అదే జరిగితే టీఆర్ఎస్ అభ్యర్థి ఔట్

తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావిడి తారాస్థాయికి చేరింది. ఇన్ని రోజులు అభ్యర్థుల ప్రకటన కోసం కసరత్తు చేసిన పార్టీలు.. ఇప్పుడు అసలైన ఘట్టం కోసం వ్యూహాలు రచించుకుంటున్నాయి. అధికార పక్షం అభివృద్థి, సంక్షమే పథకాల అమలు వంటి వాటినే ప్రధాన ఆయుధంగా ఎన్నికల బరిలో దిగుతుండగా, ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తున్నాయి. అన్నింటికంటే ముందు అభ్యర్థుల ఎంపిక వల్ల ఏర్పడిన సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆయా పార్టీల అధిష్ఠానాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. టికెట్ దక్కిని చాలా మంది ఆశావాహులు పార్టీలకు గుడ్‌బై చెప్పగా, మరికొందరు మాత్రం రెబెల్స్‌గా నామినేషన్ వేసేశారు. దీంతో వారిని బుజ్జగించేందుకు ఆయా పార్టీల నేతలు రంగంలోకి దిగారు. మరోవైపు అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేసేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన చాలా మంది అభ్యర్థులు తొలి దశ ముగించుకున్నారు. మహాకూటమి సీట్ల సర్ధుబాటు నామినేషన్ చివరి వరకు సాగడంతో, కూటమిలోని అభ్యర్థుల ఇప్పుడిప్పుడే ప్రచారాన్ని ప్రారంభించారు.

ముందస్తు ఎన్నికల బరిలో నిలిచేందుకు అభ్యర్థుల నామినేషన్ల సమర్పణ ప్రక్రియ సోమవారం ముగిసింది. మంగళవారం అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల పరిశీలన కూడా అయిపోయింది. ఇలాంటి సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఓ అభ్యర్థి నామినేషన్ విషయంలో గందరగోళం నెలకొంది. జగిత్యాల అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంజయ్ కుమార్.. నామినేషన్ పత్రంలోని కాలమ్-5ని పూర్తి చేయకుండానే నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారట. మంగళవారం జరిగిన నామినేషన్ పత్రాల పరిశీలన సమయంలో మహాకూటమి అభ్యర్థి జీవన్‌రెడ్డి దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వాస్తవానికి నిబంధనల ప్రకారం ఏ ఒక్క కాలమ్‌ నింపకుండా వదలిపెడితే దరఖాస్తులను తిరస్కరించాలి. కానీ రిటర్నింగ్‌ అధికారి సంజయ్‌ నామినేషన్‌ను తిరస్కరించకపోవడంపై జీవన్‌ రెడ్డి రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. ఇదే జరిగి, నామినేషన్ పత్రంలో నిజంగానే ఖాళీగా ఉంటే నిబంధనల ప్రకారం సంజయ్ నామినేషన్ తిరస్కరించే అవకాశం ఉంటుందట. ఏమైనా తప్పులు ఉంటే సరిచేయవచ్చు కానీ, అసలు వివరాలు ఇవ్వకపోతే నామినేషన్ తిరస్కరించాల్సి ఉంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.