సాయిరెడ్డి వ్యూహం విజ‌యం తెచ్చిపెడుతుందా!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆయ‌నే కీల‌కం.. జ‌గ‌న్ కూడా తాను ఎంత చెబితే అంత‌. ఎవ‌రి మాట విన‌ని అధినేత సాయిరెడ్డిపై ఎందుకింత భ‌రోసా ఉంచారు. గ‌త ఎన్నిక‌ల్లో త‌న గ‌ర్వం దెబ్బ‌తీసింద‌నే ముందుచూపా! ఎవ‌రో ఒక‌ర్ని న‌మ్మ‌క‌పోతే.. నేత‌ల్లో వ్య‌తిరేక సంకేతాలు వెళ‌తాయ‌నే భ‌య‌మా! కార‌ణం ఏదైనా కావ‌చ్చు.. విజ‌య‌సాయిరెడ్డి పైనే భార‌మేసిన వైసీపీ అధినేత‌.. తాను మాత్రం హాయిగా ఉద‌యం.. సాయంత్రం వాకింగ్ చేస్తూ.. సారీ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో జ‌నం మ‌న‌సు గెలిచే ప్ర‌య‌త్నంలో వున్నారు. వాస్త‌వానికి విజ‌య‌సాయిరెడ్డి తెలివైన ఛార్ట‌ర్డ్ అకౌంటెంట్‌. పైగా వైఎస్ కుటుంబానికి కావాల్సిన వ్య‌క్తి కూడా. సూట్‌కేసు కంపెనీలు, మాయా సంస్థ‌ల మ‌ర్మాల‌న్నీ దాదాపు ఆయ‌న బుర్ర నుంచే వ‌చ్చాయంటూ సీబీఐ ఏనాడో తేల్చిచెప్పింది. అందుకే.. ఈడీ ఎటాచ్ చేసుకున్న ఆస్తులు ఒక్కొక‌టీగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయంటే కార‌ణం కూడా విజ‌య‌సాయి ప్లానే. అంత‌గా ఎత్తులు వేయ‌గ‌ల స‌మ‌ర్థుడు లెక్క‌ల్లోనే కాదు.. రాజ‌కీయాల‌నూ తారుమారు చేయ‌గ‌ల‌డ‌నే విశ్వాసం.. వైసీపీ బ‌లంగా నాటుకుపోయిన‌ట్టుంది. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిషోర్‌ను రంగంలోకి దింప‌టం కూడా రాజ‌కీయ‌మే. ఎందుకంటే.. అత‌డు బీజేపీ అనుకూల వ్య‌క్తి కావ‌టం ఒక అంశ‌మైతే.. 2019లో మోదీ మ‌న‌సు గెల‌వాల‌నే తుది నిర్ణ‌య‌మట. అందుకే క‌మ‌లం వెళ్లేదారిలోనే ఫ్యాన్ కూడా తిరుగుతుంద‌నే సంకేతాలు పంపేందుకు ఇది బాగానే ఉప‌క‌రించిందట‌. ఎంపీ రాజీనామా డ్రామా కూడా ఎట్ట‌కేల‌కు వ‌ర్క‌వుట్ అయింద‌నే చెప్పాలి. కేంద్రంలో వ‌చ్చే ఎన్నిక‌లు బీజేపీకు చాలా కీల‌కం. అందుకే.. మోదీ చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. దానిలో భాగంగానే తెలంగాణ‌లో కేసీఆర్‌, ఏపీలో జ‌గ‌న్ వంటి నేత‌ల‌ను త‌న గుప్పిట ఉంచుకున్నార‌నే ఆరోప‌ణలున్నాయి. తెలుగు రాష్ట్రాల ఓట‌ర్లు.. కేవ‌లం ఇక్క‌డే కాదు.. యావ‌త్ జాతీయ రాజ‌కీయాల్లోనూ కీల‌క‌మే. ముఖ్యంగా ద‌క్షిణాధి రాష్ట్ర ప్ర‌జ‌లు ప్ర‌భావితం అయ్యేది కూడా ఆంధ్ర ఓట‌ర్లు ఇచ్చిన తీర్పునుంచే అనేది జ‌గ‌మెర‌గిన స‌త్యం. క‌ర్ణాట‌క‌లో.. త‌మిళ‌నాట‌.. ఎటువంటి రాజ‌కీయ మార్పులు చోటుచేసుకున్న తెలుగు వారి ప్ర‌మేయం త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. వైసీపీ బ‌ల‌ప‌డితే.. ఇవ‌న్నీ త‌మ క‌నుస‌న్న‌ల్లోనే ఉంటాయ‌నేది బీజేపీ మ‌రో పాచిక‌. దీనికి సాధ‌నంగా.. విజ‌య‌సాయిరెడ్డిని ప్ర‌యోగించిన క‌మ‌లం. సైలెంట్‌గా ఆయ‌న్ను న‌డిపిస్తుంద‌నే వాద‌న లేక‌పోలేదు. గ‌తంలో వైసీపీ ఎమ్మెల్యేతో బీజేపీ ఎమ్మెల్యే చెట్ట‌ప‌ట్టాల్‌వేయ‌టం.. ఏపీ గుట్టు ఎప్పటిక‌ప్పుడు కేంద్రానికి చేర‌వేయ‌టం వంటివి ఇటీవ‌ల వెలుగుచూశాయి. అయితే.. ఇదంతా జ‌గ‌న్ ప్ర‌మేయం లేకుండా విజ‌య‌సాయి న‌డుపుతున్న రాజ‌కీయ‌మ‌ని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఒక‌వేళ 2019లో ఏమైనా తేడాలొచ్చినా.. తూచ్ మా అధినేత మంచోడే.. చేసిందంతా విజ‌య‌సాయి అని చెప్పేందుకు కూడా ఇదో మార్గ‌మంటూ ప్రత్య‌ర్థులు చుర‌క‌లు అంటిస్తున్నారు. ఏమైనా.. గ‌ట్టెక్కించినా.. నీటముంచినా.. అంతా ఆ విజ‌యసాయి పైనే భార‌మ‌న్న‌మాట‌. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.