వైసీపీ ఎంపీకి షాకిచ్చిన ఉప రాష్ట్రపతి వెంకయ్య

తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేసిన కారణంతో అవిశ్వాసంపై జరిగిన చర్చ సమయంలో పార్లమెంట్‌లో కనిపించని వైసీపీ.. రాజ్యసభలో మాత్రం తన వాదనను వినిపించాలనుకుంది. అందుకోసం తమ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లిన ఎంపీలకు దిశానిర్ధేశం చేసి పంపించాడు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. అందుకు అనుగుణంగానే గత మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరాటం ప్రదర్శించాడు. ఈ చర్చలో టీడీపీ ఎంపీలు మాట్లాడిన తర్వాత విజయసాయిరెడ్డి ప్రసంగించారు. సమయం మించిపోవడంతో చైర్మన్‌గా ఉన్న వెంకయ్య మరో సభ్యుడిని మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. పార్టీల సభ్యులకు కేటాయించిన సమయంపై రాజ్యసభలో తెలుగుపార్టీలు వాగ్వాదానికి దిగాయి. టీడీపీ సభ్యులకు ఎక్కువ సమయం ఇచ్చారని టీఆర్‌ఎస్‌, వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ పార్టీలకున్న సభ్యుల సంఖ్యను బట్టే సమయం ఉంటుందని చెప్పారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి.. వెంకయ్య పక్షపాతి అంటూ సభను వాకౌట్ చేశారు. దీనిపై సభాపతి వెంకయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ పరిణామం తర్వాత మాట్లాడిన వెంకయ్య గతంలో ఎవరేం చెప్పారో… ఇప్పుడు ఎవరేం మాట్లాడుతున్నారో.. అన్నీ తనకు తెలుసునని అన్నారు. అయితే చైర్మన్‌ పదవిలో ఉన్నాను కాబట్టి అవేమీ మాట్లాడలేనని పేర్కొన్నారు. తర్వాత రోజు జరిగిన సభలో విజయసాయి చేసిన పనికి అధికార, ప్రతిపక్షాలు సభాపతికి క్షమాపణలు చెప్పాలని కోరాయి. విజయసాయిరెడ్డి లేచి వివరణ ఇస్తుండగా.. వెంకయ్య జోక్యం చేసుకున్నారు. ‘వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. వివరణ ఇస్తూ.. సమర్థించుకుంటే అర్థం లేదు. ఏ క్షమాపణలపైనా నాకు ఆసక్తి లేదు. సభ్యుడి విజ్ఞతకే వదిలేస్తున్నా..’ అని వ్యాఖ్యానించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన విజయసాయి క్షమాపణ ఒకరు బలవంతం చేస్తే చెప్పేది కాదని, తానంతట తాను చెప్పాలని అన్నారు. అయితే, తర్వాత మనసు మార్చుకున్న ఆయన ఈ పరిణామాలన్నింటి తర్వాత ఉప రాష్ట్రపతిని కలిసి క్షమాపణ చెప్పాలనుకున్నారట. ఈమేరకు విజయసాయి, వెంకయ్య అపాయింట్‌మెంట్ కూడా కోరారని, దీనికి ఆయన అనుమతి ఇవ్వలేదని సమాచారం. మొదట క్షమాపణ వద్దన్న వెంకయ్య, తర్వాత కలిసేందుకు కూడా ఇష్టపడకపోవడంతో విజయసాయి షాక్ అయ్యాడని తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.