టీఆర్ఎస్ మళ్లీ మొదలు పెట్టింది.. టార్గెట్ రెండు పార్టీలే

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. మరోసారి గత ఫలితాలను రిపీట్ చేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. అయితే, ఇటీవల తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణల వల్ల టీఆర్ఎస్‌లో కొంత కలవరం మొదలైందట. దీంతో ప్రతిపక్షాలను దెబ్బ కొట్టాలని డిసైడ్ అయిపోయారట కేసీఆర్. ఇందుకోసం గతంలో వాడిన ఓ సూత్రాన్ని మరోసారి ప్రయోగించాలని ఆయన భావిస్తున్నారట. 2014 ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయోగించిన ఈ సూత్రాన్ని.. విభజన తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ ప్రయోగించింది. తాజాగా మరోసారి దానిని తెరపైకి తెచ్చింది.

ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగనుండగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు ఆపరేషన్‌ ఆకర్ష్‌‌ను మరోసారి ప్రారంభించింది. తెలుగుదేశం పార్టీ నాయకులను, శ్రేణులను గత సంవత్సరమే పార్టీలో చేర్చుకున్న టీఆర్‌ఎస్‌ ప్రస్తుతం కాంగ్రెస్‌, బీజేపీ నేతలపై దృష్టి సారించింది. రెండు నెలలుగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ఆ పార్టీ నేతలను ఒకరొక్కరిగా టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇప్పటికే రెండు పార్టీల నుంచి ద్వితీయ శ్రేణి నాయకులను తమ పార్టీలో చేర్చుకున్న టీఆర్ఎస్ నాయకులు బడా నేతల కోసం ప్లాన్లు సిద్ధం చేస్తున్నారట.


కొన్ని జిల్లాల్లో బీజేపీలో ఉన్న మైనస్‌లను తనకనుకూలంగా మార్చుకోవడానికి టీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించింది. బీజేపీలో ఉన్న నాలుగు స్తంభాలాటను ఆసరాగా చేసుకొని అసంతృప్తివాదులందరిని ఆకర్ష్‌ మంత్రంతో లాగేస్తున్నది. ఇప్పటికే ఈ పార్టీలోని కొందరు నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇంకొంత మంది నేతల కోసం టీఆర్ఎస్ వేచి చూస్తోంది. అలాగే కాంగ్రెస్‌ పార్టీ నుంచి కూడా పలువురు నేతలు టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఓటు బ్యాంకు ఉండి, ప్రజల్లో ప్రభావం చూపగల నాయకులను ఒక్కొక్కరిగా ఆకర్షిస్తూ టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారు. మొన్నామధ్య హైదరాబాద్‌కు చెందిన బడా నేత గులాబీ గూటికి చేరిపోయాడు. ఇప్పడు ఆయన బాటలోనే పలువురు నేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

అటు కాంగ్రెస్‌లో, ఇటు బీజేపీలో ఉన్న పరిస్థితులను టీఆర్‌ఎస్‌ సానుకూలంగా మార్చుకుంటూ బలమైన శక్తిగా ఎన్నికల పోరును ఏకపక్షం చేసే దిశగా కార్యాచరణను అమలు చేస్తున్నది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికి టికెట్‌ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టంగా ప్రకటించడం కూడా ఆ పార్టీలో ఎలాంటి విబేధాలు లేకుండా కలిసికట్టుగా పనిచేస్తూ ఇతర పార్టీల నేతలను ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రతిపక్ష పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌ నాయకులు తమ పార్టీని దొంగ దెబ్బ తీస్తున్నారని, భారీ ఆఫర్‌లు ఇచ్చి తమ వాళ్ళను తీసుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.