మూడు సీట్లు గెలిచే ఊపులో టీఆర్ఎస్

రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. నేతలు ఎవరికి వారే ఓటేసేందుకు అసెంబ్లీకి వచ్చారు. తెలంగాణలో 117 మంది ఓటర్లు ఉన్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఏపీలో మూడు రాజ్యసభ సీట్లు ఏకగ్రీవం కాగా… తెలంగాణలో మూడు సీట్లకు నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా జోగినపల్లి సంతోష్‌కుమార్, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్యయాదవ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పి.బలరాంనాయక్‌ పోటీ చేస్తున్నారు. ఫలితంగా ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.  
ముందుగానే మాక్ పోలింగ్ నిర్వహించి రంగంలోకి దిగింది టీఆర్ఎస్. పార్టీ ఫిరాయింపు దార్ల ఓట్ల పైనే ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్. ఫలితంగా ఎవరి ఓట్లు ఎటు చీలతాయో అర్థం కాని పరిస్థితి ఎదురైంది. తాము నిలబెట్టిన ముగ్గురు అభ్యర్థులను గెలుపించుకునేందుకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ పావులు కదుపుతున్నారు. వరుసగా మూడు రోజులపాటు మాక్‌పోలింగ్‌ను నిర్వహించి.. ఓటు వేయడంలో ఏ మాత్రం పొరపాటు జరగకుండా ఎమ్మెల్యేలకు శిక్షణ ఇప్పించారు. ఒక్కో రాజ్యసభ అభ్యర్థి గెలవడానికి 27 ఓట్లు సరిపోతాయి. టీఆర్‌ఎస్‌ సొంత ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్, సీపీఐ మినహా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరినవారు కలిపి 82 మంది ఉన్నారు. మరోవైపు ఎంఐఎం మద్దతునిస్తుంది. వారు ఏడుగురు ఉన్నారు. ఫలితంగా 89 ఓట్లున్నాయి. టీఆర్‌ఎస్‌ ముగ్గురు అభ్యర్థులు గెలవడానికి ఈ ఓట్లు చాలు అనుకుంటున్నారు. 
బీజేపీ, టీడీపీ, సీపీఎం దూరం…
రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థులకు సమాన దూరం పాటించాలని బీజేపీ, టీడీపీ, సీపీఎం నిర్ణయించాయి. టీడీపీకి ఇద్దరే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక సిపిఎంకు ఒక్కరు. బీజేపీకి ఐదుగురు ఎమ్మెల్యేలున్నారు. వారంతా ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. మొత్తం ఎనిమిది మంది ఓటింగ్ కు దూరంగా ఉండటంతో గెలుపుకు అవసరమైన సంఖ్య తగ్గుతోంది. అది ఓటింగ్ జరిగిన తర్వాత తేలనుంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.