ఆ పార్టీలతో పొత్తులు వద్దంటున్న లేడీ అమితాబ్

లేడీ అమితాబ్‌గా పేరొందిన విజయశాంతి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరంలేదు. సినీ హీరోయిన్ గా, రాజకీయ నేతగా విజయశాంతి అందరికీ సుపరిచితమే. 2000 సంవత్సరంలో ఆమె రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. బిజెపిలో ఉన్న విజయశాంతి  ఆ పార్టి నుంచి బయటకు వచ్చి తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. తెలంగాణ ఉద్యమం నేపధ్యంలో తల్లితెలంగాణ పార్టీని కేసీఆర్ ఆహ్వానం మేరకు టిఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. తరువాత టిఆర్‌ఎస్‌ నుంచి మెదక్ ఎంపీగా పనిచేశారు. తదనంతర కాలంలో కేసీఆర్ కు, విజయశాంతికి పొసగక ఆమె ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటి చేసి ఓటమిపాల్యారు. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న విజయశాంతి రాబోయే ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కాగా కాంగ్రెస్, టిడిపి పొత్తు పెట్టుకుంటాయని వస్తున్న వార్తలపై విజయశాంతి స్పందించారని సమాచారం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పొత్తు ప్రతిపాదనను విజయశాంతి వ్యతిరేకిస్తున్నారని బోగట్టా.
టిడిపితో పొత్తు పెట్టుకుంటే భారీ నష్టం తప్పదని ఆమె పార్టీని హెచ్చరించారని తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి లేఖ రాసే యోచనలో విజయశాంతి ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర విభజన అనంతరం చాలా సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని విజయశాంతి గతంలో ఆరోపణలు గుప్పించిన విషయం విదితమే. ప్రస్తుత పరిస్థితుల్లో టిడిపితో పొత్తు పెట్టుకుంటే నష్టపోతామని విజయశాంతి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. దీనికితోడు కొందరు పార్టీ నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విజయశాంతి వాపోయారని సమాచారం. టిడిపితో పొత్తు వల్ల కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో తీవ్ర నష్టం తప్పదని విజయశాంతి తన అభిప్రాయం వ్యక్తం చేశారని తెలుస్తోంది.  సమాచారం. హైదరాబాద్ లో కొన్నిసీట్లు గెలుస్తామన్న భావనలో ఉన్న కొందరు కాంగ్రెస్ నేతలు టిడిపితో పొత్తు కోసం ఆరాటపడుతున్నారని ఆమె భావిస్తున్నారట. కాగా ఇప్పటికే టిడిపితో కాంగ్రెస్ పొత్తులపై వార్తలు వస్తున్న నేపద్యంలో విజయశాంతి అభిప్రాయాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటుందో వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.