టీడీపీ పోటీ చేసేది ఆ రెండు స్థానాల్లోనేనట

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ వెలుగు వెలిగింది తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకున్న ఆ పార్టీ తెలంగాణలో మాత్రం టీడీపీ ప్రభ మసక బారుతోంది. 2014 ఎన్నికల తర్వాత నాయకులను కోల్పోయిన ఆ పార్టీ.. ముందుస్తు ఎన్నికల తర్వాత చోటా లీడర్లను కూడా పోగొట్టుకునే పరిస్థితికి చేరింది. రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టినా ఇటీవల జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఘోర పరాభావాన్ని చవి చూసింది. పొత్తుల్లో భాగంగా 13 నియోజకవర్గాల్లో పోటీ చేసినా కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో తెలంగాణలో ఆ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ కారణంగానే లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నా పోటీపై స్పష్టత లేదు. ఇటీవల స్థానికంగా, హైదరాబాద్‌లో నిర్వహించిన అంతర్గత సమావేశాల్లో కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఇరు రాష్ట్రంలో ఉన్న పార్టీ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ప్రజాకూటమిలో ఇతర పార్టీలతో టీడీపీ కొనసాగుతుందా..? కొత్త పొత్తులేమైనా ఉంటాయా..? లేక ఒంటరిగానే బరిలోకి దిగుతుందా..? అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ నిర్వహించారు. అక్కడ కూడా ప్రజాకూటమి పొత్తు మళ్లీ కొనసాగుతుందా ? లేదా అన్న విషయంపై స్పష్టత రాలేదు. ఎన్నికల సందర్భాన్ని బట్టి నిర్ణయం ఉంటుందని సూచించినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రజాకూటమి ఘోర పరాజయం, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందా..? లేదా అనే విషయంపై ఓ వార్త బయటికి వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ పార్టీ రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోందని తెలుస్తోంది. అందులో ఒకటి మల్కాజిగిరి కాగా, రెండోది మహబూబాబాద్. దేశంలోనే పెద్దదైన మల్కాజిగిరి స్థానాన్ని గెలుచుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్లారెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ తరపునే పోటీ విజయం సాధించారు. తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన టీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యారు. సో, సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరిని మరోసారి దక్కించుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. అయితే, ఇక్కడ పోటీ చేయబోయే అభ్యర్థి ఎవరనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇంకో స్థానమైన మహబూబాబాద్ నుంచి బానోతు మోహన్‌లాల్ పోటీ చేయబోతున్నట్లు ఇటీవల వార్త వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.