మాస్టారు వెనుక వ‌చ్చేదెవ‌రు!

తెలంగాణ జ‌న‌స‌మితి.. కోదండ‌రాం మాస్టారు కొత్త‌పార్టీ. తెలంగాణా ప్ర‌త్యేక ఉద్య‌మంలో తెర వెనుక నుంచి వ్యూహ‌ర‌చ‌న చేసిన బుర్ర ఆయ‌న‌ది. కుల‌, మ‌తాల‌కు అతీతంగా ల‌క్ష‌లాది మంది అభిమానులున్నారు. పార్టీల‌కు అతీతంగా ఆయ‌న పిలిస్తే ప‌లికే వంద‌లాది మంది నేత‌లున్నారు. ఇదంతా తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డేంత వ‌ర‌కూ మాత్ర‌మే. టీఆర్ఎస్ అధికారంలోకి రావ‌టంతో.. ఉద్య‌మంలో ఉన్నా.. లేక‌పోయినా.. త‌న‌కు ప‌నికి వ‌స్తార‌ని భావించిన వారంద‌రికీ.. ల‌బ్దిచేకూరేలా గులాబీబాస్ వ్య‌వ‌హ‌రించారు. ప‌రిస్థితులు వ్య‌తిరేకంగా త‌లెత్త‌కుండా ముందుజాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌నే చెప్పాలి. అయితే.. మాస్టారు మాత్రం.. ప‌ద‌వి వ‌ద్ద‌న్నారు. తెలంగాణ ఏర్పాటుకు కార‌ణ‌మైన నిధులు, నీళ్లు, నియామ‌కాల మీద తాను ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాలంటే బ‌య‌టే ఉండాల‌ని తేల్చిచెప్పారు. అదే ఆయ‌న స్థానంలో ఎవ‌రున్నా.. సీఎంతో వున్న సాన్నిహిత్యానికి చాలా ఆశించేవారు. కానీ.. అక్క‌డే మాస్టారు వివేకం అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. ఆయ‌న మాట‌లే కాదు.. అప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్ వెన్నంటి న‌డిచినా.. ప్ర‌జా స‌మ‌స్య‌ల విష‌యంలో గొంతెత్తారు.
జేఏసీ నేత‌గా.. తాను ప్ర‌శ్నిస్తానంటూ తేల్చిచెప్పారు. ఇది రుచించ‌ని గులాబీ నేత‌లు.. మాస్టారు.. కాంగ్రెస్ ఏజెంట్ అంటూ ఎద్దేవా చేశారు. నాలుగైదు సార్లు అరెస్ట్‌చేసి జైలుకు పంపారు. జేఏసీలో చీలిక తెచ్చి వ‌ర్గాలుగా మారేలా ప‌రిస్థితులు సృష్టించారు. ఇటువంటి స‌మ‌యంలోనే కోదండం మాస్టారు తెలంగాణ జ‌న‌ స‌మితి (టీజేఎస్ )పార్టీకు పునాది వేశారు. ఈ నెల 29న బ‌హిరంగ స‌భ‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. మాస్టారు ఆశ‌యానికి గండికొట్టేలా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించింది. పైగా ఎక్క‌డా స‌భ పెట్టుకోకుండా అడ్డంకులు సృష్టించింది. అయినా ఉన్న‌త న్యాయ‌స్థానం ఆదేశాల‌తో స‌భ తేదీ ఖ‌రారైంది. ఇదే ఇప్పుడు.. టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లో కాస్త అస‌హ‌నాన్ని క‌లిగిస్తున్నాయి. మాస్టారు వెంట న‌డిచేందుకు అధికార‌, ప్ర‌తిపక్ష పార్టీల్లోని నేత‌లు కూడా మాస్టారు వెనుక న‌డిచే అవ‌కాశాలున్న‌ట్లు సంకేతాలు వ‌స్తున్నాయి. రావుల చంద్ర‌శేఖ‌ర్‌, విజ‌య‌రామారావు వంటి సీనియ‌ర్ నేత‌లు ఆల్రెడీ.. టీజేఎస్‌లోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌నే ప్ర‌చారం సాగుతుంది. ఇదే బాట‌లో ఇంకెంత‌మంది ముందుకు వ‌స్తార‌నేది 29 కానీ.. తేల‌దు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.