
ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు ఈ రోజు(మంగళవారం) ఉదయం కన్నుమూశారు. గుత్తా విజయ బాపినీడు చౌదరి ఈయన పూర్తి పేరు. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాక ఆయన పేరు విజయ బాపినీడుగా కీర్తించబడింది. ఎన్నో హిట్ చిత్రాలకు ఈయన దర్శకత్వం వహించి ఇండస్ట్రీలో గొప్ప పేరు గడించారు. చిరంజీవి హీరోగా వచ్చిన ‘మగ మహారాజు’తో దర్శకుడిగా మారిన బాపినీడు.. అనంతరం మహానగరంలో మాయగాడు, మగధీరుడు, ఖైదీ నంబర్ 786, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు రూపొందించారు. గుత్తా బాపినీడు పేరుతో రచనలు ఎన్నో రచనలు చేసిన ఈయన.. మద్రాస్ లో బొమ్మరిల్లు విజయ మాస పత్రిక ను ప్రారంభించి నడిపించారు. శ్యాం ప్రసాద్ ఆర్ట్స్ సంస్థను నెలకొల్పి…. దాసరి దర్శకత్వంలో లో యవ్వనం కాటేసింది సినిమా తీశారు. కృష్ణ తో కృష్ణ గారడీ, రాజేంద్ర ప్రసాద్ తో వాలు తోలు బెల్ట్, దొంగ కోళ్లు సినిమాలు చేశారు.
విజయ బాపినీడు మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. దేశంలో మొదటిసారి చిరంజీవికి కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చి మెగాస్టార్ పేరును దేశవ్యాప్తంగా మారుమోగించిన ఘనుడు విజయ బాపినీడు. 22 సెప్టెంబర్ 1936 వ సంవత్సరంలో ఏలూరు దగ్గర చాటపర్రులో జన్మించిన ఈయన సినీఇండస్ట్రీలో దర్శకనిర్మాతగా చెరగని ముద్ర వేసుకున్నారు. ఇలాంటి గొప్ప మనిషి మరణం సినీ ఇండస్ట్రీని తీవ్రంగా కలచివేసింది. పలువురు సినీ ప్రముఖులు ఈయన మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. ఈయన అంతక్రియలు గురువారం హైదరాబాద్ లోని మహా ప్రస్థానంలో నిర్వహించనున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన పెద్దమ్మాయి రావడానికి సమయం పడుతున్న కారణంగా అంత్యక్రియలు ఆలస్యంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
సంతాపం తెలియజేసిన డాక్టర్ మంచు మోహన్ బాబు
‘‘విజయబాపినీడు గారి మరణం నన్ను చాలా బాధించింది. ఆయనతో నా పరిచయం నేటిది కాదు. 1990 నుంచి విజయ బాపినీడు గారు నాకు బాగా తెలుసు. నాకు అత్యంత సన్నిహితమైన వ్యక్తుల్లో విజయ బాపినీడు గారు కూడా ఒకరు. ఆయన రామోజీరావు గారి మయూరి సంస్థలో పని చేస్తున్న రోజుల నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది. ఎంతో మృదు స్వభావి. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. విజయ బాపినీడు గారు మంచి దర్శకుడు మాత్రమే కాదు.. అంతకు మించి మంచి రచయిత.. ఎడిటర్.. అభిరుచి గల నిర్మాత. చాలా హార్డ్ వర్క్ డ్ాతా చేసే మనిషి. ఆయన లాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని మోహన్ బాబు పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం
‘‘పలు విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, విజయ అనే పత్రిక నడపడం ద్వారా విజయాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న బాపినీడు తెలుగు సినీ రంగ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ముద్ర వేశారు. ఆయన మృతి పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’’ అని కేసీఆర్ అన్నారు.
Be the first to comment