అసలైన ఆట మొదలయ్యేది అక్టోబరు నుంచే!

రాష్ట్ర రాజకీయాల్లో మరో మూడు నెలల తరువాత భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయని రాజకీయ నేతలు చెబుతున్నారు. పార్టీ ఫిరాయింపులు, రాజకీయ పార్టీల కొత్త స్నేహాలు కూడా అప్పుడే వెల్లడవుతాయని వారు తేల్చిచెబుతున్నారు. లోక్‌సభ, రాష్ట్ర శాసన సభకు వచ్చే ఏడాది మే నెల వరకు గడువు ఉన్నప్పటికీ, బీజేపీ ముందస్తు ఎన్నికలకు ప్రణాళికలు రచిస్తున్నదనే వార్తలు వస్తున్నాయి, దీంతో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు అక్టోబర్ నుంచి ఎన్నికల దిశగా ఎత్తులు, పై ఎత్తులకు రంగం సిద్ధం చేసుకుంటాయని తెలుస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీ చేపట్టిన గ్రామదర్శిని కార్యక్రమం అక్టోబర్ మొదటి వారంలో ముగియనుంది. అలాగే గ్రామవికాసం కార్యక్రమం కూడా త్వరలో ప్రారంభించేందుకు జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ గ్రామవికాసం కార్యక్రమం అక్టోబర్ చివరి నాటికి పూర్తి కానుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అలాగే జగన్ చేస్తున్న పాదయాత్ర సెప్టెంబర్ చివరి వరకు కొనసాగనుంది. ఆయన ఆ తరువాత పార్టీ 2019లో అధికారంలోకి రావడానికి తీసుకోవాల్సిన చర్యలపై జగన్ ఒక నిర్ణయానికి రానున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు కొత్తగా ఏర్పడిన జనసేన పార్టీ అధినేత పవన్ జిల్లాల పర్యటనలో బిజీగా ఉన్నారు.
ఆయన కూడా సెప్టెంబర్ నాటికి జిల్లాల పర్యటన పూర్తి చేసుకుని అన్ని జిల్లాల్లో పార్టీ కమిటీలను ఏర్పాటు చేసే అవకాశముందని నేతలు అంటున్నారు. దీన్నిబట్టి చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో పూర్తి స్థాయి వేడి రగిలేది అక్టోబర్ నుంచేనని లెక్కలు చెబుతున్నాయి. దీనికితోడు పార్టీ ఫిరాయింపులు కూడా అక్టోబర్ తరువాత భారీగా ఉంటాయని వారు సెలవిస్తున్నారు. జనసేన విధానాలు అక్టోబర్ నాటికి వెల్లడవుతాయని, దీంతో ఆ పార్టీలో అవకాశం లభిస్తే చేరడానికి నేతలు సిద్ధపడతారని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన టీడీపీ, బీజేపీ రానున్న ఎన్నికల్లో తిరిగి కలిసి పోటీచేసే అవకాశం లేదని తేలిపోయింది. అయితే టీడీపీ కాంగ్రెస్ పార్టీతో అవగాహనకు వచ్చి ఎన్నికలకు వెళ్తుందనే ప్రచారం సాగుతోంది. ఇక బీజేపీతో స్నేహం చేయనుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎత్తులు ఏంటన్నది అప్పటికీ తేలవచ్చని భోగట్టా! అయితే రాష్ట్రానికి బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వనందున వైకాపా, బీజేపీ చెలిమి సాధ్యం కాకపోవచ్చనే అంచానాలున్నాయి. ఇదే జరిగితే రాబోయే ఎన్నికల్లో జగన్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందన్న చర్చ జరుగుతోంది. జనసేన కూడా రానున్న ఎన్నికల్లో ఎవరితోనూ కలిసే అవకాశం లేదని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.