వర్ల రామయ్య నుంచి అహంకారపు మాటలు 

మొన్న బెజవాడలో బొండా ఉమా బ్యాచ్ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న చింతమనేని ఆర్టీసీ బస్సులో వారిని దించి మరీ దాడి చేశారు. ఇప్పుడు ఏపీ ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య వంతు వచ్చింది. బస్సును ఆపి మరీ ఓ యువకుడి కులం సంగతి ఆరా తీసి.. ఆ కులంలో వారు చదువుకోరంటూ తిట్టిన తీరు వివాదం రేపింది. ఏదో చాలా సాదాసీదా మాట్లాడినట్లే ఉన్నా.. వర్ల రామయ్యలో అధికారం, హోదా వచ్చిందనే అహంకారం కనపడింది. ఫలితంగా రామయ్య తీరు విమర్శలకు తావిచ్చింది. మరోవైపు సిఎం చంద్రబాబుకు ఇబ్బంది తెచ్చి పెట్టింది. విపక్షాలకు ఆయుధం ఇవ్వొద్దని చెబుతున్నా.. టీడీపీ నేతలు నోరు జారి పార్టీ పరువును బజారున పడేస్తున్న వైనం చర్చనీయాంశమైంది. 
ఓ దళిత విద్యార్థిపై అభ్యంతర వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న వర్ల రామయ్యకు టీడీపీ సీనియర్లు పోన్ చేసి మరీ చివాట్లు పెట్టారు. పద్దతి మార్చుకోండి. లేకపోతే అందరం ఇబ్బంది పడతామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. మచిలీపట్నం బస్టాండ్‌లో ఛైర్మన్ వర్ల రామయ్య ఆకస్మిక తనిఖీలు చేశారు. ఐతే, బస్సులో కూర్చొని చెవిలో ఇయర్ ఫోన్స్‌ పెట్టుకున్నారు ఓ విద్యార్థి. అది గమనించిన వర్ల రామయ్య అతని వద్దకు వెళ్లారు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోవా? అని గట్టిగా గదిమారు. 
ఆ తర్వాత విద్యార్థి ప్రశ్నల వర్షం కురిపించారు. బస్సులో విద్యార్థి, కింద ఆర్టీసీ ఛైర్మన్.. మధ్యలో గోల. ఏం జరుగుతుందో తెలియదు. కానీ చాలా సూటిగా వర్ల రామయ్య అడిగిన ప్రశ్నలు కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇప్పుడు అదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం పొందుతోంది. సహజంగానే ఇలాంటి అంశాలు వైసీపీకి వరంగా మారాయి. అంతే వర్ల రామయ్యకు అసలు బుద్ది ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నాయి. ఫలితంగా తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితికి వచ్చాడు వర్ల రామయ్య. 
ఏ కులం నీది… మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? పొలం ఉందా? బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? డబ్బుల్లేకపోతే ఎలా చదువుకుంటావ్.. ఫోన్లను పక్కనపెట్టి చదువుకో అంటూ ఆ విద్యార్థిని గట్టిగానే నిలదీశారు. అంతా బాగానే ఉన్నా… ఆ విద్యార్థిని వర్ల రామయ్య కులం పేరు వివాదం రేపింది. ఓ దళిత నాయకుడు అయి ఉండి మరో దళిత విద్యార్థిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని పలువురు విమర్శిస్తున్నారు. ఆర్టీసి చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తెల్లారే ఈ పని చేయడంతో విస్తుబోవడం నేతల వంతు అయింది. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఎలాంటి మాటలు వినాల్సి వస్తుందోనంటున్నారు. 
కష్టపడి చదువుకోవాలని, సెలవుల్లో కూలీపనులకు వెళ్లాలని సుద్దులు చెప్పడం వరకు పర్వాలేదు. మాలనా, మాదిగనా అడిగి మరీ మాదిగలు అయితే చదువుకోరనే రీతిలో చెప్పిన తీరు మరింత వివాదస్పదమైంది. ఇతను నాయనకు ఏ మాత్రం ఉపయోగపడడంటూ వ్యాఖ్యానించాడు.  ఆ తర్వాత వర్ల రామయ్య విజయవాడ బయలుదేరి వెళ్లేసరికి టీడీపీ సీనియర్ల నుంచి ఫోన్లు వచ్చాయి. ఇదేంటి రామయ్య ఇలా చేశావని ప్రశ్నించారు. యధాలాపంగా అడిగానని.. కాకపోతే ఇంత రచ్చ చేస్తుందని ఊహించలేకపోయానంటున్నారు వర్ల రామయ్య. మీడియాను చూసుకోకుండా మాట్లాడితే ఇలానే ఉంటుందని సీనియర్లు చెప్పడంతో అమ్మా.. ఇక మీదట జాగ్రత్త పడతానంటున్నారట వర్ల రామయ్య. ఏదైనా ఇప్పటికైనా జ్ఞానోదయం అయింది చాలు. ఇక మీదట జాగ్రత్తగా ఉండాలని చెప్పారట నేతలు. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.