టీఆర్ ఎస్ నిర‌స‌న వాదులు

బంగారు తెలంగాణ కోసమంటూ వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన నేతలు ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆవేదన వారిలో ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు తమను కలుపుకుపోవడం లేదనే నిర్వేదం కూడా వారిలో ఉంది.. టీఆర్‌ఎస్‌లో ఇమడలేక.. పార్టీని వీడలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.. గత ఎన్నికల్లో అధికారంలో వ‌చ్చిన టీఆర్ ఎస్ ప్ర‌తిప‌క్షాలు లేకుండాచేసుకునేందుకు వేగంగాపావులు క‌దిలపింది.  నిజామాబాద్‌ జిల్లాను క్లీన్‌ స్వీప్‌ చేసిన పార్టీ! అధికార పగ్గాలను కూడా చేపట్టింది.. జిల్లాల పునర్విభజనను చేసింది.. ఫలితంగా కొత్తగా కామారెడ్డి జిల్లా ఏర్పడింది.. ఈ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో గులాబీ జెండానే ఎగురుతోంది. అయినప్పటికీ ఇతర పార్టీల నుంచి నేతలను ఆహ్వానించింది టీఆర్‌ఎస్ అధిష్టానం.. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరతీసిన టీఆర్‌ఎస్‌ ఇతర పార్టీల నుంచి ఎంత మంది నేతలు వస్తే.. అంతమందినీ తన గూటికి చేర్చుకుంది. తమ పార్టీలో చేరితో పదవులు…పనులు కట్టెబడతామని మాట ఇచ్చింది.. దాంతో కాంగ్రెస్‌.. టీడీపీలకు చెందిన నేతలు టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు.. బంగారు తెలంగాణను సాధించడం కోసమే తాము టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో పాలుపంచుకుంటామని అప్పుడు  చెప్పారు.

రానురాను క్షేత్రస్థాయిలో పరిస్థితులు వారికి అర్థమవ్వసాగాయి.. ఆల్‌రెడీ పార్టీలో ఉన్నవారితో కలిసి పనిచేయడంలోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి.. పాతకాపులు…కొత్త కాపుల మధ్య అహం అడ్డుగోడలా మారుతోంది.. తమకు సరైన ప్రాధాన్యత లభించడం లేదన్నది బీటీ బ్యాచ్‌ కంప్లయింటు! ఎందుకొచ్చిన బాధంటూ కొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరికొందరు తమ బాధలను కేటీఆర్‌…హరీశ్‌రావుల దగ్గర మొరపెట్టుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గంలో పలువురు ద్వితీయశ్రేణి నాయకుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. గత ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ తరఫున పోటీ చేసిన బద్యానాయక్‌తో పాటు గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ శ్రీనివాసయాదవ్‌ తదితరులు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి పోచారం సమక్షంలో వీరు గులాబీ కండువా వేసుకున్నారు. అప్పట్లో వీరికి పార్టీలో కొంత ప్రాధాన్యం లభించినా.. క్రమేపీ తగ్గడం మొదలయ్యింది. ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నవారు ఆధిపత్యం కోసం ఆరాటపడటమే బీటీ బ్యాచ్‌ ఆవేదనకు కారణమవుతోంది.. తమ సమస్యను పలుమార్లు మంత్రి పోచారం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు.

కామారెడ్డి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్‌ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. చేరికకు ముందు కేసీఆరే స్వయంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని మాట ఇచ్చారట! పార్టీలో చేరి నాలుగేళ్లు గడుస్తున్నా ఎమ్మెల్సీ కాదు కదా… ఎలాంటి పదవిని జనార్దన్‌కు ఇవ్వలేదు. తమ నేతకు మంచి పదవి వస్తుందని గంపెడాశలు పెట్టుకున్న జనార్దన్‌ అనుచరగణం ఇప్పుడు డీలా పడింది.. స్థానిక ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డితో ఏర్పడిన విభేదాల కారణంగా జనార్దన్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎంపీ బీబీ పాటిల్‌ కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్న జనార్దన్‌కు నియోజకవర్గంలో మంచి క్యాడరే ఉంది. వచ్చే ఎన్నికల్లో  జనార్దన్‌ మద్దతు లేకుండా రవీందర్‌రెడ్డి గెలవడం కష్టమే! సిట్టింగ్‌లందరికీ సీట్లు ఇస్తానని కేసీఆర్‌ చెప్పడంతో జనార్దన్‌ నిరుత్సాహానికి గురయ్యారు. తమ బాస్‌లను నమ్ముకుని గులాబీ పార్టీలోకి వచ్చిన చాలామంది కార్యకర్తల పరిస్థితి అయోమయంగా మారింది.. కొందరేమో బయటకు చెప్పుకుని బాధపడుతున్నారు.. కొందరేమో మనసులోనే కుమిలిపోతున్నారు.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.