అమెరికాలో మ‌త విద్వేషం…హిందూ ఆల‌యంపై దాడి

అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌రో క‌ల‌కలం చోటుచేసుకుంది. మరోసారి జాతి విద్వేషం పెచ్చరిల్లింది. కెంటకీ రాష్ట్రంలో ఓ గుడిని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అక్కడున్న దేవుడి విగ్రహానికి నల్ల రంగు పూశారు. కిటికీలను విరగ్గొట్టారు. అక్కడున్న కుర్చీకి ఓ కత్తిని గుచ్చి వెళ్లిపోయారు. లూయిస్‌విలెలో ఉన్న స్వామినారాయణ్ ఆలయంపై ఆదివారం రాత్రి, మంగళవారం ఉదయం మధ్య ఈ దాడి జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటన అక్కడి భారతీయ సమాజాన్ని షాక్‌కు గురి చేసింది.అమెరికా అధికారులు దీనిపై విచారణ మొదలుపెట్టారు.

లూయిస్‌విలె మేయర్ గ్రెట్ ఫిషర్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ విద్వేషం లేదా మత దురభిమానాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇది పిరికిపందల చర్య అని ఫిషర్ అన్నారు. ఆదివారం సాయంత్రం గుడిని మూసేసిన తర్వాత ఈ దాడి జరిగిందని, మంగళవారం ఉదయం ఈ విషయం తెలిసిందని ఆయన చెప్పారు. అందరినీ సమానంగా చూడాలన్న అమెరికా ఆదర్శాలకు ఈ చర్య పూర్తి విరుద్ధమని ఫిషర్ స్పష్టం చేశారు. ఏ మతమైనా సరే.. ఇలాంటి చర్యలు సరి కాదు అని స్వామి నారాయణ్ గుడికి చెందిన రాజ్ పటేల్ అభిప్రాయపడ్డారు. ఇలాంటివి జరిగినప్పుడు ప్రజలంతా మరింత ఐక్యతతో ముందుకు సాగుతారన్నారు. ఏ మతం వారైనా ఇలా చేయడం తగదని, తాము శాంతి కోసం నిలబడతామని చెప్పారు.

ఇదిలాఉండ‌గా, అమెరికాలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. 2015 ఏప్రిల్‌లో ఉత్తర టెక్సాస్‌లోని ఓ ఆలయాన్ని కూడా ధ్వంసం చేశారు. అదే ఏడాది ఫిబ్రవరిలోనూ కెంట్, సీటెల్ మెట్రోపాలిటన్‌లో ఉన్న ఆలయాలపైనా దాడి జరిగింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.