ఆ ముగ్గురు మాజీలు సైకిల్ ఎక్కుతారా?

ఒక‌ప్పుడు.. ఆ ముగ్గురు నేత‌ల ఇమేజ్ వేరు. ఇప్పుడు వాళ్ల ప‌రిస్థితి.. ఏమో చెప్ప‌లేం. కానీ.. ప్ర‌జ‌ల్లో మాత్రం మంచి పేరుంది. గుర్తింపూ ఉంది. వారిప్పుడు  రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. ఏ పార్టీతోనూ ట‌చ్‌లో లేరు. కాబ‌ట్టి.. రేప‌టి  ఎన్నిక‌ల నాటికి.. ఏదో ఒక పార్టీ జెండా కింద‌కు చేర‌వ‌చ్చ‌నే ఊహాగానాలున్నాయి. ఒక‌వేళ తిరిగి రాజ‌కీయాల్లో చురుగ్గా ఉండాల‌నుకుంటే.. మాత్రం మూడు మార్గాలున్నాయి. అది జ‌న‌సేన‌, టీడీపీ, వైసీపీ.. మ‌రి ఆ ముగ్గురి మ‌న‌సులో ఏముందో మాత్రం ప్ర‌స్తుతానికి గ‌ప్‌చుప్. ఇంత  చెబుతున్నారు.. ఎవ‌రా ముగ్గురు అనేగా.. అక్క‌డ‌కే వ‌స్తున్నాం.. వారిలో ఒక‌రు ఉండ‌వ‌ల్లి ఆరుణ్ కుమార్‌, హ‌ర్ష‌కుమార్‌, మూడోది.. మ‌న ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌. స‌ర్వేల పాపారాయుడంటూ.. అభిమానులు ముద్దుగా పిలుచుకుంటుంటారు. 2014లో హ‌స్తం ఘోర ప‌రాజ‌యం త‌రువాత‌.. వీరంతా బ‌య‌ట‌కు వ‌చ్చారు. హ‌ర్ష‌కుమార్ మాత్రం.. మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్‌రెడ్డితో క‌ల‌సి చెప్పుల పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. క‌నీసం డిపాజిట్టు కూడా సాధించ‌లేక‌పోయారు.. అదంతా వేరే సంగ‌తి. అమ‌లాపురంలో ఆయ‌న‌కు ప్ర‌త్యేక ఇమేజ్ ఉంది. ప్ర‌జ‌ల్లో.. ఆయ‌న సామాజిక‌వ‌ర్గంలోనూ ప‌ట్టుంది. ఇవ‌న్నీ ఇప్పుడున్న రాజ‌కీయ ర‌ణ‌రంగంలో.. త‌మ‌కు అద‌న‌పు బ‌లంగా మార‌తాయంటూ ప్ర‌తిపార్టీ భావిస్తుంది. సో.. కిర‌ణ్‌కుమార్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. కాబ‌ట్టి.. హ‌ర్ష‌కుమార్ కూడా  అటే చేర‌తాడ‌నే ఊహాగానాలున్నాయి. కానీ.. ఆయ‌న వ‌ర్గీయులు మాత్రం.. సైకిల్ ఎక్కేందుకు అవ‌కాశాలున్నాయంటున్నారు. ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌.. మొన్నీమ‌ధ్య‌.. ప‌వ‌న్‌ను క‌లిశాడు.. జ‌గ‌న్‌ను త‌క్కువ అంచ‌నా వేయ‌వ‌ద్ద‌న్నాడు. చంద్ర‌బాబునాయుడుకు స‌ల‌హాలిచ్చాడు. కాబ‌ట్టి.. అరుణ్ అంటే.. అంద‌రివాడు అనే ముద్ర వేసుకున్నాడు. మ‌రి.. ఎన్నిక‌ల వేళ  ఎవ‌రివైపు మొగ్గుచూపుతార‌నేది మాత్రం ఇప్ప‌టికి స‌స్పెన్స్‌. ఎన్నిక‌ల  బ‌రిలో దిగేందుకు త‌న వ‌ద్ద డ‌బ్బుల్లేవంటూ తేల్చారు. మ‌రి.. అవే పైస‌లు ఎవ‌రైనా ఇస్తే.. పోటీ చేస్తారేమో. అది చంద్ర‌బాబు కావ‌చ్చేమో.. అనేది టీడీపీ శ్రేణులు అనే మాట‌. జ‌న‌సేనాని ప‌వ‌న్ అంటే అభిమానం కాబ‌ట్టి.. మా వైపే అనేది జ‌న‌సైనికుల ఆరాటం. ల‌గ‌డ‌పాటి దాదాపు టీడీపీలో చేర‌టం ఖాయ‌మ‌నేది ఖ‌రారైంది. నాలుగైదు సార్లు రాజ‌గోపాలుడు.. చంద్ర‌బాబును క‌ల‌వ‌టం.. పార్టీ వ్యూహాలు.. కేంద్రంపై ప్ర‌త్యేక‌హోదాలో అనుస‌రించాల్సిన అంశాల‌పై చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.  కానీ.. ఒక‌ప్పుడు టీడీపీ అంటే.. ముఖ్యంగా దేవినేని కుటుంబంతో బ‌ద్ధ‌వైరం కొన‌సాగుతుంది. మ‌రి అవ‌న్నీ ప‌క్క‌న‌బెట్టి సైకిల్ పైకి చేర‌తారా.. ప‌సుపు కండువా క‌ప్పుకుంటారా అనేది మ‌రో సందేహం. ఎవ‌రి విశ్లేష‌ణ‌లు.. లెక్క‌లు  ఎలా వున్నా.. మాజీలు మాత్రం.. ఏమ‌నుకుంటున్నార‌నేది ఇప్ప‌టికి మాత్రం.. ర‌హ‌స్య‌మే సుమా!!!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.