పొత్తును వ్యతిరేకిస్తున్న టీటీడీపీ నేతలు.. కారణమిదే

తెలంగాణలో అంతంత మాత్రంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ముందస్తు ఎన్నికల రూపంలో పెద్ద కష్టం వచ్చి పడింది. గత ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీకి భారీ నష్టం జరిగింది. టీఆర్ఎస్ అధికారం చేపట్టిన వెంటనే టీడీపీనే టార్గెట్ చేసింది. ఫలితంగా ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు కారెక్కేశారు. దీంతో రాష్ట్రంలో ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకుంది సైకిల్ పార్టీ. అందుకోసమే ఈ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2014లో వచ్చినన్ని సీట్లను గెలుచుకుంటే ఈ సారి చక్రం తిప్పొచ్చని భావిస్తోంది. రాష్ట్రంలోని చాలా స్థానాల్లో ఆ పార్టీకి నాయకుడే లేడు కానీ కార్యకర్తలు మాత్రం ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఈ కారణంగానే ఆ పార్టీ అధిష్టానం ధీమాగా ఉంది. టీఆర్ఎస్‌ మరోసారి గెలవకూడదని పట్టుబట్టిన టీడీపీ.. కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమవుతోంది. దీని కోసం కొద్దిరోజులుగా ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు పొత్తుల విషయంలో టీటీడీపీ నేతలదే తుది నిర్ణయమని తేల్చి చెప్పడంతో ఇక్కడి నేతలు కాంగ్రెస్‌తో కలిసేందుకు మంతనాలు జరుపుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసొచ్చే ఏ పార్టీనైనా కలుపుకుని పోవాలని వారు భావిస్తున్నారు.

ఇలాంటి తరుణంలో టీటీడీపీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంపై ఆ పార్టీ శ్రేణుల్లో మిశ్రమ స్పందన వెలువడుతోంది. కొందరు పొత్తు పెట్టుకోవడాన్ని స్వాగతిస్తుంటే.. మరికొందరు నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పొత్తుపై ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలను తెలుగు దేశం పార్టీ తమ్ముళ్ళు ఆసక్తిగా గమనిస్తున్నారు. పొత్తు నిర్ణయం ఎలా ఉండబోతుందోనని ఆతృతపడుతున్నారు. పొత్తు ఫలితంగా రాష్ట్రంలో టీడీపీకి ఎన్ని స్థానాలు దక్కుతాయని లెక్కలు వేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీతో కుదుర్చుకున్న పొత్తు వల్ల అన్ని స్థానాల నుంచి పోటీ చేయలేకపోయిన విషయాన్ని వార్తు గుర్తు చేస్తున్నారు. మళ్ళీ అదే పరిస్థితి పునరావృతమా అంటూ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పదు అంటున్నారు. స్వంతంత్రంగా పోటీ చేస్తేనే మేలన్న అభిప్రాయాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో తమ స్పందనలను పట్టించుకునేవారు లేరన్న విమర్శ స్థూలంగా మెజారిటీ కార్యకర్తల్లో వ్యక్తమౌతోంది. కాంగ్రెస్‌తో పొత్తుకు వెళ్లే ముందు అగ్ర నాయకులు నియోజకవర్గ స్థాయిలో కనీసం జిల్లా స్థాయిలోనైనా అభిప్రాయసేకరణ చేయకపోవడాన్ని తప్పుపడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.