విజేత మూవీ రివ్యూ

నిర్మాణ సంస్థ‌: వారాహి చ‌ల‌న చిత్రం
తారాగ‌ణం: క‌ల్యాణ్‌దేవ్‌, మాళ‌వికా నాయ‌ర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, నాజ‌ర్‌, ప్ర‌గ‌తి, క‌ల్యాణి న‌ట‌రాజ‌న్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు
సంగీతం: హ‌ర్ష‌వ‌ర్ధ‌న రామేశ్వ‌ర్‌
చాయాగ్ర‌హ‌ణం: కె.కె.సెంథిల్ కుమార్‌
నిర్మాత‌: ర‌జ‌నీ కొర్ర‌పాటి, సాయికొర్ర‌పాటి ప్రొడ‌క్ష‌న్స్‌
క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: రాకేశ్ శ‌శి

చిరంజీవి కెరీర్‌లో ఓ మైలురాయి చిత్రమైన ‘‘విజేత’’ సినిమా మెగా అభిమానులకే కాక తెలుగు సినీ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇప్పుడు అదే టైటిల్‌తో మరోసారి మెస్మరైజ్ చేయడానికి సిద్ధమయ్యాడు చిరు అల్లుడు కల్యాణ్ దేవ్. మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న హీరో కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో వారసుల సంఖ్య పెరిగిపోతున్న క్రమంలో.. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న కల్యాణ్ తన సత్తా చాటాలని చూస్తున్నాడు. అందునా చిరంజీవి సెలెక్ట్ చేసిన కథ కావడం.. ఆయన సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటైన విజేత సినిమా టైటిల్ కావడంతో టాలీవుడ్ అంతా ఈ సినిమా రిజల్ట్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరి, ఎన్నో అంచనాల నడుమ తెరంగేట్రం చేస్తున్న చిరు అల్లుడు ప్రేక్షకుల మది గెలుచుకుని ‘‘విజేత’’గా నిలిచాడా..? లేదా..?

కథ
కుటుంబమే ప్రాణంగా భావించే వ్యక్తి శ్రీనివాసరావు(మురళీ శర్మ). కొడుకు రామ్(కళ్యాణ్ దేవ్) కోసం తన జీవితాశయాన్నే ఫణంగా పెడతాడు. భార్య, బిడ్డల కోసం తనకెంతో ఇష్టమైన ఫొటోగ్రఫీని పక్కనపెట్టి ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగానికి చేరతాడు. బిడ్డల్ని కష్టపడి చదివిస్తాడు. కానీ ఇంజినీరింగ్ పూర్తిచేసిన కొడుకు ఏ పని చేయకుండా ఖాళీగా ఆవారాగా తిరుగుతుంటాడు. ఈ దశలోనే ఎదురింట్లో అద్దెకు దిగిన చైత్ర(మాళవిక)తో ప్రేమలో పడతాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ.. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతూ ఉంటాడు. తన మిత్రులతో కలసి సొంతంగా ఈవెంట్ ఆర్గనైజింగ్ బిజినెస్‌ను ప్రారంభిస్తాడు. అందులో నష్టాలు రావడంతో దానిని పక్కన పెట్టేస్తాడు. కొడుకు చేస్తున్న పనులు చూసి బాధపడుతుంటాడు శ్రీనివాసరావు. దీంతో ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఆ సమయంలో తన తండ్రి స్నేహితుడు(తనికెళ్ల భరణి), రామ్‌కు హిత బోధ చేస్తాడు. అప్పుడు రామ్ మారతాడా..? తండ్రి మనసు గెలుచుకుని విజేతగా నిలుస్తాడా..? అసలు హీరోయిన్ కేరెక్టర్ ఏంటి..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే
అన్నీ సమకూర్చి పెట్టే తల్లిదండ్రులు.. చదువు విషయంలోనో, ఉద్యోగం విషయంలోనో హీరో రాజీ పడకపోవడం.. తల్లిదండ్రులు చెప్పినట్టుగా చేయలేకపోవడం.. ఇంటర్వెల్ ముందు మారిపోవడం.. చివరకు విజేతగా నిలవడం ఈ తరహాలు ఇంతకు ముందు చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని హిట్ కూడా అయ్యాయి. కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయిందనే చెప్పాలి. ముందుగా ఈ సినిమా హీరో గురించే మాట్లాడుకోవాలి. తన తొలి సినిమా కాబట్టి అతడి నుంచి ఎక్కువ ఆశించలేం. ఆయన ఇంకా చాలా విషయాల్లో మెరుగుపడాల్సి ఉంది. హీరోగా నిలదొక్కుకోవాలంటే ఈ నటన సరిపోదు. ఈ సినిమాకు ఆయువు అంటే మురళీ శర్మ నటననే చెప్పుకోవాలి. హీరో తండ్రిగా ఆయన చేసిన అభినయం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. హీరోయిన్ పాత్ర పరిమితమే కావడంతో చేసిన కొద్దిసేపయినా తన పాత్రకు న్యాయం చేసింది. తనికెళ్ల భరణి, వి.జయప్రకాష్, రాజీవ్ కనకాల తదితర నటీనటులు తమ పాత్ర పరిధి మేర ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సాంకేతికపరంగా చూసుకుంటే సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. నిర్మాత సాయి కొర్రపాటి చాలా రిచ్‌గా నిర్మించారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచింది. ప్రతి ఫ్రేమ్ తెరపై చాలా అందంగా కనిపించింది. ఫ్యాక్టరీ క్వార్టర్స్‌ను కూడా చాలా అందంగా చూపించారు. హీరో కళ్యాణ్ దేవ్‌ను వీలైనంత బాగా చూపించడానికి సెంథిల్ ప్రయత్నించారు. సినిమాను మరీ సాగదీయకుండా కత్తిరించిన ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ పనితనాన్ని మెచ్చుకోవాలి.

ప్లస్ పాయింట్స్
మురళి శర్మ నటన
కొన్ని ఎమోషన్ సీన్స్
క్లైమాక్స్
విజేత టైటిల్

మైనస్ పాయింట్స్
కామెడీ వర్కవుట్ కాకపోవడం
సాగతీతగా సాగిన ఫస్టాఫ్
రొటీన్ స్టోరీ

బాటమ్ లైన్: ఈ విజేత తండ్రి మనసు గెలిచాడు కానీ, ప్రేక్షకుల మనసు గెలవలేకపోయాడు

రేటింగ్: 2.25/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.