‘యూ టర్న్’ మూవీ రివ్యూ

నటీనటులు: స‌మంత‌, ఆది పినిశెట్టి, భూమిక‌, రాహుల్ రవీంద్రన్‌, న‌రేన్‌
సంగీతం : పూర్ణచంద్ర తేజ‌స్వీ
సినిమాటోగ్రఫీ: నికెత్ బొమ్మిరెడ్డి
ఎడిటింగ్: సురేష్
నిర్మాత : శ్రీనివాసా చిట్టూరి, రాంబాబు బండారు
దర్శకత్వం : ప‌వ‌న్ కుమార్‌

ఒకప్పుడు కమర్షియల్ సినిమాలకే జై కొట్టిన సమంత పెళ్లి తర్వాత రూటు మార్చారు. ఎక్కువ‌గా న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వ‌స్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది రంగ‌స్థలం, అభిమ‌న్యుడు, మహానటి లాంటి సూప‌ర్ హిట్స్‌ అందుకున్న సామ్ మ‌రో సూప‌ర్ హిట్ మీద కన్నేశారు. అందుకే క‌న్నడ‌లో ఘ‌న‌విజ‌యం సాధించిన యు ట‌ర్న్ సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. వినాయక చవితి కానుకగా ఈరోజు విడుదలైన ఈ సినిమా సమంత కెరీర్‌కు ప్లస్ అయిందా..? సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ‘యూ టర్న్’ ప్రేక్షకులను ఆకట్టుకుందా..?

క‌థ :
రచన(స‌మంత) ఓ మీడియా సంస్థలో ఇంటర్న్‌షిప్ చేస్తుంటుంది.అదే సంస్థలో ఉద్యోగం కోసం ఓ హ్యూమన్‌ ఇంట్రస్ట్‌ స్టోరి చేసేందుకు ప్లాన్ చేస్తుంది. అందులో భాగంలో ఆర్కేపురం ఫ్లైఓవ‌ర్‌పై రోడ్ బ్లాక్స్ ను త‌ప్పించి యు ట‌ర్న్ తీసుకునే వారిని మీద స్టోరి చేయాలన్న ఆలోచనతో, యుటర్న్‌ తీసుకున్న వ్యక్తుల వెహికిల్‌ నంబర్స్‌ ద్వారా వారి అడ్రస్‌లు, ఫోన్‌ నంబర్లు తెలుసుకుంటుంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా సుందర్‌ అనే వ్యక్తిని కలిసేందుకు ప్రయత్నించినా వీలుపడదు. కానీ అదే రోజు సుందర్ ఆత్మహత్య చేసుకొని చనిపోవటంతో రచనను ఇన్వెస్టిగేషన్‌ కోసం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళతారు. విచార‌ణ‌లో భాగంగా రచన డైరీని ప‌రిశీలించిన పోలీసుల‌కు షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఆ డైరీలో ఉన్న వ్యక్తులందరూ సుందర్‌ లాగే గతంలో ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. అసలు ఆ డైరీలో ఉన్న వ్యక్తులు ఎవరు..? ఎలా చనిపోయారు.? వారి మరణానికి రచనకు సంబంధం ఏంటి.? ఈ సమస్యల నుంచి రచన ఎలా బయటపడింది..? అన్నదే మిగతా క‌థ‌.

సినిమా ఎలా ఉందంటే
పవన్ కుమార్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సాగుతుంది. సినిమాలో అక్కడక్కడ వచ్చే ఊహించని సన్నివేశాలు, మిస్టరీకి సంబంధించిన సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగున్నాయి. కానీ కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం. సెకెండాఫ్ లో కథనం చాలా చోట్ల స్లోగా సాగడం వంటి డ్రా బ్యాగ్స్ కారణంగా సినిమా స్థాయి తగ్గుతుంది. మొత్తం మీద భిన్నమైన, కొత్త తరహా చిత్రాలను ఇష్టపడేవారికి, మరియు సమంత మీద అభిమానంతో ఈ సినిమాకి వెళ్లేవారికీ ఈ సినిమా బాగా నచ్చుతుంది. కానీ మిగిలిన వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

నటీనటుల పనితీరు
ఇన్నాళ్లు క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న స‌మంత ప్రస్తుతం న‌టిగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. అందుకే న‌ట‌నకు ఆస్కారం ఉన్న పాత్రల‌ను మాత్రమే ఎంచుకుంటున్నారు. యు ట‌ర్న్ సినిమాను ఏరికోరి సెలెక్ట్ చేసుకున్నారు. తన పర్ఫామెన్స్‌ తో సినిమా స్థాయిని పెంచారు సమంత. ప్రేమ, భ‌యం, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోష‌న్స్‌ను అద్భుతంగా పండించారు. డబ్బింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. రచనకు సాయంచేసే పోలీస్ పాత్రలో ఆది పినిశెట్టి సరిగ్గా సరిపోయాడు. పెద్దగా వేరియేష‌న్స్ చూపించే అవ‌కాశం లేక‌పోయినా.. ఉన్నంత‌లో త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. భూమిక తెర మీద క‌నిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతో మంచి ఎమోష‌న్స్ పండించారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో భూమిక న‌ట‌న కంట‌త‌డిపెట్టిస్తుంది. స‌మంత ఫ్రెండ్ పాత్రలో క్రైమ్ రిపోర్టర్ గా రాహుల్ ర‌వీంద్రన్‌ త‌న పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇత‌ర పాత్రలో న‌రేన్, ర‌వి ప్రకాష్‌లు త‌మ ప‌రిధి మేర‌కు ఆక‌ట్టుకున్నారు.

టెక్నీషియన్ల పనితీరు
ఈ చిత్ర దర్శకుడు పవన్ కుమార్ ఒక మంచి కథాంశాన్ని ఎంచుకున్నాడు. అయితే ఆయన రాసుకున్న రెండో భాగంలోని కథనం ఫ్లాట్ గా ఉంది. పవన్ స్క్రిప్ట్ మీద ఇంకా శ్రద్ధ పెట్టి ఉంటే ఈ చిత్రం ఇంకా బాగా వచ్చి ఉండేది. నికెత్ బొమ్మి రెడ్డి కెమెరా పనితనం మాత్రం ఇంప్రెస్ అయ్యేలా ఉంది. ఆయన తీసిన విజువల్స్ చాలా బాగున్నాయి. పూర్ణ చంద్ర అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా మిస్టరీకి సంబంధించిన సన్నివేశాల్లో ఆయన ఇచ్చిన నేపధ్య సంగీతం చాలా బాగుంది. ఎడిటర్ సురేష్ పనితరం కూడా పర్వాలేదనిపిస్తోంది. నిర్మాతలు శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

బలాలు
* నటీనటులు
* కథ, మెసేజ్
* సస్పెన్స్
* బ్యాగ్రౌండ్ స్కోర్

బలహీనతలు
* నమ్మశక్యం కానీ కొన్ని సీన్స్
* సెకెండాఫ్ ల్యాగ్ అవడం

మొత్తంగా: ‘యూ టర్న్’ సమంత కెరీర్‌కు మరో టర్న్

రేటింగ్: 3/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.