
తెలంగాణ గాంధీగా కేసీఆర్‌కు అపరకీర్తి.. మరో పాతికేళ్లకు సరిపడ.. పేరు ప్రఖ్యాతలు.. ఆంధ్ర పార్టీలకు ఆదరణ కరవైంది. ఇదీ నిన్నటి వరకూ కేసీఆర్ వర్గం ధీమా. కుటంబ పాలన అంటూ కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోసిన టీఆర్ ఎస్‌లో తండ్రి కొడుకులు, మేనల్లుడు, కూతురే అన్నీ తామై చక్రం తిప్పటాన్ని మంత్రులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. హోంశాఖ మంత్రి నాయిని ఇప్పటికే దీనిపై పరోక్షంగా చురకలు వేశారు కూడా. కేబినెట్లో కేవలం కేటీఆర్ ఒక్కడే మంత్రి అనేంతగా.. అన్ని శాఖల్లోనూ వేలు పెట్టడం కూడా మిగిలిన మంత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఇప్పటి వరకూ.. తిట్టిపోసిన కాంగ్రెస్ పార్టీ మీదనే సానుభూతి చూపుతున్నారట. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ఇటీవల శాసనసభ సమావేశాల్లో గవర్నర్ నరసింహన్ ప్రసంగించే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఈ సమయంలోనే ఎమ్మెల్యేలు కొందరు నరసింహన్‌పై దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలోనే హెడ్‌ఫోన్‌ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గవర్నర్‌పైకి విసిరారు. అది కాస్తా.. పక్కనే ఉన్న శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగలటంతో సీన్ మారింది. గౌడ్‌ను ఆసుపత్రికి తరలించి రెండుమూడ్రోజులు బాగానే రక్తి కట్టించారు. ఆ తరువాత ఆయన కూడా.. నల్లకళ్లద్దాలతో సభకు హాజరై పరామర్శలు అందుకున్నారు కూడా. అనంతరం.. సభాపర్వంలో గలాటాకు కారణమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన సంపత్‌కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనసభ్యత్వాలను రద్దుచేస్తూ తీర్మానం చేశారు. సభ్యుల సభ్యత్వం రద్దయిన విషయాన్ని అదేరోజు ఎన్నికల సంఘానికి చేరవేశారు. దీంతో కాంగ్రెస్ స్పీడుకు బ్రేకులు వేశామని టీఆర్ ఎస్ శ్రేణులు చంకలు గుద్దుకున్నాయి. కానీ.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై ప్రజల్లో సానుభూతి పెరుగుతోంది. పైగా గులాబీ నేతలే.. ఆంధ్రోళ్లను తలదన్నేలా నియంతగా వ్యవహరిస్తున్నారనే అపవాదును మూటగట్టుకున్నారు.నల్లగొండలో పాగా వేయాలనే ప్లాన్ కాస్తా బెడసికొట్టింది. ఇప్పటికే నల్లగొండ మున్సిపాలిటీ ఛైర్మన్ భర్త హత్యతో టీఆర్ ఎస్ చాలా పెద్ద తప్పిదం చేసింది. దాని ఫలితంగా మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే వీరేశంపై విమర్శలు పెరిగాయి. ప్రజల్లో హస్తం నేతలపై సానుభూతి రెట్టింపైంది. ఇలా.. టీఆర్ ఎస్ దూకుడుగా వ్యవహరిస్తున్న తీరు.. పార్టీకు నష్టం తెచ్చిపెడుతుందంటూ పార్టీ నేతలు బహిరంగంగానే వాపోతున్నారు. పైగా కాంగ్రెస్‌కు ఇవన్నీ బలంగా మారతాయంటున్నారు. ఇదే సమయంలో ఏజీ ప్రకాష్‌రెడ్డి రాజీనామాతో గులాబీ మరింతగా పీకల్లోతు కష్టాల్లో మునిగినట్లయింది. హైకోర్టుకు సభలో జరిగిన ఘటనల వీడియో ఫుటేజ్ కూడా ఇవ్వాల్సి రావటంతో మున్ముందు ఎలాంటి పరిస్థితులు చవిచూడాల్సి వస్తుందనేది కారు పార్టీలో కంగారు రేకెత్తిస్తోంది. 2019 ఎన్నికల ముందు చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు.. పార్టీ ప్రతిష్ఠను.. ప్రభుత్వ పనితీరును బజార్న పడేస్తున్నాయనే ఆవేదన కూడా సీనియర్లలో కనిపిస్తుందన్నమాట.
Be the first to comment