బెజ‌వాడ బాగుంటే అంతా బాగుంటుంద‌ట‌…

“బెజవాడలో బాగుంటే రాష్ట్రం మొత్తం బాగున్నట్టే. బెజవాడలో సినిమా ఆడిందంటే రాష్ట్రం మొత్తం బొమ్మ ఆడినట్టే..” అని అంటుంటారు పరిశీలకులు! అందుకే కావచ్చు రాజకీయ పక్షాలు కూడా బెజవాడ నాడి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌పార్టీ తొలుత బెజవాడలో పార్టీని చక్కదిద్దే పనిలో పడింది. ఈ నేపథ్యంలో పెద్ద తతంగమే నడుస్తోందట.ఏపీలో ప్రధాన రాజకీయ పక్షాలు విజయవాడపై దృష్టి సారించాయి. విజయవాడలో గెలుపుగుర్రం ఎక్కితే ఆ ప్రభావం రాష్ట్రం అంతటా ఉంటుందన్నది అందరు నేతల ప్రగాఢ విశ్వాసం. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి విజయవాడలో లభించిన విజయం మంచి కిక్ ఇచ్చింది.

ఆ తర్వాత కృష్ణాజిల్లాలో జరిగిన పంచాయతీలు, మండలాలు, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ టీడీపీ హవా కొనసాగింది. తదనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్, సెంట్రల్ నుంచి బోండా ఉమామహేశ్వరరావు గెలుపొందారు. పశ్చిమ స్థానాన్ని మాత్రం పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. అక్కడ వైసీపీ నుంచి పోటీచేసిన జలీల్ ఖాన్ గెలుపొందారు. ఆ తర్వాత జలీల్ ఖాన్ టీడీపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే! వచ్చే ఎన్నికల్లో కూడా సిట్టింగ్‌లకే టీడీపీ టిక్కెట్లు ఇవ్వనుంది. ఒక్క జలీల్‌ ఖాన్ కుటుంబం నుంచి ఆయన సిఫార్సు చేసిన వారికి టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

యువజన- శ్రామిక- రైతు కాంగ్రెస్ పార్టీ కూడా విజయవాడపై దృష్టిపెట్టింది. నగరంలోని మూడు నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపికను ఖరారుచేసింది. పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూడు నియోజకవర్గాలలో పోటీచేసే అభ్యర్థులను ప్రకటించారు. గతంలో విజయవాడ తూర్పు నుంచి వంగవీటి రాధాకృష్ణ పోటీచేశారు. ఈసారి సెంట్రల్ నియోజకవర్గం నుంచి రాధాకృష్ణ పోటీచేస్తారని ప్రకటించారు. వంగవీటి రంగా కుటుంబంపై వ్యాఖ్యలు చేసిన కారణంగా గౌతంరెడ్డిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. జగన్ పాదాయత్ర విజయవాడ చేరుకున్న రోజే ఈ సస్పెన్షన్ ఎత్తివేయడంతో రాధావర్గం కొంత గుర్రుగా ఉంది. విజయవాడ సెంట్రల్ నుంచి వంగవీటి రాధా పోటీచేస్తారని ప్రకటించిన తర్వాత తాజాగా గౌతంరెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్‌కి రాష్ట్ర కన్వీనర్‌గా నియమించారు. కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు. ఇలా తలా ఒక పదవిని పంచి మధ్య నియోజకవర్గం పంచాయతీని సెటిల్ చేశారు.

ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి పోటీచేస్తారని పెద్దిరెడ్డి ప్రకటించారు. వివాదాలకు అతీతంగా.. పెద్దమనిషిగా పేరున్న యలమంచిలి రవిని పార్టీలోకి తీసుకునే సమయంలోనే ఆయనకు తూర్పు టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు రవి పేరును తూర్పు నియోజకవర్గానికి ఖరారుచేశారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి పార్టీ నగర అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు పేరు ఖరారుచేశారు. వెల్లంపల్లి 2014 ఎన్నికలలో బీజేపీ తరపున పశ్చిమ నియోజకర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. ఆయనకు నగర అధ్యక్ష పదవితో పాటు, పశ్చిమ నుంచి పోటీచేసే అవకాశం కల్పించారు. 2009లో పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం తరఫున ఆయన పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రధాన పక్షాలైన తెలుగుదేశం, వైసీపీ పార్టీలు రెండూ బెజవాడ ఎన్నికల బరిలోకి దింపేందుకు అభ్యర్ధులను రంగంలోకి దింపాయి. ఇక ఎన్నికల బరే మిగిలి ఉంది. బెజవాడలో గెలుపు అనేది ఒక సెంటిమెంట్‌గా రెండు పార్టీలు భావిస్తుండటంతో భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొన్నది. ఇరుపక్షాల అభ్యర్ధులు పరోక్షంగా ప్రచారం కూడా ప్రారంభించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.