ఉత్త‌మ్‌… ఊపిరి పీల్చుకో!

ఏ ముహూర్తాన‌. తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వి వ‌రించిందో గానీ.. ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డికి ఆ ఆనందంగా కూడా లేదు. గ‌డ్డం పెంచి కేసీఆర్‌పై ఛాలెంజ్ విసిరినా కూడా ఎవ‌రూ న‌మ్మే ప‌రిస్థితుల్లో లేరు. రెడ్డి గ‌ణాన్ని ఏకం చేసేందుకు అటు రేవంత్‌రెడ్డి, ఇటు నాగం జనార్ద‌న్‌రెడ్డిల‌కు హ‌స్తం కండువా క‌ప్పినా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేదు. పైగా ఆ ఇద్ద‌రి రాక‌తో సీనియ‌ర్ల‌కు తెగ కోపం వ‌చ్చేసింది. పైగా ఉత్త‌మ్ బ‌య‌ట‌కు కేసీఆర్‌ను తిడుతూ. తెర‌చాటుగా గులాబీ బాస్‌తో స‌యోధ్య‌తో మెలుగుతున్నారంటూ మ‌రికొంద‌రు సీనియ‌ర్లు మ‌రో అడుగు ముందుకేసి రాహుల్‌గాంధీకు ఫిర్యాదు కూడా చేశార‌ట‌.

 

ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే.. రాహుల్ జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా జ‌రిపిన తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు.. మేమంతా ఒకే జ‌ట్టు అంటూ పిలుపునిచ్చాయి. అయితే మ‌రో వైపు భ‌ట్టి విక్ర‌మార్క‌, డీకే ఆరుణ‌, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వంటి నేత‌లు ఢిల్లీ వెళ్లి రాహుల్‌తో ఉత్త‌మ్ ఉంటే.. పార్టీ మ‌నుగ‌డ క‌ష్ట‌మంటూ చెవిలో ఊదొచ్చార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే.. అవ‌న్నీ తూచ్‌.. మీడియా సృష్టేనంటూ.. ఇప్పుడు నేత‌లంతా ఒక్క‌చోటికి చేరి మ‌రీ వివ‌ర‌ణ ఇచ్చుకున్నార‌న్న‌మాట‌. అయితే కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి బ్ర‌ద‌ర్స్ మాత్రం.. ఉత్త‌మ్ ఉంటే… పాతిక సీట్లు కూడా గెల‌వలేమంటూ అదిష్ఠానం వ‌ద్ద మ‌రో బాంబు పేల్చార‌ట‌. డీకే ఆరుణ అయితే.. ఉత్త‌మ్ ఉంటే.. నేను పార్టీలో ఉండ‌లేనంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు స‌మాచారం. ఇవ‌న్నీ ఓ ప‌క్క గుస‌గుస‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలోనే ఉత్త‌మ్ ఎన్నిక‌ల వ‌ర‌కూ మా అధ్య‌క్షుడు అంటూ నేత‌లంతా క‌ట్ట‌క‌ట్టుకుని మ‌రీ మీడియా సమావేశంలో చెప్ప‌టం.. ఉత్త‌మ్‌కు కాస్త ఊపిరిపీల్చుకునే అవ‌కాశం ఇచ్చిన‌ట్ట‌యింద‌ట‌.

 

కానీ.. ఇది కేవ‌లం మూణ్నాళ్ల ముచ్చ‌టే.. త్వ‌ర‌లో కొత్త నాయ‌కుడు రాబోతున్నాడంటూ కోమ‌టిరెడ్డి వ‌ర్గం మాత్ర ఉత్త‌మ్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లుతుంద‌ట‌. ఎంతైనా.. అది కాంగ్రెస్‌.. 29 రాష్ట్ర పీసీసీ కార్యాల‌యాల్లో బ‌ల్బులు వెల‌గాలంటే.. ఢిల్లీలో స్విఛ్ వేయాల్సిందే. ఈ లెక్క‌న‌.. పైన ఉన్న పెద్దోళ్ల‌కు ఎప్పుడు తిక్క‌రేగితే.. అప్పుడ ప‌ద‌వులు వ‌రించ‌వ‌చ్చు.. ఊడ‌నూ వ‌చ్చు. ద‌టీజ్ కాంగ్రెస్ అంటూ.. ప్ర‌త్య‌ర్థి పార్టీలు తెగ సెటైర్లు వేస్తూ ఎంజాయ్‌చేస్తున్నార‌ట‌. పాపం ఉత్త‌మ్‌..!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.