టీఆర్ఎస్ సభతో కాంగ్రెస్‌లో జోష్

వారం రోజులుగా హైదరాబాద్‌తో పాటు ఎటుచూసినా గులాబీ జెండాల రెపరెపలు… ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన భారీ కటౌట్లు, హోర్డింగులు… 2200 ఎకరాల స్థలం… 3000 మంది వాలంటీర్లు… 20000 మంది పోలీసులు… 75000 వాహనాలు… వేదికను కనులారా వీక్షించటానికి 50 ఎల్‌ఈడీ స్ర్కీన్లు… ఇదీ అంకెల పరంగా టీఆర్‌ఎస్‌ ఆదివారం నిర్వహించిన ‘‘ప్రగతి నివేదన సభ’’ సమాహారం. ‘‘జాతీయ స్థాయిలో సభ నిర్వహిస్తున్నాం. దాదాపు పాతిక నుంచి ముప్పై లక్షల మంది సభకు హాజరవుతారు’’ ఇదీ ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన మాట. మరి ఏమైంది..? మొదట జనసమీకరణ చేయడంలో ఆ పార్టీ నేతలు విఫలమైతే.. సభా స్థలిపై పేలవ ప్రసంగంతో కేసీఆర్ విసుగెత్తించారు. దీంతో ప్రగతి నివేదన సభ కాస్తా ఉసూరుమనిపించింది.

వచ్చే ఎన్నికల్లో టికెట్లు కావాలనుకున్న వారు నియోజకవర్గం నుంచి 20000 వేల మందిని తరలించాలని కేసీఆర్ టార్గెట్ పెట్టారంటూ వార్తలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తమకే టికెట్‌ దక్కాలనే ఆశ, అధినేత కేసీఆర్‌ దృష్టిలో పడాలనే తాపత్రయంతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ఆశావహులు పోటీ పడి మరీ జనాన్ని తరలించారు. వాహనాలు, భోజనాల ఏర్పాటుకు పార్టీ అధిష్ఠానం కొంత ఆర్థిక సహకారం అందించినా.. అంతకు రెండింతల మొత్తాన్ని ఖర్చు పెట్టుకొని ప్రజలను వాహనాల్లో తీసుకొచ్చారు. అయితే, దీనికి తెలంగాణ ప్రభుత్వం అనుకున్నంత మంది మాత్రం రాలేదట. ఓ ఏడెనిమిది లక్షలకు మించి హాజరుకాలేదని తెలుస్తోంది. అయినా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇదే భారీ సభగా నిలిచింది. మరి సభ ఫెయిల్ అవడానికి కారణం ఏంటి.?

టీఆర్‌ఎస్‌ 2001లో ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో 30కిపైగా భారీ బహిరంగ సభలు నిర్వహించింది. కానీ, ఏ సభకూ ఇంత ప్రచారం కల్పించలేదు. అందుకే ఈ సభపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సభలో ముందస్తు ఎన్నికల గురించి ప్రకటన చేస్తారని, ప్రత్యర్థులపై తనదైన శైలిలో విమర్శలతో విరుచుకుపడతారని చాలా మంది ఆశించారు. కానీ, కేసీఆర్ నిరాశపరిచారు. కేవలం తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టిన పథకాలపైనే దృష్టి సారించారు. మరోసారి అధికారం కావాలని అర్జించారు. ఈ కారణంగానే ప్రగతి నివేదన సభ ఫెయిల్ అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, కేసీఆర్ ఇప్పటి వరకు పాల్గొన్న ఏ సభలోనూ ఈ తరహా ప్రసంగం చేయకపోవడమూ ఒక కారణమనే టాక్ వినిపిస్తోంది.

ఈ సభ ఫెయిల్ అవడంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కేసీఆర్ సభ కంటే తాము నిర్వహించిన రాహుల్ గాంధీ సభే గ్రాండ్ సక్సెస్ అయిందని ఆ పార్టీ భావిస్తోంది. అంతేకాదు, ప్రగతి నివేదన సభ జరుగుతుండగానే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రగతి నివేదన పేరుతో టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసిన సభ అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని వారు ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకంగా ఉన్నారని, దానిని వినియోగించుకుని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే ‘కేసీఆర్‌ హఠావో, తెలంగాణకో బచావో’ అన్న నినాదంతో ఇక ముందకు వెళతామని వారు చెబుతున్నారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ సభ కాంగ్రెస్‌తో కొత్త జోష్‌ను తీసుకువచ్చినట్లైంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.