కేసీఆర్ గేమ్ స్టార్ట్స్.. కాంగ్రెస్ ఫస్ట్ వికెట్ డౌన్

కీలక పరిణామం తర్వాత తెలంగాణలో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. అధికార, ప్రతిపక్షాలు వేసే వ్యూహాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కేసీఆర్ ఇచ్చిన షాక్ నుంచి మిగతా పార్టీలు తేరుకోలేకపోతున్నాయి. ఈ సమయంలోనే ప్రతిపక్షాలను దెబ్బకొట్టాలని కేసీఆర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల వచ్చే వరకు ప్రచారం చేస్తూనే ప్రతిపక్షాలను కోలుకోనీయకూడదని ఆయన డిసైడ్ అయ్యారట. అందుకోసం ఆయా పార్టల్లోని కీలక నేతలకు వల వేస్తున్నట్లు సమాచారం. అందుకోసమే 14 మంది పేర్లను ప్రకటించలేదన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు నుంచే యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టేశారు. రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేతను టీఆర్ఎస్‌లో చేరడానికి ఒప్పించారు.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్‌ను తెరపైకి తెచ్చారు. అసెంబ్లీని రద్దు చేసిన మరుసటి రోజే కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న మాజీ స్పీకర్ సురేష్‌ రెడ్డిని టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించి సక్సెస్ అయ్యారు. శుక్రవారం సురేష్ రెడ్డిని ఆయన నివాసంలో మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. అనంతరం వీరిద్దరూ కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేటీఆర్.. సురేష్‌రెడ్డిని టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించేందుకు వచ్చానని చెప్పారు. తర్వాత మాట్లాడిన మాజీ స్పీకర్ రాష్ట్ర అభివృద్ధి ఆగకూడదనే ఉద్దేశంతో త్వరలో ఆ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధి కారులా దూసుకుపోతోందని, అనవసరంగా బ్రేకులు వేసినా, డ్రైవర్‌ను మార్చాలని చూసినా కుంటుపడిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిణామంతో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలినట్లైంది. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్‌కు సురేష్‌రెడ్డి ఇచ్చిన షాక్‌తో ఆ పార్టీలో కలవరం మొదలైంది. దీంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

వాస్తవానికి సురేష్ రెడ్డి గత ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవాలనుకున్నారట. అయితే, కేసీఆర్ సూచన మేరకు ఆయన నూట్రల్‌గా ఉండిపోయారని తెలుస్తోంది. గతంలో సురేష్ రెడ్డి పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ అభ్యర్ధులను ప్రకటించడంతో ఆయనకు కీలక పదవి ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల్లో తన అనుచరులతో కలిసి, కేసీఆర్ సమక్షంలో ఆయన కారెక్కబోతున్నారని టాక్. 2004-09 మధ్య కాలంలో సురేష్ రెడ్డి ఉమ్మడి ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989, 1994, 1999, 2004లో వరుసగా నాలుగు సార్లు సురేష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో అప్పటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సురేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ఆయన ఓటమి చెందారు. టీఆర్ఎస్ అభ్యర్ధి జీవన్‌రెడ్డి చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.