‘తేజ్ ఐ లవ్ యు’ మూవీ సమీక్ష

రేటింగ్ : 2.5/5

చిత్రం : తేజ్‌
న‌టీన‌టులు : సాయిధ‌ర‌మ్ తేజ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, జయప్రకాశ్‌, పవిత్రా లోకేశ్‌, పృథ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ తదితరులు
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం : ఎ.క‌రుణాక‌ర‌న్‌
నిర్మాత‌ : కె.ఎస్‌.రామారావు
సంగీతం : గోపీ సుంద‌ర్
పరిచయం :
‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన మెగా క్యాంప్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఐదు వ‌రుస అప‌జ‌యాల‌తో ఎలాగైనా స‌క్సెస్ కావాల్సిన త‌రుణంలో.. త‌న వ‌య‌సుకు త‌గిన విధంగా ప్రేమ క‌థా చిత్రం చేయాల‌నుకున్నాడు. అందుకు త‌గిన విధంగా ప్రేమ క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు లవ్ మెజీషియన్ క‌రుణాక‌ర‌న్‌తో చేయి క‌లిపాడు. ఈ ప్రేమ క‌థ‌ల స్పెష‌లిస్ట్‌కి కూడా డార్లింగ్ త‌ర్వాత మ‌రో స‌క్సెస్ ద‌క్క‌లేదు. మామ‌య్య‌కి `తొలి ప్రేమ` ఇచ్చిన‌ట్టుగా… అల్లుడికి కూడా గుర్తుండిపోయే చిత్ర‌మే ఇచ్చుంటాడ‌నే ఆశని క‌రుణాక‌ర‌న్‌పై పెట్టుకొన్నారు. మ‌రి అందుకు త‌గ్గ‌ సినిమానే తీశాడా? ఇంత‌కీ `తేజ్‌` క‌థేంటి? ఎలా ఉంది? ఇద్ద‌రికీ స‌క్సెస్ కావాల్సిన త‌రుణంలో.. చేసిన ఈ సినిమా అయినా గ‌ట్టెక్కిస్తుందా? తెలుసుకుందాం…
క‌థ‌ :
ప‌రువుగ‌ల కుటుంబం జాగ‌ర్ల‌మూడి తేజ్ (సాయిధ‌ర‌మ్‌తేజ్‌)ది. ఆయ‌న పెద‌నాన్న (జ‌య‌ప్ర‌కాశ్‌) ఇంటిపెద్ద‌. చిన్న‌ప్పుడేమ‌హిళ ప్రాణాన్ని కాపాడే క్ర‌మంలో ఓ నేరం చేస్తాడు.తేజ్ ఏడేళ్లు జైలు శిక్ష అనుభ‌వించి ఉంటాడు. దాంతో అత‌న్ని కుటుంబం నుంచి వెలివేస్తారు.త‌న ప్రాణాన్ని కాపాడేందుకే అలా చేశాడ‌ని తెలుసుకొన్న ఆ మ‌హిళ తేజ్‌కి స‌హాయం చేయాల‌నుకుంటుంది. అందుకోసం త‌న పేరిట ఉన్న కొంత ఆస్తిని తేజ్‌ పేరిట రాయమని తన భ‌ర్త‌కి చెబుతుంది. కానీ భ‌ర్త త‌న మాట విన‌క‌పోవ‌డంతో ఆఖ‌రి కోరిక‌గా కూతురు నందిని (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్‌)కి చెబుతుంది. దాంతో త‌న త‌ల్లి కోరిక‌ని నెర‌వేర్చేందుకు లండ‌న్ నుంచి వచ్చిన ఆమెతోతొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు తేజ్‌. నందినకి ఆ విష‌యం తెలియ‌దు. అయినా ఇద్ద‌రికీ మ‌ధ్య క్యాట్ అండ్ మౌస్ త‌ర‌హాలో గిల్లిక‌జ్జాలు జ‌రుగుతాయి. చివ‌ర‌కు తేజు ప్రేమ‌ను నందిని అర్థం చేసుకుని.. ప్రేమ‌ను చెప్ప‌డానికి వచ్చేట‌ప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. మూడు నెల‌లు కాలంలో ఏం జ‌రిగింద‌నే విష‌యాన్ని మ‌ర‌చిపోతుంది. దాని వ‌ల్ల తేజు ప్రేమ‌ను మ‌ర‌చిపోతుంది. విష‌యం తెలుసుకున్న తేజు ఆమెకు త‌న ప్రేమ‌ను గుర్తుకు చేసే క్ర‌మంలో ఆడే అబ‌ద్ధాలు నందినికి తెలిసిపోతాయి. నందిని.. తేజుని ఆస‌హ్యించుకుని వెళ్లిపోతుంది. లండ‌న్ వెళ్లిపోవాల‌నుకునే నందిని.. వాళ్ల అమ్మ కోరిక తీర్చాలనుకుంటుంది. అందుకోసం తేజు స‌హాయం అడుగుతుంది. తేజు ఏం చేస్తాడు? తేజు ప్రేమ‌ను నందిని అర్థం చేసుకుంటుందా? అస‌లు నందిని లండ‌న్ నుండి ఇండియా ఎందుకు వ‌స్తుంది? ప‌్రేమికులు క‌లిశారా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ‌ :
ప్రేమ‌క‌థ‌ల్లో ఒక‌టి ప్రేమికులు క‌లుసుకుంటారు లేదా విడిపోతారు. క‌లుసుకునే ప్రేమ‌క‌థ‌ల్లో ఇద్ద‌రు ప్రేమించుకోవ‌డం.. విడిపోవ‌డం.. మ‌ళ్లీ క‌లుసుకోవ‌డం. ఇది కామ‌న్ పాయింట్ అయితే ఎలా కలుసుకున్నారు? ఎందుకు విడిపోయారు? మ‌ళ్లీ వారు ఎలా కలుసుకున్నారు? అనే అంశాల‌ను ద‌ర్శ‌కుడు తెర‌పై ఎంత అందంగా.. కొత్త‌గా ప్రెజెంట్ చేస్తాడ‌నే దానిపై సినిమా స‌క్సెస్ ఆధార‌ప‌డి ఉంటుంది. క‌రుణాక‌ర‌న్ ప్రేమ‌క‌థ అంటే అందులో కొత్త‌ద‌నంతో పాటు స‌హ‌జ‌త్వం ఉంటుంద‌ని ఆశిస్తారు ప్రేక్ష‌కులు. ప్రేమ‌కి తోడు, మంచి ఫీల్‌, కుటుంబ అనుబంధాలు, హాస్యాన్ని మేళ‌వించ‌డంలో ఆయ‌న దిట్ట‌. ఈ సినిమాలో మాత్రం అవేవీ క‌నిపించ‌వు. ప్రేమ‌క‌థలో ఏ మాత్రం కొత్త‌ద‌నం లేక‌పోగా… దాన్ని ప‌లు మ‌లుపులు తిప్పి స‌హ‌జ‌త్వం లేకుండా చేశారు. కుటుంబం, ఆ నేప‌థ్యంలో భావోద్వేగాల్ని పండించ‌డంలోనూ ఆయ‌న విఫ‌ల‌మ‌య్యారు. ఆర్టిస్టులంద‌రినీ ఒక గ్రూప్ ఫోటోకి పోజివ్వ‌మ‌న్న‌ట్టుగా ఒక‌చోట‌కి చేర్చారు త‌ప్పిస్తే వాటిని పండించ‌డంపై దృష్టిపెట్ట‌లేద‌నిపిస్తుంది. హాస్యం విష‌యంలోనూ కాలం చెల్లిపోయిన సన్నివేశాల్నే న‌మ్ముకున్నారు. దాంతో సినిమాలో ఏ ఒక్క స‌న్నివేశం కూడా కొత్త‌గా అనిపించ‌దు. తొలి స‌గ‌భాగం తేజ్‌, కుటుంబం, అత‌ని మిత్ర‌బృందం నేప‌థ్యంలో సాగుతుంది. అక్క‌డ‌క్క‌డా కాసిన్ని స‌న్నివేశాలు న‌వ్విస్తాయి. అంతకుమించి చెప్పుకోద‌గిన విష‌యాలేమీ లేవు. గోపీసుంద‌ర్ ట్యూన్స్‌లో మిగిలిన పాట‌ల‌తో పోల్చితే అంద‌మైన చంద‌మామ నువ్వేనా.. సాంగ్ బావుంది. నేప‌థ్య సంగీతం ప‌రావాలేదు. అండ్రూ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ప్రతి సీన్ ఫ్రెష్‌లుక్‌తో క‌న‌ప‌డింది. ఇక న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. సాయిధ‌ర‌మ్ తేజ్ న‌ట‌న బావుంది. లుక్ ప‌రంగా కూడా త‌ను బావున్నాడు. అలాగే అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ రోల్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. త‌ను కూడా పాత్ర ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించింది. ఇక జ‌యప్ర‌కాశ్‌, ప‌విత్రా లోకేశ్‌, పృథ్వీ, వైవా హ‌ర్ష‌, అనీశ్ కురువిల్లా త‌దిత‌రులు చ‌క్క‌గా న‌టించారు. అయితే ప్రేమ‌క‌థా చిత్రాల్లోని స‌న్నివేశాలు ఎమోష‌నల్‌గా ప్రేక్ష‌కుడికి క‌నెక్ట్ కావాలి. అది తేజ్ చిత్రంలో మిస్ అయ్యింది.బ‌లం లేని క‌థ‌ని అటు ఇటు తిప్పి సాగ‌దీసిన ఓ వృథా ప్ర‌య‌త్న‌మే ఈ చిత్రం.
ప్లస్ పాయింట్స్ :
+ సాయి ధరమ్ తేజ్ న‌ట‌న‌
+ సినిమాటోగ్ర‌ఫీ
మైన‌స్ పాయింట్స్‌ :
– పాత చింతకాయ పచ్చడి కథ
– కరుణాక‌ర‌న్ సినిమాల్లోని కామెడీ మిస్ అవ్వడం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.