రాహుల్ కావాలంటే.. రాములమ్మ వద్దంటుంది

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఏ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుందో.. ఏ పార్టీతో కలిసి పని చేస్తుందో ఊహించడం కష్టంగా మారింది. రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలతో పాటు, ప్రతిపక్షాలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజకీయం రంజుగా సాగుతోంది. రెండు రాష్ట్రాల్లో కామన్‌గా టీడీపీ-కాంగ్రెస్ పొత్తు హాట్ టాపిక్ అవుతోంది. ఆ పార్టీల అధిష్టానాలు దీనిపై చర్చించుకున్నాయో లేదో తెలియదు కానీ, నేతలు మాత్రం అప్పుడు దీని గురించి మాట్లాడేస్తున్నారు. టీడీపీ.. ఎన్డీయే నుంచి బయటికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో సఖ్యతగా ఉండడం.. తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఓడించాలంటే పొత్తు అనివార్యమని కొందరు నేతలు బహిరంగంగానే ప్రకటించడం వంటి కారణాలతో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో పొత్తు పెట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో కూడా టీడీపీ తమకు అండగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం పొత్తుకు సై అంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు చెందిన మహిళానేత సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

ఒకవైపు ఏపీలో టీడీపీకి చెందిన నేతలు, అందునా ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి లాంటి సీనియర్ నేతలు కాంగ్రెస్‌తో పొత్తు వద్దని బహిరంగంగానే చెప్పి సంచలనానికి తెరతీశారు. మరోవైపు అదే బాటలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత, ఫైర్ బ్రాండ్, లేడీ అమితాబ్ విజయశాంతి టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే భారీ నష్టం తప్పదని ఆమె భావిస్తున్నారట. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత రాహుల్‌కి లేఖ రాసే యోచనలో విజయశాంతి ఉన్నారని తెలుస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం చాలా సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే నష్టపోతామని విజయశాంతి కాంగ్రెస్ నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం చావో రేవో అన్నట్లుగా ఉన్న ఈ పరిస్థితుల్లో కొందరు పార్టీ నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని, టీడీపీతో పొత్తు వల్ల ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో తీవ్ర నష్టం తప్పదని విజయశాంతి అన్నారని సమాచారం. ఇదంతా గమనిస్తున్న ప్రజలు మాత్రం ‘ఆలూ లేదు సూలూ లేదు’ అంటూ సామెతలు చెప్పుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.