హ‌స్తంలో అయోమ‌యం! ఇదే అద‌నుగా టీఆర్ఎస్ అస్త్రం!

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో మూడు రాష్ట్రాల్లో గెలిచి.. అధికారాన్ని కైవ‌సం చేసుకున్న హ‌స్తం పార్టీ.. తెలంగాణ‌లో మాత్రం కుదేలైంది. కారు పార్టీ దెబ్బ‌కు ఇంకా ఆ పార్టీ నేత‌లు కోలుకోలేదు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చి నెల రోజులు పూర్త‌వుతుంది. రెండో ద‌ఫా ప్ర‌భుత్వాధినేత ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ప్ర‌మాణ స్వీకారం సైతం చేశారు. క్యాబినెట్ మాత్రం విస్త‌రించ‌కుండా ఆశావాహుల్లో.. జంప్ జిలానీల్లో వ్యూహాత్మ‌కంగా ఆశ‌లు పెంచుతున్నారు. ఇదే స‌మ‌యంలో..ఇప్ప‌టి వ‌ర‌కూ కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష నేత (సీఎల్పీ లీడ‌రు)ను ఇంకా ఎన్నుకోలేదు. కాంగ్రెస్‌లోప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దే నేత‌లు క‌రువ‌య్యారు. ఉన్న నేత‌లు ఇంకా ఎన్నిక‌ల ఫ‌లితాల పోస్టుమార్టం పేరుతో దూష‌ణ‌ల ప‌ర్వం కొన‌సాగిస్తున్నారు.

ఈ ప‌రిస్థితుల‌నే టిఆర్‌‌ఎస్ పెద్దలు త‌మకు అనుకూలంగా మ‌ల‌చుకుంటున్నారు. ఎన్నిక‌లు పూర్త‌యిన నాటి నుండే టిఆర్‌య‌స్ నేత‌లు కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేల‌తో ట‌చ్ లోకి వెళ్లార‌ని తెలిసినా.. న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల్లో కాంగ్రెస్ నేత‌లు విఫ‌ల‌మ‌య్యారు. ఫ‌లితంగా ఇప్పుడు కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని వీడి కారెక్క‌టానికి సిద్ద‌మ‌య్యార‌ని స‌మాచారం. కాంగ్రెస్ నుండి గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల‌తో టిఆర్‌ఎస్ నేత‌లు ట‌చ్‌లో ఉన్న‌ట్లు కొంత కాలంగా విస్తృత ప్ర‌చారం సాగుతోంది. అందులో భాగంగా.. వారికి భ‌విష్య‌త్ రాజ‌కీయాలపై భ‌రోసా, ప‌ద‌వులు, వార‌సుల‌కు అవ‌కాశాలు వంటి వాటిని గులాబీ నేత‌లు వారి ముందు ప్ర‌తిపాదిస్తున్నారు. కొంద‌రు నేత‌లు టిఆర్‌ఎస్‌తో ట‌చ్‌లో ఉన్న‌ప్ప‌టికీ జంపింగ్ వార్త‌ల‌ను ఖండిస్తున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. వారితో పాటు నిజామాబాద్‌ జిల్లా నుంచి గెలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జె. సురేందర్‌ కూడా టీఆర్‌ఎస్‌లో చేరతారని అంటున్నారు. ఇక‌, రంగారెడ్డి జిల్లా నుండి స‌బితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి.

ఇక‌ వీరితో పాటుగా టీడీపీ నుండి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతారంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక ర‌కంగా టిఆర్‌య‌స్ నేత‌లు సైతం వీరి చేరిక విష‌యాన్ని అధికారికంగా చెప్ప‌క‌పోయినా.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో మాత్రం అంగీక‌రిస్తున్నారు. తెలంగాణ‌లో తాజా ఎన్నిక‌ల్లో టీడీపీ నుండి గెలిచిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల కోసం టిఆర్‌య‌స్ విస్తృతంగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఆ ఇద్ద‌రిలో ఒక‌రు ఇప్ప‌టికే సంసిద్ద‌త వ్య‌క్తం చేయ‌గా.. మ‌రొక‌రు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఇక, కాంగ్రెస్ నుండి గెలిచిన వారిలో ఆరుగురు ఇప్ప‌టికే టిఆర్‌య‌స్ తో చేతులు క‌ల‌పటానికి సిద్దంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. గ్రేట‌ర్ ప‌రిధిలోని ఇద్ద‌రు ఎమ్మెల్యేలు స‌బితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి టిఆర్‌య‌స్ లోకి జంప్ అవుతే.. ఇక గ్రేట‌ర్ ప‌రిధిలో టిఆర్‌య‌స్.. ఎంఐఎం.. బిజెపి మిన‌హా కాంగ్రెస్-టిడిపికి ప్రాతినిధ్యం ఉండ‌కుండా పోతోంది. ఇదే టిఆర్‌య‌స్ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. ఇక చేవెళ్ల ఎంపి విశ్వేశ్వ‌ర రెడ్డి టిఆర్‌య‌స్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీనికి బ‌దులు తీర్చుకోవ‌టానికి అన్న‌ట్లుగా అదే ప్రాంతం నుండి కాంగ్రెస్ కీల‌క నేత‌గా ఉన్న కార్తీక్ రెడ్డిని టిఆర్‌య‌స్ లోకి తీసుకొని వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో చేవెళ్ల సీటు ఇచ్చే ప్ర‌తిపాద‌నపై చ‌ర్చ సాగుతోంది. ఇక‌, చేరిక‌లు పూర్త‌వ్వ‌టం ద్వారా క్యాబినెట్ విస్త‌ర‌ణ .. ప‌దువుల పందేరం పూర్తి చేస్తార‌ని టిఆర్‌య‌స్ నేత‌లు చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.