బొడిగే శోభకు షాకిచ్చిన అనుచరులు

తెలంగాణలో ముందస్తు ఎన్నికల కోసం అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్.. అదే రోజు 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన పద్నాలుగు స్థానాలను పెండింగ్‌లో ఉంచారు. వీటిలో టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ ప్రాతినిధ్యం వహించిన చొప్పదండి కూడా ఉంది. శోభకు టిక్కెట్‌ ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచుతూ వచ్చారు. దీంతో తనకు ఎలాగో టికెట్ రాదనే నమ్మకంతో ఆమె టీఆర్ఎస్‌ను వీడారు. దాదాపు రెండు నెలలుగా ఆమె రాజకీయ భవిష్యత్‌పై కమ్ముకున్న నీలి నీడలను భారతీయ జనతా పార్టీ చెరిపేసింది. ఆ పార్టీ తన మూడవ జాబితాలో బొడిగె శోభకు టికెట్‌ ఇవ్వడం ద్వారా ఆ సస్పెన్స్‌కు తెరదించింది. ఈ నెల 14న బీజేపీ పార్టీ తరపున నామినేషన్‌ వేశారు. దీంతో చాలా రోజులు టికెట్‌ పెండింగ్‌లో ఉంచిన సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు సుంకె రవిశంకర్‌కు టికెట్‌ కేటాయించారు. మంత్రి కేటీఆర్‌ ఆశీస్సులు రవిశంకర్‌కే ఉన్నాయని, ఆయనకు టిక్కెట్‌ ఖాయమని మొదటి నుంచి చెబుతూ వచ్చారు.

బుధవారం ఆయన టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పేర్కొంటూ నామినేషన్‌ కూడా వేశారు. బీ-ఫారం ఇవ్వకపోయినా ఆయన టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేయడంతో తాజా జాబితాలో సుంకె రవిశంకర్‌కు చోటు కల్పించింది. ఇక బీజేపీలో చేరిన బొడిగే శోభకు చొప్పదండి స్థానం కేటాయించారన్న సంతోషం ఆదిలోనే ఆవిరైపోయే పరిస్థితి ఏర్పడింది. ఇన్ని రోజులూ తన వెన్నంటి ఉన్న అనుచరులు ఆమెకు షాక్ ఇచ్చారు. ఆమె వర్గంలో ఉన్న మండలంలోని పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు తమ భవిష్యత్‌ కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. గురువారం కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నివాసంలో సమావేశమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే సమావేశంలో మెజార్టీ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లోనే కొనసాగాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. గతంలో మండలంలో టీఆర్‌ఎస్‌ రెండు గ్రూపులుగా ఉండేది. వీరిలో కొంతమంది ఎమ్మెల్యే వర్గంలో, మరికొంత మంది స్థానిక నేతలతో మరో వర్గంగా ఉండేవారు. మండలంలో పార్టీ పరంగా ఏ కార్యక్రమం నిర్వహించినా రెండు వర్గాల నేతలు వేర్వేరుగా నిర్వహించే వారు. ఈ క్రమంలో మండలంలో టీఆర్‌ఎస్‌ తీరు చర్చనీయాంశంగా ఉండేది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.