ కూడా వినోద్‌తో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే అధికారమని, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏదైనా కీలక పదవి ఇస్తామని హమీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.