టీఆర్ఎస్ కు మరోసారి ఓటమి రుచి

తెలంగాణలో టీఆర్ఎస్ కు ఓటమి రుచి తగులుతోంది. మొన్న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కార్మిక సంఘ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయభేరి మోగించింది. గులాబీ పార్టీ కార్మిక సంఘానికి చావు దెబ్బ తగిలింది. ఆతర్వాత జరిగిన హైకోర్టు లాయర్ల సంఘం ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి మూడో స్థానానికి పరిమితం కావడం ఆశ్చర్యమే. అధ్యక్షుడిగా వైరి వర్గం నేత సి.దామోదరరరెడ్డి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో దామోదర్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి పొన్నం అశోక్‌గౌడ్‌పై 13 ఓట్ల తేడాతో గెలిచారు. దామోదర్‌రెడ్డికి 760 ఓట్లు రాగా, అశోక్‌ గౌడ్‌కు 747 ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌ న్యాయవాదుల మద్దతుతో బరిలో నిలిచిన ఆర్‌. వినోద్‌రెడ్డి వారి తర్వాత స్థానానికి పరిమితమయ్యారు. ఆయనకు కేవలం  602 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సి.హరిప్రీత్‌  771 ఓట్లు సాధించారు.
సంఘ కార్యదర్శులుగా కోమటిరెడ్డి వెంకట నర్సింహారెడ్డి, సుంకరి జనార్దన్‌గౌడ్‌లు విజయం సాధించారు.. సంయుక్త కార్యదర్శిగా ఉప్పాల శాంతి భూషణ్‌రావుకు 887 ఓట్లు వచ్చాయి. కోశాధికారిగా గెలుపొందిన జూకంటి అమృతరావు 1,052 ఓట్లు రావడం విశేషం. తెలంగాణ అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) పదవికి దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి,  సంపత్ ల సభ్యత్వం రద్దు, అసెంబ్లీ వీడియో పుటేజ్ ల విషయమే ఆయన రాజీనామాకు కారణం. ఆ ప్రభావంఈ ఎన్నికల మీద పడింది. టీఆర్‌ఎస్‌ న్యాయవాదుల మద్దతుతో బరిలోకి దిగిన వినోద్‌రెడ్డి గెలుపు ఖాయమని భావించినా, అనూహ్యంగా ఆయన ఓడిపోవడం చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్ కు ఎదురుగాలి తిరుగుతుందని అర్థమవుతోంది. ఈ ఫలితాలు బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహంలో నింపుతోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.