తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవే

తెలంగాణలో ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తించాయి. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గడువు కంటే తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేయడంతో తెలంగాణలో ఎన్నికలు అనివార్యమయ్యాయి. దాదాపు రెండు నెలల తర్వాత అంటే డిసెంబర్ ఏడున ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60శాతం కంటే ఎక్కువే పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడుతున్నాయి. కొన్ని జాతీయ సంస్థలతో పాటు, స్థానిక సంస్థలు కూడా నిర్వహించిన ఈ సర్వేల్లో ఫలితాలు ఈ కింది విధంగా వచ్చాయి.

టైమ్స్ నౌ సంస్థ నిర్వ‌హించిన ఎగ్జిట్ పోల్‌ సర్వేలో… తెలంగాణ‌లో మ‌రోసారి తెలంగాణ రాష్ట్ర సమితి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని తేల్చింది. ఈ సర్వే ప్రకారం టీఆర్ఎస్‌కు 66 స్థానాలు ద‌క్కుతాయ‌నీ, నాలుగు పార్టీలతో కలిసి ఏర్పడిన ప్ర‌జా కూట‌మికి 37 సీట్లు వస్తాయని చెప్పింది. అలాగే భార‌తీయ జ‌న‌తా పార్టీకి 7 స్థానాలు, ఎంఐఎంకూ 7 సీట్లు వచ్చే అవకాశం ఉన్నదని టైమ్స్ నౌ చెబుతోంది.

సిఎన్ఎన్ ఐబిఎన్ సంస్థ కూడా టిఆర్ఎస్‌కే విజయావకాశాలు ఉన్నట్లు తేల్చింది. ఈ సర్వే ప్రకారం ఆ పార్టీకి 50 నుంచి 65 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయట. మహాకూటమికి 38 నుంచి 52 రావొచ్చని సర్వే వెల్లడించింది. అలాగే బీజేపీ 4 నుంచి 7, ఇతరులు 10 నుంచి 17 స్థానాల్లో గెలుస్తారని తేల్చింది.

ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ కూడా టీఆర్ఎస్‌కే మొగ్గు ఉన్నట్లు తేల్చాయి. ఈ సర్వే ప్రకారం టీఆర్ఎస్‌కు 79 నుంచి 91 సీట్లు వస్తాయని తేల్చింది. మహాకూటమి 21 నుంచి 33 సీట్లు రావొచ్చని లెక్కలేసింది. అలాగే బీజేపీ 1 నుంచి 3 సీట్లకు పరిమితం కావొచ్చని చెప్పింది. 

సీ-ఓటర్ ఎగ్జిట్ పోల్స్ ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ కూటమికి 70 సీట్లు రావొచ్చని తేల్చింది. టిఆర్ఎస్ కు 35 సీట్లు రావొచ్చని తేల్చింది.

మరో జాతీయ సంస్థ రిప‌బ్లిక్ జ‌న్ కీ బాత్ నిర్వహించిన సర్వేలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. టీఆర్ఎస్ మేజిక్ ఫిగర్ దగ్గరకు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటు మాత్రం సింగిల్‌గా చేయడం కుదరదన్నట్లుగా తేల్చింది. ఈ సర్వే ప్రకారం ఆ పార్టీకి 50 నుంచి 65 మాత్ర‌మే వ‌స్తాయ‌ని చెప్పింది. ప్ర‌జా కూట‌మికి 38 నుంచి 52 స్థానాలు వ‌స్తాయ‌ని అభిప్రాయ‌ప‌డుతోంది. అయితే, బీజేపీ, ఎంఐఎంకు ఎన్ని సీట్లు వస్తాయన్నది మాత్రం వెల్లడించలేదు.

ఈ సంస్థలే కాదు.. ఇంకా పలు జాతీయ సంస్థలతో పాటు కొన్ని స్థానిక న్యూస్ చానెళ్లు సైతం ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేస్తున్నాయి. అన్నింటిలో టీఆర్ఎస్‌కే విజయవకాశాలున్నట్లు చెబుతున్నాయి. వాస్తవానికి టీఆర్ఎస్‌-ప్రజాకూటమి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. దీనికి తోడు బీజేపీ, ఎంఐఎం, బీఎల్ఎఫ్ సహా పలువురు స్వతంత్ర అభ్యర్థులు ఓట్లను బాగా చీల్చారు. దీంతో విజయం ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టంగా మారింది. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఎగ్జిట్ పోల్స్ తారుమారయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. మరోవైపు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా తన సర్వే ఫలితాలను వెల్లడించబోతున్నారు. మరి ఆయన సర్వేలో ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.