ప్రముఖ నిర్మాత భార్యకు వైసీపీ టికెట్.. ఇది నిజమేనట

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్‌ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిజంగానే షాక్ ఇవ్వబోతున్నారా..? సామాజికవర్గ ప్రతిపాదికనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారా..? భూమన స్థానంలో వైసీపీ టికెట్ ఎవరికి దక్కబోతుంది..? ఇవీ.. ఇటీవల తిరుపతి నియోజకవర్గంలోని ఓటర్లతో పాటు రాష్ట్రంలోని చాలా మందికి వస్తున్న అనుమానాలు. దీనికి కారణం భూమన కరుణాకర్‌రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంలేదనే వార్త బయటకు రావడమే. ఇప్పటికే తిరుపతి అసెంబ్లీ స్థానానికి పోటీ చేయబోతున్నాని చెప్పుకుంటూ, ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. అయితే, ఆయనకు టికెట్ ఇవ్వకూడదని జగన్ నిర్ణయించుకున్నారని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి తోడు మరో ప్రధాన పార్టీ జనసేన నుంచి బలిజ సామాజికవర్గానికి చెందిన నేతలకే అవకాశం ఇస్తుండడంతో వైసీపీ అధినేత కూడా అదే ఫాలో అయిపోవాలని భావిస్తున్నారని ఇటీవల వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన మరో వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. భూమన స్థానంలో తిరుపతి టికెట్ ప్రముఖ సినీ నిర్మాత భార్యకు ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

ఈ విషయం నాలుగు రోజుల క్రితమే బయటికొచ్చినా.. అంతా పుకారేనని కొట్టిపారేశారు. అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తిరుపతి టికెట్ తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ భార్య ఎన్వీ మహాలక్ష్మికి కేటాయించబోతున్నారట. ఎన్వీ ప్రసాద్ గతంలో తెలుగుదేశం పార్టీలో పని చేశారు. ఈయన టీడీపీ హయాంలో తుడా చైర్మన్‌గా పని చేశారు. తర్వాత 2004 ఎన్నికల్లో తిరుపతి టీడీపీ అభ్యర్ధిగా పోటీ ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరపున అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో ప్రసాద్ బరిలో దిగలేదు. అంతేకాదు, మెగా ఫ్యామిలీతో ఉన్న స్నేహం కారణంగా పీఆర్పీలో కీలక పాత్ర పోషించారు. ఆ ఎన్నికల్లో చిరంజీవి విజయం సాధించడంలో ఈయన కృషి కూడా ఉంది. దీని తర్వాత చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఎన్వీ ప్రసాద్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆయన టచ్‌లో ఉంటున్నారు. మరోవైపు, తిరుపతి నియోజకవర్గంతో పాటు శ్రీకాళహస్తి, నెల్లూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలలో బలంగా ఉండడంతో పాటు, బలిజ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఆమెను బరిలోకి దించేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారని టాక్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.