కరీంనగర్‌లో టీఆర్ఎస్ సక్సెస్ ప్లానిదే!

ఆ ప్రాంతం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అది టీఆర్ఎస్‌కు పెట్టని కోటగా మారింది. అదే కరీంనగర్ ఉమ్మడి జిల్లా. అందుకే ఇప్పడు ఇక్కడ మరింత బలపడేందుకు టీఆర్ఎస్ పథక రచన చేస్తోంది. ఈ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా అధికార టీఆర్‌ఎస్ ముమ్మర ప్రయత్నాలు సాగిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్‌కు మంచిపట్టున్న ఆరు నియోజకవర్గాలపై దృష్టిసారించింది. ఆయా నియోజకవర్గాలనుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులకు… కాంగ్రెస్ ప్రకటించబోయే అభ్యర్థులను ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఆ పార్టీ తరపున శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. దీనిపై స్వయంగా ఆపార్టీ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆరే అభ్యర్థులకు స్వయంగా సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు భోగట్టా. జిల్లాలో జగిత్యాల, కరీంనగర్, హుస్నాబాద్, మంథని, పెద్దపల్లి, మానకొండూర్ నియోజకవర్గాలు కీలకంగా మారాయి. ఈ నియోజకవర్గాల నుంచి తాటిపర్తి జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, ఆరెపల్లి మోహన్‌, చింతకుంట విజయరమణారావు, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డిలు పోటీ చేయనున్నరనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నియోజకవర్గాల నుంచి ఒక్కొక్కరి పేరు మాత్రమే కాంగ్రెస్ అధిష్టానం పరిశీలనకు వెళ్లాయని సమాచారం. దీంతో వీరి అభ్యర్థిత్వాలపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కావనే నమ్మకంతో స్థానిక నేతలు ఉన్నారట. దీనికితోడు ఢిల్లీ పెద్దలు కూడా వీరికే ఓకే చెబుతారనే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఈ ఉమ్మడిజిల్లా రాజకీయ రణరంగంలో మహాకూటమి అభ్యర్థులవైపే ప్రజలు మొగ్గు చూపిస్తున్నారనేవార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఉద్యమ ఖిల్లాలో తమ ప్రాభవం తగ్గిపోతుందని టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారట. అందుకే మొదట్లోనే వీరికి అడ్డుకట్ట వేసేందుకు టీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఈ నేపధ్యంలోనే స్థానిక టీఆర్ఎస్ లోని అసమ్మతుల చల్లబరిచేందుకు మంత్రి కేటీఆర్ చొరవ తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికితోడు వివిధ పార్టీల్లోని అసమ్మతి నేతలపై మంత్రులు ఈటెల, హరీష్‌లు తమ దృష్టి సారిస్తున్నారని తెలుస్తోంది. ఈనేపధ్యంలోనే కూటమిలో భాగస్వామ్య పక్షాలైన సీపీఐ, కాంగ్రెస్, టీజెఎస్‌లకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారట. దీంతో వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి చేరికలు అధికమయ్యాయని భోగట్టా. మరి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలితమిస్తాయో వేచి చూడాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.