నెంబర్-2 పాదయాత్ర ప్రారంభమైంది…

వైకాపా అధినేత జగన్మోహనరెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఇప్పుడీ యాత్ర సాగుతోంది. ఎన్టీఆర్ సొంతూరు నిమ్మకూరులోను ఆయన యాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వైకాపాలో నెంబర్-2గా ఉంటున్న ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. కాకపోతే ఆయన విశాఖలో పాదయాత్ర చేస్తుండటం విశేషం. విశాఖలోని అగనంపూడి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. మొత్తం 72 నియోజకవర్గాల్లో 10 రోజులపాటు విజయసాయిరెడ్డి పాదయాత్ర సాగనుంది. జగన్‌ ప్రజాసంకల్ప యాత్రకు సంఘీభావంగానే ఈ పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించింది వైకాపా. 
కర్నాటకలో డబ్బులు పంచేందుకు విజయసాయిరెడ్డి వెళ్లారని టీడీపీ ప్రచారం చేస్తోంది. మంత్రి దేవినేని ఉమ అదే ఆరోపణలు చేశారు. కానీ విజయసాయిరెడ్డి విశాఖ పాదయాత్రలో ఉన్నారు. కర్నాటక బీజేపీ నేత, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి అనుచరులకు మద్దతుగా విజయసాయిరెడ్డి వెళ్లారని టీడీపీ ఆరోపించింది. అంతే కాదు.. విజయసాయి దగ్గరుండి మరీ డబ్బులు పంచారని చెబుతోంది. ఆధారాలు ఉంటే బయట పెట్టవచ్చు. కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మంచిది కాదని రోజాలాంటి నేతలు హితవు పలికారు.  
వైకాపా ఎంపీలు దీక్షలు చేసే సమయంలో విజయసాయిరెడ్డి, విజయమ్మలు బీజేపీ అధ్యక్షులు అమిత్ షాను కలిశారనే ప్రచారం చేసింది టీడీపీ. అది నిజమా కాదా తెలియదు. బీజేపీతో వైకాపా కుమ్మక్కు అయిందని బాగానే చెబుతోంది. బీజేపీ పేరు చెబితేనే ఏపీ ప్రజలు భగ్గు మంటున్నారు. అలాంటి సమయంలో బీజేపీతో వైకాపా కలిసిపోయిందని చెబితే ఆ మేరకు తమకు లబ్ది చేకూరుతుందని టీడీపీ అంచనా వేస్తోంది. అందుకే ఆ మాట చెబుతుందనే వాదన లేకపోలేదు. ఒకవైపు జగన్ యాత్ర చేస్తుంటే.. ఇంకోవైపు విజయసాయి అదే పనిచేయడంతో నెంబర్ వన్, నెంబర్ టూలు ప్రజల వద్దకు వెళ్లారని అనుకుంటున్నారు వైకాపా నేతలు. వారికి పోటీగా మూడో వ్యక్తి యాత్ర చేసేందుకు సిద్దమవుతున్నా.. అది ఇంకా ఆచరణకు రాలేదు. బొత్స లాంటి నేతలు యాత్రకు సిద్దమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందుకు జగన్ అనుమతిస్తారో లేదో.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.