అక్కడ టీడీపీకి అభ్యర్ధులే దొరకడంలేదట..!

ఒక రాష్ట్రంలో అధికారం.. మరో రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైనం.. ఇది తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరచింది. 1983 నుంచి 1999 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు సార్లు అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ.. విభజన అనంతరం ఏపీలో అధికారం చేపట్టగా, తెలంగాణలో మాత్రం నిరాశపరిచింది. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన టీడీపీ.. ఇప్పుడు తెలంగాణలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఇతర పార్టీలు బలంగా ఉండడంతో పాటు, టీడీపీలో బలమైన నాయకులు లేకపోవడంతో టీడీపీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది. రాష్ట్ర విభజన తర్వాత అంటే 2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌తో వచ్చిన టీఆర్ఎస్ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ సృష్టించిన ప్రభజనానికి టీడీపీ, కాంగ్రెస్ తక్కువ సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి కొంత బాగున్నా.. టీడీపీ మాత్రం కేవలం 15 సీట్లు మాత్రమే సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. అప్పుడు గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలలో 12 మంది టీఆర్ఎస్ పార్టీలోకి చేరగా, ఒకరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఇప్పుడు టీడీపీకి మిగిలింది ఇద్దరు మాత్రమే. వారిలో ఒకరు సండ్ర వెంకట వీరయ్య కాగా, మరొకరు ఆర్ కృష్ణయ్య. తాజాగా తెలంగాణలో టీడీపీ అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఏపీలో ఒక్కో స్థానం కోసం ఇద్దరు, ముగ్గురేసి నాయకులు పోటీ పడుతుండగా, తెలంగాణలో మాత్రం పోటీ చేయడానికి అభ్యర్ధులే కరువయ్యారని తెలుస్తోంది. ప్రతి జిల్లాలోని పెద్ద పెద్ద నాయకులందరూ వేరే పార్టీల్లోకి జంప్ అవడంతో.. ఇప్పుడు ఆ పార్టీ ద్వితియ శ్రేణి నాయకులపైనే ఆధారపడాల్సిన పరిస్థితికి దిగజారిపోయింది. చాలా చోట్ల పోటీ చేయడానికే కొందరు నేతలు భయపడిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధులను ఎంపిక చేయడం టీడీపీ అధిష్టానానికి కత్తి మీద సాములా తయారయిందట. మరి ఇలాంటి పరిస్థితి నుంచి టీడీపీ కోలుకుంటుందో లేదో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.