‘వినయ విధేయ రామ’ మూవీ రివ్యూ

స‌మ‌ర్ప‌ణ‌: డి.పార్వ‌తి
నిర్మాణ సంస్థ‌: డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
నటీనటులు: రామ్‌చ‌ర‌ణ్‌, కియ‌రా అద్వాని, వివేక్ ఒబెరాయ్‌, ప్ర‌శాంత్‌, స్నేహ‌, ఆర్య‌న్ రాజేష్‌, మ‌ధుమిత‌, ర‌వివ‌ర్మ‌, హిమ‌జ‌, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, మ‌హేష్ మంజ్రేక‌ర్‌, మ‌ధునంద‌న్‌ త‌దిత‌రులు
డైలాగ్స్: ఎం ర‌త్నం
ఆర్ట్: ఏఎస్‌ ప్ర‌కాష్‌
ఎడిటింగ్: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర్ రావు, త‌మ్మిరాజు
ఫైట్స్‌: క‌న‌ల్ క‌ణ్ణ‌న్‌
సినిమాటోగ్రఫీ: రిషి పంజాబి, అర్థ‌ర్ ఏ విల్స‌న్‌
మ్యూజిక్: దేవిశ్రీ ప్ర‌సాద్‌
ప్రొడ్యూసర్: డీవీవీ దానయ్య
స్టోరీ, డైరెక్షన్: బోయ‌పాటి శ్రీను

‘రంగస్థలం’తో బంపర్ హిట్ కొట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. మరోవైపు వరుస హిట్‌లతో దూసుకుపోతున్నాడు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే ‘వినయ విధేయ రామ’. క్రేజీ కాంబినేషన్ కావడంతో పాటు చరణ్ లుక్.. టీజర్.. ట్రైలర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. టైటిల్‌లో వినయ విధేయుడిగా ఉన్న రాముడు.. ట్రైలర్‌లో మాత్రం విధ్వంసం సృష్టిస్తున్నాడు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సంక్రాంతి కానుకగా గురువారం విడుదలైన ఈ సినిమా ఎలాంటి టాక్‌ను సొంతం చేసుకుంది..? పక్కా కమర్షియల్ సినిమాలు చేసే బోయపాటి తన విజయాల పరంపరను కొనసాగించారా..? చెర్రీ కెరీర్‌కు ఈ సినిమా ఎలాంటి ఫలితం ఇచ్చింది..?

కథ
అందమైన కుటుంబం.. అందులో ఐదుగురు అన్నాదమ్ములు.. వారిలో చిన్నవాడు రామ్ కొణిదెల(చరణ్). కుటుంబమంటే ప్రాణమిచ్చే మనస్తత్వం ఉన్న రామ్‌.. తన వారి జోలికొస్తే వెనుకాడడు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వ అధికారిగా పని చేస్తున్న రామ్ పెద్దన్నయ్య భువన్ కుమార్(ప్రశాంత్) నిజాయతీ వల్ల పందెం పరశురాం(ముఖేష్ రిషి)తో గొడవ పెట్టుకుంటాడు. అప్పుడు అన్నకు సాయం చేసి పరశురాం చేస్తున్న చెడు పనులను రామ్ బయటపెడతాడు. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య వివాదం రేగుతుంది. రామ్‌పై కోపంతో అతని కుటుంబాన్ని అంతం చేయాలనుకున్న పరశురాం.. ఆ పనిని మున్నాభాయ్(వివేక్ ఒబెరాయ్)కు అప్పగిస్తాడు. అసలీ మున్నాభాయ్ ఎవరు..? పరశురాం అప్పగించిన పనిని మున్నాభాయ్ పూర్తి చేశాడా..? రామ్ తన కుటుంబాన్ని రక్షించడానికి ఏం చేశాడు..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే
క్రేజీ కాంబినేషన్.. భారీ తారాగణ.. ఎన్నో అంచనాలు.. వీటన్నింటి నడుమ విడుదలైన ‘వినయ విధేయ రామ’ ప్రేక్షకులను నిరాశ పరుస్తుంది. టైటిల్ ఉన్న వినయాన్ని, విధేయతను చూపించకుండా తన రొట్ట కొట్టుడు మాస్ ట్రాక్.. మధ్య మధ్యలో కొన్ని సెంటిమెంట్ సీన్స్‌తో సోసోగా నడిపించాడు బోయపాటి. మెగా పవర్ స్టార్ నుంచి పక్కా మాస్ మూవీని ఆశించని అభిమాని ఉండడు. అలాంటి వారికి ఈ సినిమా తృప్తినిస్తుంది. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంపై పెట్టిన శ్రద్ధ కథ.. కథనం పెట్టలేదని అనిపిస్తుంది. ఈ సినిమా మాస్ ప్రేక్షకుల చేత పర్వాలేదనిపించుకునేలా ఉందే తప్ప.. అన్ని వర్గాలను ఆకట్టుకోదని చెప్పవచ్చు.

నటీనటుల పనితీరు
కుటుంబం కోసం తాపత్రయపడే తమ్ముడిగా.. అదే కుటుంబం కోసం శత్రువులతో పోరాటం చేసే ధీరుడిగా రామ్ చరణ్ ఆకట్టుకున్నాడు. గతంలో రామ్ చరణ్ మాస్ పాత్రలు చేసినప్పటికీ ఇలాంటి పక్కా మాస్ పాత్రలో కనిపించడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. అంతేకాదు, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. అలాగే ఎమోషనల్ సీన్స్‌లోనూ మంచి నటనని కనబరిచాడు. ముఖ్యంగా ఈ సినిమాలో చరణ్ డాన్సులు ఇరగదీశాడు. మొత్తంగా డైరెక్టర్ చెప్పిన దానికి 100 శాతం న్యాయం చేశాడు. హీరోయిన్ కియారా అద్వానీ ప్రాధాన్యత లేని పాత్రలో నటించింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌కు, సెకండాఫ్‌లో ఓ పాటకు మాత్రమే ఆమెను తీసుకున్నారా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు హైలైట్ అంటే విలన్‌గా చేసిన వివేక్ ఒబెరాయ్ నటనే. మాస్ విలన్‌ను వివేక్ పండించిన నటనకు అంతా ఫిదా అయిపోతారు. మిగిలిన వారు తమ పాత్రల పరిధి మేర నటించారు.

టెక్నీషియన్ల పనితీరు
దర్శకుడు బోయపాటి రొటీన్ కథ, కథనంతో నిరాశ పరిచాడు. హీరోను ఎలివేట్ చేయడంలో సక్సెస్ సాధించినా.. ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేయడంలో విఫలమయ్యాడు. సన్నివేశాల మధ్య ఆసక్తిని రేకెత్తించలేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది. మధ్య మధ్యలో వచ్చే కొన్ని పాటలను అతికించినట్టు పెట్టాడు. ఈ సినిమాకు బోయపాటి డైరెక్షనే ప్రధాన లోపం అని చెప్పవచ్చు. మిగిలిన వారిలో మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్.. పాటలు ఆకట్టుకోలేదు. విలన్ వచ్చినప్పుడు వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ తప్ప అతను మెప్పించలేకపోయాడు. ఆర్థర్ ఏ విల్సన్ ఇచ్చిన దృశ్య రూపం చాలా బాగుంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ నిరాశ పరిచింది. ఆయన తన కత్తెరకు ఇంకా పని చెప్పాల్సింది. కనల్ కణ్ణన్ యాక్షన్ డిజైనింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు
* రామ్ చరణ్, వివేక్ ఒబెరాయ్ నటన
* యాక్షన్ ఎపిసోడ్స్
* ఇంటర్వెల్ బ్యాంగ్

బలహీనతలు
* కథ, కథనం
* డైరెక్షన్
* మ్యూజిక్
* నమ్మశక్యంకానీ సన్నివేశాలు
* ఓవరైన హింస

మొత్తంగా: ‘వినయ విధేయ రామ’.. ‘ఫైట్ పాట ఫైట్’

రేటింగ్: 2.25/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.