అవిశ్వాసంపై టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్

కేంద్రంపై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఏపీలోనే కాక, దేశ వ్యాప్తంగా వేడి పుట్టించింది. విభజన చట్టంలోని హామీలు అమలు చేయలేదన్న కారణంగా ఎన్డీయే నుంచి బయటికి వచ్చేసిన టీడీపీ.. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తోంది. ఇందులో భాగంగానే బడ్జెట్ సమావేశాల సమయంలో ఒకసారి, ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో ఒకసారి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. బడ్జెట్ సమావేశాల్లో అసలు చర్చకే రాని అవిశ్వాసం.. ప్రస్తుత సమావేశాల్లో స్పీకర్ ఆమోదించడం.. ఓటింగ్ జరగడం.. ఫలితం లేలడం చక చకా జరిగిపోయాయి. గత విషయాన్ని పక్కన పెడితే, తాజా అవిశ్వాసానికి చాలా పార్టీలు మద్దతు పలికగా, మరో తెలుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మాత్రం తటస్థంగా ఉండిపోయింది.

దీంతో ఆ పార్టీ వైఖరిపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని, అందుకే తాము తటస్థంగా ఉంటామని ఆ పార్టీ ఎంపీలు సెలవిచ్చారు. గతంలో ఏపీ హక్కుల కోసం టీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలుపుతుందని ప్రకటించిన ఆ పార్టీ ఎంపీలు.. అవిశ్వాసంపై ఓటింగ్ జరుగుతున్నప్పుడు మాత్రం బయటకు వెళ్లిపోయారు. అంతేకాదు, టీడీపీ ఎంపీలు ప్రసంగిస్తున్న సమయంలో పదే పదే అడ్డుకోవడంతో పాటు, ఒకనొక సమయంలో ఏపీకి హోదా ఇస్తే తెలంగాణకు కూడా ఇవ్వాలనే సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. టీఆర్ఎస్ ఎంపీల తీరుపై సభలోని వేరే పార్టీలు కూడా తమ అక్కసును వెళ్లగక్కాయి. అయితే, తాజాగా దీని గురించి ఓ వార్త బయటికొచ్చింది.

అవిశ్వాసం విషయంలో టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ వేసిందనేదే ఆ వార్త సారాంశం. అదేమిటంటే.. లోక్‌స‌భ‌లో ఓటింగ్ ఉంటుంది కాబ‌ట్టి దానిలో పాల్గొన‌కుండా టీఆర్ఎస్ ఎంపీలు బ‌య‌ట‌కి వెళ్లిపోవాలని, కేవలం చ‌ర్చ మాత్ర‌మే జరిగే రాజ్య‌స‌భ‌లో ఆ పార్టీ ఎంపీతో ఏపీ హోదాకు అనుకూలంగా మాట్లాడించాలని టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ రూపొందించిందట. దీనికి అనుగుణంగానే ఆ పార్టీ ఎంపీలు వ్యవహరించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా కేసీఆర్.. మోదీతో సఖ్యత ఉంటున్న నేపథ్యంలోనే అటు బీజేపీకి ద్రోహం చేయకుండా, ఇటు పక్క రాష్ట్రానికి అన్యాయం చేయకుండా వ్యవహరించాలనుకున్న టీఆర్ఎస్ ప్లాన్ బయటికి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్త హాట్ టాపిక్ అయింది. మరి దీనికి ఆ పార్టీ నేతలు ఏం సమాధానం చెబుతారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.