సంచలన ప్రకటనతో టీఆర్ఎస్‌కు షాకిచ్చిన వినోద్‌

తెలంగాణ ఎన్నికల హడావిడి రోజు రోజుకూ పెరిగిపోతుండగా కొందరు నేతలు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తున్నారు. అలాంటి జాబితాలోకే వస్తారు పెద్దపల్లి మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దివంగత జీ వెంకటస్వామి(కాకా) కొడుకు వినోద్. టీఆర్ఎస్ తనకు టికెట్ కేటాయించలేదనే కారణంతో చేసిన ప్రయత్నాలతో ఆయన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. అసెంబ్లీని రద్దు చేసిన రోజే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. దాదాపు 95 శాతం వరకు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వారిని తిరిగి పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. చెన్నూర్‌, చొప్పదండి, వరంగల్‌ పడమర స్థానాల్లో సిట్టింగ్‌లకు టిక్కెట్లు ప్రకటించలేదు. చెన్నూర్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు బదులు పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు టిక్కెట్‌ ఇచ్చారు. దీంతో ఇక్కడి నుంచి టిక్కె ట్‌ ఆశించిన వివేక్‌ సోదరుడు మాజీ మంత్రి వినోద్‌కు టిక్కెట్‌ రాకపోవడంతో ఆయన ఒక్క సారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో వినోద్ టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పాలని భావించారు. అయితే, కేటీఆర్ సమావేశం.. కేసీఆర్ నుంచి ఫోన్ రావడంతో ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించారు.

తాజాగా వినోద్ సంచలన ప్రకటన చేశారు. తాను ఎన్నికల బరిలో ఉంటున్నట్లు వెల్లడించారు. ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకు బెల్లంపల్లి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు మాజీ మంత్రి గడ్డం వినోద్‌ ప్రకటించారు. తన తండ్రి దివంగత వెంకటస్వామి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారని, ఆయన ఆశీస్సులతో ప్రజాసేవ చేయడానికి బెల్లంపల్లి నుంచి పోటీకి దిగుతున్నట్లు చెప్పిన వినోద్.. ఏ పార్టీ నుంచి నామినేషన్‌ దాఖలు చేస్తాననే విషయాన్ని మాత్రం రెండు రోజుల్లో వెల్లడిస్తానని పేర్కొన్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి సోమవారమే ఆఖరు రోజు కావడంతో ఆయన అదే రోజుగానీ, ఆదివారంగానీ పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. బెల్లంపల్లి టికెట్ టీఆర్ఎస్ దుర్గం చిన్నయ్య‌కు కేటాయించింది. అలాగే మహాకూటమి తరపున ఈ స్థానంలో సీపీఐ పోటీ చేస్తోంది. ఆ పార్టీ తరపున గుండా మల్లేస్ అక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ కొయ్యల ఎమాజీని, బీఎల్ఎప్ సబ్బని కృష్ణను బరిలో ఉంచాయి. దీంతో వినోద్ ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఇటీవల టీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని ప్రకటించిన ఆయన.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చే పదవులపై ఆసక్తి లేకనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.